గురు దీపిక

5 Jul, 2020 04:49 IST|Sakshi

నాటి తొలి అడుగు

గోపిక ఆంటీ... నిజామాబాద్‌ పట్టణంలో ఈ తరం యువతులకు ఒక కరదీపిక. వృత్తి విద్యల్లో కెరీర్‌ను వెతుక్కోవాలనుకునే వాళ్లకు, కుటీర పరిశ్రమలతో ఉపాధి పొందాలనుకునే వాళ్లకు ఆమె ఒక గైడ్‌. ప్రభుత్వం రూపొందించిన పథకాలను అట్టడుగున ఉన్న మహిళలకు చేరవేస్తున్న వారధి. ఈ తరం మహిళకూ గడచిన తరం మహిళకూ మధ్య దూరాన్ని చెరిపి వేసి రెండు తరాలను దగ్గర చేసిన సంధాన కర్త. ముప్పై ఏళ్ల కిందటి సమాజానికి ఇప్పటి సమాజానికి మధ్య స్పష్టమైన తేడాను గమనించానన్నారామె.

‘‘నాకిప్పుడు అరవై ఏళ్లు. ముప్పై ఏళ్ల కిందట మహిళ అనే పదానికి గృహిణి అనే పదానికి పెద్ద తేడా ఉండేది కాదు. దాదాపుగా మహిళలందరూ గృహిణులే. వ్యాపారం, ఉద్యోగం కోసం బయటకు వెళ్లే భర్త కోసం ఉదయమే లేచి వండి పెట్టి, పిల్లలను చూసుకుంటూ ఇంటి పట్టున ఉండడమే చాలా మంది మహిళలకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్‌. ఇది మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి. పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలకు వెళ్లే వాళ్ల సంఖ్య కాలనీ మొత్తానికి కూడా వేళ్ల మీద లెక్కపెట్టేటంత తక్కవగానే ఉండేది. దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల మహిళలు విధిగా ఏదో ఒక పని చేస్తుండే వాళ్లు. మా దగ్గర మహిళలు ఇంట్లో ఉండి చేసుకునే పని అంటే బీడీలు చుట్టడమే ప్రధానమైనది. ఆ రోజుల్లో నేను నాకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలని కోరుకున్నాను.

నాకు గౌరవాన్నిస్తూ పదిమందికి ఉపయోగపడే పని కోసం ప్రయత్నించాను. అప్పట్లో మాకు కంప్యూటర్, ఇంటర్నెట్‌ అంటే ఏమిటో తెలియదు. మనలో వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇప్పుడు ఉన్నన్ని అవకాశాలు కూడా ఉండేవి కావు. అలాంటి రోజుల్లో టైలరింగ్, ఎంబ్రాయిడరీల్లో టెక్నికల్‌ ట్రైనింగ్‌ కోర్సు చేశాను. పది మంది ఉద్యోగులతో 2003లో సొంత యూనిట్‌ మొదలు పెట్టాను. మహిళలకు ఇలాంటి వృత్తుల్లో శిక్షణనిచ్చే అవకాశం నాకు వచ్చింది. అయితే అప్పట్లో మహిళలను చైతన్యవంతం చేయడానికి నేను గడపగడపా ఎక్కాల్సి వచ్చింది. ‘ఇంట్లోనే ఉండి బీడీలు చుట్టుకుంటున్నాం, గడపదాటకుండా పదోపరకో సంపాదించుకుంటున్నాం. ఇది చాలు’ అనే వాళ్లు.

ఎంతగానో చెప్పిన తర్వాత కానీ వాళ్లు కొత్త పని నేర్చుకోవడానికి ఇంటి గడపదాటే సాహసం చేయలేకపోయారు. వాళ్లకు పనిలో శిక్షణ కంటే శిక్షణకు సన్నద్ధం చేయడమే పెద్ద శ్రమ. ఇప్పుడు పూర్తిగా భిన్నం. ఆడపిల్లలు తమంతట తాముగా వచ్చి ‘ఆంటీ! కొత్త బ్యాచ్‌లు ఎప్పుడు మొదలవుతాయి? ఏయే కోర్సుల్లో ట్రైనింగ్‌ ఇస్తున్నారు? నేను ఈ ఎండాకాలం సెలవుల్లో శిక్షణ పూర్తి చేసుకోవచ్చా?’ అని అడుగుతున్నారు. తొలి అడుగు వేయడమే అత్యంత కష్టమైన పని. చిత్తశుద్ధితో ఆ పని చేయగలిగితే ఆ తర్వాత ప్రయాణం దానంతట అది సాగిపోతుంది. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి చేరి చిన్న ప్రయాణాన్ని మహాప్రస్థానంగా మార్చి వేస్తారు. ఇప్పుడు మా నిజామాబాద్‌లో నా దగ్గర నేర్చుకుని సొంతంగా యూనిట్‌లు పెట్టుకున్న వాళ్లే ఆరువందల మంది ఉన్నారు. నా దగ్గర మరో ఎనభై మంది పని చేస్తున్నారు.
గురువుకు సన్మానం చేసిన మహిళలు 

మనల్ని మనం మార్చుకోవాలి
ఒక పరిశ్రమ పెట్టే వరకు మన మీద మనకు పెద్దగా ఒత్తిడి ఉండదు. పరిశ్రమ బాధ్యత తలకెత్తుకున్న తర్వాత సమాజం మొత్తాన్ని ఒక కంట గమనిస్తూ ఉండాలి. కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసుకోవాలి, మనం తయారు చేస్తున్న ఉత్పత్తుల పట్ల జనంలో మోజు తగ్గుతుంటే ఆ విషయాన్ని కూడా వెంటనే పసిగట్టగలగాలి. మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఉదాహరణకు నేను కోర్సు చేసినప్పటికి టైలరింగ్, ఎంబ్రాయిడరీకి మంచి డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు వాటిలోనే విపరీతమైన మార్పులు వచ్చాయి.

అలాగే హస్తకళాకృతులకు ఆదరణ పెరిగింది. హైదరాబాద్‌లోని నాంపల్లి, శిల్పారామంలో ఎగ్జిబిషన్‌లలో స్టాల్‌ పెట్టాను. అక్కడ చూసిన కొత్త కళాకృతులను మా నిజామాబాద్‌కు పరిచయం చేశాను. ఆ ట్రైనర్లను తీసుకువచ్చి మా దగ్గర మహిళలకు ట్రైనింగ్‌ ఇప్పించాను. మా పుట్టిల్లు వరంగల్‌. అక్కడ జనపనార బాగా దొరుకుతుంది. ఆ నార నిజామాబాద్‌కు తెప్పించి మా వాళ్లకు జ్యూట్‌ టేబుల్‌ మ్యాట్‌లు, ఉట్టి, ఉయ్యాలల అల్లకం నేర్పించాను. ఏలూరులో తాటి ఆకు బుట్టలు, బ్యాగ్‌లు, కళాఖండాలు తయారు చేస్తారు. అవీ మేము నేర్చుకున్నాం. ఓ ఐదారేళ్లుగా జ్యూట్‌ బ్యాగ్‌ల తయారీ కూడా మొదలు పెట్టాం.

అభివృద్ది పథం
మహిళలు వృత్తి నైపుణ్యాలు పెంచుకుని స్వయం సహాయకంగా మారడంలో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డి, ఖాదీ గ్రామోదయ మహా విద్యాలయ, బాలానగర్‌లోని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, నెహ్రూ యువ కేంద్ర శిక్షణ ప్రాజెక్టులు మాకు బాగా ఉపయోగపడ్డాయి. వాళ్లు సొంత యూనిట్‌లు పెట్టుకోవడానికి మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు ముద్ర రుణాలు దోహదం చేస్తున్నాయి. ఈ మహిళలు తమ ఆడబిడ్డలను పెద్ద చదువులు చదివించడానికి ముందుకు వస్తున్నారు. స్వయం సాధికారత సాధించిన అసలైన విజయం అది’’ అన్నారు గోపిక. ఇక ఆమె కుటుంబ వివరాలకు వస్తే... భర్త లెక్చరర్‌. ముగ్గురబ్బాయిలు. ఒకబ్బాయి యూఎస్‌లో, ఇద్దరు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ‘‘పిల్లలు ముగ్గురూ కాలేజ్‌ చదువులకు హాస్టల్‌కెళ్లిన తర్వాత నేను సొంత యూనిట్‌ మొదలు పెట్టాను. దాంతో నా యూనిట్‌ ఎప్పుడూ నాతో ఉండే నాలుగో బిడ్డ అయింది’’ అన్నారు గోపిక.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా