బ్యాలెన్స్‌ నిల్‌  

13 Jul, 2020 00:10 IST|Sakshi

గోల్డ్‌ మెడల్‌కు రెండే సెకన్ల దూరం. ద్యుతీ చంద్‌ రీచ్‌ అవుతుందా? ఇరవై ఐదు లక్షలుంటే అవుతుంది. ఒలింపిక్స్‌శిక్షణకు ఆ డబ్బు. రెండేళ్ల క్రితమే కదా మూడు కోట్లు వచ్చింది! కోట్లు చూసుకొనుంటే బాగానే ఉండేది. లాక్‌డౌన్‌లో పస్తుల్ని చూసింది. కాలే కడుపుల్ని... తన బ్యాంక్‌ బ్యాలెన్స్‌తో నింపింది.

రెండేళ్ల క్రితం ఇరవై రెండేళ్ల వయసులో ద్యుతీ చంద్‌ కోటీశ్వరురాలు. రెండేళ్ల తర్వాత ఇరవై నాలుగేళ్ల వయసులో ఇప్పుడు ఆమె నిరుపేద! నిరుపేద అంటే తిండికి లేకపోవడం కాదు. ఒలింపిక్స్‌కు శిక్షణ తీసుకోడానికి 25 లక్షల రూపాయలు లేకపోవడం. నాలుగేళ్ల క్రితం రియోలో ఆమె పరుగు మొదటి రౌండ్‌తోనే ఆగిపోయింది. అప్పట్నుంచీ పంతం ఆమెను దహించి వేస్తోంది. అయితే కరోనా లాక్‌డౌన్‌లో పూట గడవని వాళ్ల ఆకలితో పోలిస్తే, తన పతకం పెద్దపులేం కాదని ద్యుతీ అనుకున్నట్లుంది. వారి కోసం తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్నీ ఖర్చుపెట్టేసింది. కరోనా రాకుండా ఉంటే, ఈ ఏడాది జరగవలసిన టోక్యో ఒలింపిక్స్‌ జరిగి ఉంటే ఆమె పంతం నెగ్గి, పతకం సాధించుకుని వచ్చేది కావచ్చు. 

టోక్యోలో ఈ ఏడాది వాయిదా పడిన ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది జూలైలో జరుగుతున్నాయి. ద్యుతీ స్టార్‌ స్ప్రింటర్‌. వంద మీటర్లు, రెండొందల మీటర్ల పరుగు పందెంలో బరిలోకి దిగేందుకు ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రమైన ఒడిశాలోని భువనేశ్వర్‌లో కఠినమైన సాధనే చేస్తోంది. ఆమె కోచ్‌ రమేశ్‌ హైదరాబాద్‌ నుంచి ఆమె సాధనలోని పురోగతిని ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు ఇస్తున్నారు. వంద మీటర్ల పరుగులో ఇప్పటి వరకు ద్యుతీ రికార్డు 11.22 సెకన్లు, 200 మీ.లో 23.17 సెకన్లు.
ఫేస్‌బుక్‌లో ద్యుతీ అమ్మకానికి పెట్టిన కారు. తర్వాత ఆ పోస్టును ద్యుతీ తొలగించింది

వచ్చే టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె స్వర్ణ పతకం సాధించాలంటే.. 2016 రియోలో ఈ రెండు ఈవెంట్‌లలో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకున్న జమైకా ఉమన్‌ స్ప్రింటర్‌ ఎలైన్‌ థాంప్సన్‌ను దాటిపోయేలా అయినా టైమ్‌ని గ్రిప్‌లోకి తీసుకోవాలి. ఎలైన్‌ 10.71, 21.78 సెకన్‌లలో రెండు బంగారు పతకాలు సాధించింది. ఎలైన్‌ గోల్డ్‌కి, ద్యుతీ గోల్డ్‌ లక్ష్యానికి మధ్య వ్యత్యాసం కేవలం 0.51, 1.39 సెకన్లు మాత్రమే. ఆ సమయాన్ని తగ్గించడానికే ఇప్పుడు ద్యుతీకి 25 లక్షల రూపాయలు కావాలి. జర్మనీలో శిక్షణ తీసుకోవాలని అనుకుంటోంది ద్యుతీ. 

పంజాబ్‌లోని పాటియాలాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగవలసిన ఫెడరేషన్‌ కప్‌ అథ్లెట్‌ మీట్‌ కరోనా వల్ల రద్దయిన తర్వాత ప్రాక్టీస్‌ కోసం ద్యుతీ భువనేశ్వర్‌లోనే ఉండిపోయింది. లాక్‌డౌన్‌లో ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకుని రోజంతా కళింగ స్టేడియంలోనే గడుపుతోంది. అయితే ఈ దేశీయ సాధన అంతర్జాతీయ పోటీలకు సరిపోదు. అందుకే విదేశాలకు వెళ్లడం కోసం తన లగ్జరీ సెడాన్‌ బి.ఎం.డబ్లు్య. కారుని ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టింది. అందుకు తనేమీ సంశయించలేదు. స్పాన్సరర్‌లు ఎవరూ ముందుకు రావడంలేదు మరి.

శిక్షణ కోసం తను ఏ దేశానికి వెళ్లవలసిందీ సూచించేది చివరికి ‘అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’నే అయినప్పటికీ ద్యుతీ మాత్రం జర్మనీని ఒక ఎంపికగా పెట్టుకుంది. అయితే ఫేస్‌బుక్‌లో కారును అమ్ముతున్నట్లు పోస్టు పెట్టగానే ‘ఆ అమ్మాయికి సహాయం చేయండి’ అని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కామెంట్‌లు మొదలవడంతో ద్యుతీ ఆ పోస్టును తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఒకటొకటిగా ఆటలు మొదలవుతున్నాయి. యూరప్‌లో ఫుట్‌బాల్, క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయి. ఇండియాలో కూడా సెప్టెంబరు నాటికి క్రీడా కార్యకలాపాలు ప్రారంభం కావచ్చనీ, అప్పటికి స్పాన్సరర్‌లు కూడా దొరికితే దొరకొచ్చనీ ద్యుతీ ఆశిస్తోంది.

యవ్వనంలోనే కోట్ల డబ్బును చూసిన ఈ అమ్మాయి.. యవ్వనంలోనే మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం చూస్తోంది. ఏమైంది అంత డబ్బు?! 2018లో జకార్తాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిశా ప్రభుత్వం ద్యుతీకి 3 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబంలోని అమ్మాయి ద్యుతీ. ఆ డబ్బుతో ఆమె సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. తల్లిదండ్రుల అప్పులు తీర్చింది. కారు కొనుక్కుంది. కొంత బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంచుకుంది. జాగ్రత్త పడలేదని మనం అనొచ్చు. ఎదురుగా పస్తులు ఉంటున్న వారిని చూస్తున్న కళ్లకు.. బ్యాంకులోని బ్యాలెన్స్‌ని భద్రంగా చూసుకోడానికి మనసొప్పుతుందా?
ఏషియన్స్‌ గేమ్స్‌లో ద్యుతీ సిల్వర్‌ మెడల్‌ సాధించినప్పటి చిత్రం

మరిన్ని వార్తలు