టికెట్ తెగింది.. టెన్‌షన్ తీరాలి

9 Jul, 2015 23:38 IST|Sakshi
టికెట్ తెగింది.. టెన్‌షన్ తీరాలి

రాజమౌళికి ఇది పదవ సినిమా.
ఇప్పటికి నైన్ ఔటాఫ్ టెన్ హిట్లు.
టెన్ ఔటాఫ్ టెన్ కొడతాడని బెట్లు.
హిట్లు, బెట్లు పక్కన పెడితే తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని మెగా సైజ్ సినిమా... ‘బాహుబలి’.
బడ్జెట్...150 కోట్లు.
ఒక్క తెలుగు ఏరియాలనే 83 కోట్లకు అమ్మారట.
ఊర్లో థియేటరా? థియేటర్లోనే ఊరా? అన్నట్లు ఉంది సిచ్యుయేషన్.
మొదటి రోజు కలెక్షనే 25 కోట్లు ఉంటుందట.
అమెరికాలో ప్రీమియర్ షోలు 10 లక్షల డాలర్లు కూడబెడుతున్నాయట.

అంటే ఇవాళ హౌస్‌ఫుల్లులు ఖాయం.
ఇక... ‘బాహుబలి’ బ్యాటింగ్ ఎలా ఉంటుందో వెయిటింగ్!
యస్..! టికెట్ తెగింది. ఇక స్టామినా తేలాలి!

 
జూలై 8వ తేదీ. ఉదయం... హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్ ప్రాంగణంలో ఇసకేస్తే రాలనంత జనం. రిలీజ్ కానున్న సినిమాకు ఏదో ఒక రోజుకు ఏదో ఒక టికెట్ దొరక్కపోతుందా అని... గంటల తరబడిగా నిలుచున్న జనం. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సొచ్చింది.
    
సాయంత్రం 5 గంటలు... కాచిగూడలో ఐ-నాక్స్ మల్టీప్లెక్స్ ముందు విపరీతంగా జనం. తాకిడికి తట్టుకోలేక, బాక్సాఫీస్ కౌంటర్‌కు యాజమాన్యం షట్టర్లేసేసింది. ఆరుగంటలకి పోలీసుల అండతో అడ్వాన్స్ బుకింగ్ తెరిస్తే, కాంప్లెక్స్ దాటి బయట దాకా క్యూ.
 ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే కాదు... తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ, అన్ని చోట్లా దాదాపు ఇలాంటి పరిస్థితే.
 
ఊరంతా... అదే సినిమా!

 తెలుగు నాట 1800 థియేటర్స్‌లో, దేశవ్యాప్తంగా 4 వేల థియేటర్స్‌లో, విదేశాల్లో 350 స్క్రీన్స్‌లో వివిధ భాషల్లో ‘బాహుబలి’ని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత శోభూ యార్లగడ్డ చెబుతున్నారు. అన్ని థియేటర్లలో కాకున్నా, తెలుగు సినిమాకు సంబంధించి ఇంతవరకు అతి పెద్ద రిలీజ్ ‘బాహుబలే’. తెలుగునేలపై ఒకప్పుడు 2600 పైచిలుకు థియేటర్లుండేవి. తరువాత ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. మల్టీప్లెక్సుల్లోని ఒక్కో స్క్రీన్‌ను ఒక్కో థియేటర్‌గా లెక్కవేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 1700 దాకా థియేటర్లే మిగిలాయి. తెలంగాణలో (సినీ పరిభాషలో నైజామ్ ఏరియా)లో మొత్తం 500 చిల్లర థియేటర్లున్నాయి. వీటిలో 350కి పైగా హాళ్ళలో ‘బాహుబలి’ రిలీజ్. ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్న 125 పైగా హాళ్లలో 106 స్క్రీన్స్‌లో అదే.

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఊళ్ళలో అయితే, ఉన్న హాళ్ళన్నిటిలో ‘బాహుబలే’ ఆడుతున్నారు. ఆంధ్రా ఏరియాలోని ఏలూరులో ఉన్న 12 స్క్రీన్స్‌లోనూ, సీడెడ్ ఏరియాలో నంద్యాలలో ఉన్న 8 థియేటర్స్‌లోనూ అదే సినిమా. చిలకలూరిపేట లాంటి చిన్న ఊళ్ళో కూడా 11 హాళ్ళకు ఆరింటిలో ‘బాహుబలే’ వేస్తున్నారు. శుక్రవారం నాటి టాక్‌ను బట్టి ఈ థియేటర్ల సంఖ్య, ప్రదర్శించే షోల సంఖ్య మారుతుంది. దేశంలోని ముఖ్య నగరాల్లో, విదేశాల్లో తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అదనపు షోలకు పర్మిషన్ తీసుకున్నారు.

కళ్లు తిరిగేలా... వ్యాపారంతెలుగు వెర్షన్... భారీగా అమ్మకాలు ‘బాహుబలి’ తెలుగు వెర్షన్ (శాటిలైట్ రైట్స్ విక్రయించకుండానే) రూ. 83 కోట్ల మేర వ్యాపారం జరిగింది. తమిళ వెర్షన్... ఆదిలోనే లాభం ‘బాహుబలి’ తమిళ డబ్బింగ్ వెర్షన్‌ను శాటిలైట్ రైట్స్‌తో సహా రూ. 15 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఆ కొన్నవాళ్ళు మరో 3 కోట్లు లాభం వేసుకొని, మరొకరికి అమ్మేశారట. శాటిలైట్ రైట్స్ కూడా ఆ కొన్నవారివే కాబట్టి, అవి ఎంతకు అమ్ముడవుతాయో చూడాలి. ఒక్క తమిళనాటే ‘బాహుబలి’ తమిళ వెర్షన్ దాదాపు 450 స్క్రీన్స్‌లో రిలీజవుతున్నట్లు సమాచారం.

హిందీ వెర్షన్... కరణ్ జోహార్ అండదండ
 ‘బాహుబలి’ హిందీ వెర్షన్‌ను ప్రముఖ దర్శక - నిర్మాత కరణ్ జోహార్ ద్వారా నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హిందీలో థియేటరికల్ రిలీజ్ ద్వారా కనీసం రూ. 7 కోట్లు, శాటిలైట్ హక్కుల ద్వారా కనీసం రూ. 7 కోట్ల చిల్లర - మొత్తం మీద రూ. 15 నుంచి 20 కోట్ల దాకా వస్తుందని అంచనా.

మలయాళ వెర్షన్... రిలీజ్ ఉన్నట్లేనా?
దాదాపు 380 రోజులు షూటింగైన ‘బాహుబలి’ని ఏకకాలంలో తెలుగు, తమిళాల్లో తీశారు. తెలుగు నుంచి హిందీలోకీ, తమిళం నుంచి మలయాళంలోకీ డబ్బింగ్ చేశారు. మలయాళ వెర్షన్ రైట్స్ రూ. 6 కోట్లకు అమ్మారు. నాలుగు భాషల్లోనూ ఒకే రోజు రిలీజ్ చేయాలని అనుకున్నా, కడపటి సమాచారం ప్రకారం జూలై 10న మలయాళ వెర్షన్ విడుదల కావడం డౌటే. అక్కడ ‘ప్రేమమ్’ సినిమా పైరసీ గొడవను సాకుగా చూపి, థియేటర్స్ గురువారం నుంచి సమ్మెలో ఉన్నాయి. దాదాపు 250 హాళ్ళలో రిలీజ్ కావాల్సిన మలయాళ వెర్షన్ ఈ దెబ్బతో 50లోపు మల్టీప్లెక్స్ స్క్రీన్లకే పరిమితమయ్యేలా ఉంది. తమిళ సినిమాలు దాదాపు కేరళ అంతటా రిలీజవుతాయి కానీ, ఈ సమ్మె ఆగు తుందా లేదా అన్నదాన్ని బట్టి వాటి రిలీజ్ ఉంటుంది.
 
అంత డబ్బులు వచ్చేస్తాయా?
సరిగ్గా రెండేళ్ళ క్రితం 2013 జూలై 6న కర్నూలులో షూటింగ్ మొదలైన ‘బాహుబలి’ 380 రోజుల దాకా షూటింగ్ చేసుకొంది. అందులో 300 రోజుల దాకా యాక్షన్ సన్నివేశాలకే పట్టిందట. శుక్రవారం రిలీజవుతున్న ఫస్ట్ పార్ట్‌తో పాటు, సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా 40 శాతం దాకా అయిపోయింది. దీనికి దాదాపు 200 కోట్ల బడ్జెట్ అయినట్లు ప్రచారం. కానీ, లోతుగా తెలిసినవారు మాత్రం నిర్మాణం వరకు 140 నుంచి 150 కోట్ల దాకా ఖర్చయి ఉంటుందంటున్నారు.

 సినిమా షూటింగ్ ప్రధానంగా ‘ఈనాడు’ గ్రూప్‌కు చెందిన రామోజీ ఫిల్మ్‌సిటీ (ఆర్.ఎఫ్.సి)లోనే జరిగింది. ఆ రకంగా ఆర్.ఎఫ్.సి.కి కట్టాల్సినదే రూ. 78 కోట్లని కృష్ణానగర్ కబురు. కాగా, సత్యరంగయ్య లాంటి ప్రముఖ ఫైనాన్షియర్స్‌కు కట్టాల్సిన మొత్తం మరికొంత. ఆ రకంగా వంద కోట్ల పైగా నికర వసూళ్ళు (షేర్) వస్తే కానీ, అమ్మిన రేట్లకు తెలుగులో బ్రేక్ ఈవెన్ అవదు. ఇప్పటిదాకా ‘అత్తారింటికి దారేది’, అంతకు ముందు ‘మగధీర’ చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు. అయితే, అవి కూడా వట్టి బాక్సాఫీస్ వసూళ్ళ ద్వారా 100 కోట్ల షేర్ సాధించలేదు. ‘బాహుబలి’ ఆ రికార్డును కూడా సృష్టిస్తుందని ఆశాభావం.

మలేసియాలో... ఆల్రెడీ ప్రాఫిట్!
 మలేసియా వరకు ‘బాహుబలి’ రైట్స్ రూ. 7.5 లక్షలకు అమ్మారు. గురువారం అర్ధరాత్రి దాటాక అక్కడ 6 బెనిఫిట్ షోలు పడుతున్నాయి. వాటికి రూ. 18 లక్షల గ్రాస్ వసూలైనట్లు విశ్వసనీయ వర్గాల కథనం. ఖర్చులు పోగా బయ్యర్‌కు రూ. 9 లక్షల దాకా చేతికి వస్తోంది. అంటే, ఇప్పటికే ప్రాఫిట్ అన్నమాట. ఇక పైన వేసే షోల మీద వచ్చేదంతా అదనపు లాభమే!
 
బెనిఫిట్ షోల తెర వెనుక బాగోతం
 క్రేజున్న హీరో సినిమా దేనికైనా, రిలీజ్ టైమ్ కన్నా కొన్ని గంటల ముందే అభిమానులు ప్రత్యేక షోలు వేయడం అలవాటు. అయితే, ఈ పద్ధతి ‘బాహుబలి’తో పరాకాష్ఠకు చేరింది. గురువారం అర్ధరాత్రి దాటిన దగ్గర నుంచి శుక్రవారం ఉదయం లోగా దాదాపు 100 వరకు ‘బాహుబలి’ బెనిఫిట్ షోలు పడనున్నాయి. సామాన్య ప్రేక్షకుల కన్నా కొన్ని గంటల ముందే ఇలా ఈ సినిమా చూడాలంటే, ఒక్కో టికెట్‌కు కనిష్ఠంగా వెయ్యి రూపాయల నుంచి రూ. 3 - 4 వేల పైగా చెల్లించాలి.  

 చాలాకాలంగా ఈ బెనిఫిట్ షోల సంస్కృతి ఉన్నా, సాధారణంగా ఆ టికెట్ రేటు 500 నుంచి వెయ్యి దాకా ఉండేది. అప్పట్లో రెండున్నర నుంచి 4 లక్షలకు ఒక షోను డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్వాహకులు కొనుక్కొనేవారు. కానీ, ‘బాహుబలి’కి ఆ రేటు 8 లక్షల నుంచి 12.4 లక్షల దాకా ఎగబాకింది. అలాగే, కుకట్‌పల్లి లాంటి చోట రూ. 55 వేల దాకా కట్టే హాలు అద్దె ఈ సినిమాకు మాత్రం లక్ష అయింది. పోలీసు పర్మిషన్‌కి చేతి తడీ ఆ దామాషాలో పెరిగింది.

 అంత ఖర్చుపెడుతున్న నిర్వాహకులు ఆ డబ్బు వెనక్కి తెచ్చుకోవడానికి టికెట్ రేటును వేలల్లోకి పెంచేశారు. సగటున 700 టికెట్ల మీద 20 లక్షల దాకా వెనక్కి రప్పించుకోవడానికి ఒక్కో టికెట్ 3 వేలకు అమ్ముతున్నారు. ఇవన్నీ తెలిసినా, ప్రభుత్వ  యంత్రాంగం తెరిచిన కళ్ళతోనే, నిద్ర నటిస్తోంది. విచిత్రం ఏమంటే, కృష్ణాజిల్లా ‘బాహుబలి’ రైట్స్ పొందిన నిర్మాత సాయి కొర్రపాటి అక్కడ ఏకంగా 30 బెనిఫిట్ షోలు వేస్తున్నారు. అదేమంటే, ఆ డబ్బు ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ నిర్మాణానికి ఇస్తామని ప్రకటించారు.
 
అఫిషియల్‌గానే... బ్లాక్‌లో! ప్రభుత్వ ఖజానాకు గండి!!
గురువారం నాడు సినీ రంగంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఆఫీసులన్నీ ‘బాహుబలి’ టికెట్ల హంగామాలోనే తీరిక లేకుండా ఉన్నాయి. సన్నిహితులు, అధికారుల నుంచి టికెట్ల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మరోపక్క, థియేటర్ కౌంటర్‌లోనే అధిక రేటుకు టికెట్ అమ్మే ‘అఫిషియల్ బ్లాక్‌మార్కెటీరింగ్’ తెలుగు నేల అంతటా నడుస్తోంది.

నిజానికి, ‘బాహుబలి’కి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతించాలంటూ చిత్ర యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలనూ సంప్రతించింది. శతవిధాల ప్రయత్నించింది. అయితే, ప్రభుత్వాలు అంగీకరించలేదు. దాంతో, పెద్ద రేట్లు పెట్టి ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళకు భారీగా అడ్వాన్సులిచ్చిన ఎగ్జిబిటర్లు అనివార్యపరిస్థితుల్లో అనధికారికంగానే టికెట్ రేట్లు పెంచేశారు. కౌంటర్‌లో ఇచ్చే టికెట్ మీద గవర్నమెంట్ రేటు ఉంటుంది. కానీ, ఆ టికెట్ కోసం కౌంటర్‌లో ఇవ్వాల్సిన డబ్బు మాత్రం అంతకు మూడు, నాలుగు రెట్లు.   ప్రభుత్వాలకు కట్టే వినోదపు పన్ను మాత్రం టికెట్ మీద ప్రింటైన గవర్నమెంట్ రేట్ వంతునే కడతారు. అంటే పైన వసూలు చేసిన ఎక్‌స్ట్రా సొమ్మంతా ఎకౌంట్ లేని మనీగా, పన్ను కట్టని డబ్బుగా సినిమావాళ్ళ జేబుల్లోకి వెళుతుందన్నమాట.
 
రాజధానిలోనూ... ‘డిమాండ్ అండ్ సప్లై’ సూత్రం

చివరకు హైదరాబాద్ నడిబొడ్డులోని బడా మల్టీప్లెక్స్‌లు సైతం రూ. 120 టికెట్‌ను కనీసంలో కనీసంగా రూ. 200 దాకా అమ్ముతున్నాయి. అదేమంటే, ‘కాంబో ప్యాక్’ పేరు చెప్పి, కోక్, పాప్‌కార్న్ ఇస్తామంటున్నాయి. ప్రేక్షకుడు టికెట్ కావాలంటే, ఆ పిచ్చి పాప్‌కార్న్ అవసరం లేక పోయినా ఆ కాంబో రేటుకు కొనాల్సిందే!

 ఈ విషయాలన్నీ తమ కను సన్నల్లోనే జరు గుతున్న చిత్ర యూనిట్ ఏమీ చేయ లేమంటోంది. అదేమంటే, సినిమా కూడా ఒక ప్రొడక్టే కాబట్టి, ‘డిమాండ్ అండ్ సప్లై’ తప్పదని నిర్మాతల మాట. దురదృష్టం ఏమిటంటే, క్రేజున్న ప్రతి తెలుగు సినిమాకూ ఈ అన్‌హెల్దీ ప్రాక్టీస్ ఆచరణలో ఉంది. అయితే, ‘బాహుబలి’ ఈ తప్పుడు ‘బ్లాక్ మార్కెట్’ ధోరణిని శిఖరాగ్రానికి చేర్చడమే కాక, అందరి దృష్టీ పడేలా చేసింది.
 
కోర్టులో... పోలీస్ స్టేషన్‌లో వివాదాల వాన
 విచ్చలవిడిగా తయారైన ఈ ‘బాహుబలి’ టికెట్ల బ్లాక్‌మార్కెటింగ్ మీద, ఈ క్రేజుతో రేపు థియేటర్ల వద్ద జరిగే ప్రమాదమున్న ప్రాణనష్టం మీద ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇప్పటికే కోర్టులో కేసు పడింది. హైదరాబాద్‌లోని ‘అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం’ అధ్యక్షుడైన హైకోర్ట్ అడ్వకేట్ గుండ్లపల్లి లక్ష్మీనరసింహరావు గురువారం కోర్టు తలుపు తట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సి.పి.ఐ, సి.పి.ఎం తదితర రాజకీయ పక్షాల నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు కూడా ఈ అవాంఛనీయ ధోరణిని నిరసిస్తూ గొంతు కలిపారు. అలాగే, ‘యూ ట్యూబ్’లో విడుదలైన సినిమా క్లిపింగ్ ప్రకారం ‘మాల’ కులస్థులను కించపరిచేలా చిత్రంలో ‘బాహుబలి’లో డైలాగులు ఉన్నాయంటూ, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్‌ప్రసాద్, తదితరులు హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ‘బాహుబలి’ బృందం స్పందించలేదు. అయితే, థియేటర్‌లో రిలీజైన వెర్షన్‌లో ‘మాల’ల్ని కించపరిచే అంశాలుంటే, వదిలేది లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.

ఏమైనా, ‘బాహుబలి’ దెబ్బకు కొత్త సినిమాలేవీ ప్రస్తుతం రిలీజ్‌కు రావడం లేదు. ఉన్న చిన్న సినిమాలు ఫరవాలేదనిపించేలా ఆడుతున్నా, వాటిని థియేటర్లలో ఉంచే పరిస్థితి లేదు. వెరసి, ప్రేక్షకులు, అభిమానుల బలహీనతలే ఆసరాగా... ప్రభుత్వ యంత్రాంగపు నిర్లిప్తత సాక్షిగా... బాక్సాఫీస్ మైదానమంతా ‘బాహుబలి’కి అప్పనంగా అంది వచ్చింది. మరి, ఈ మార్కెటింగ్ హైప్‌కు దీటుగా మూడేళ్ళ ఈ సెల్యులాయిడ్ శిల్పం ఉంటుందా? శుక్రవారం పొద్దున్న హాలులో ప్రేక్షకుల తీర్పు కోసం లెటజ్ వెయిట్ అండ్ సీ!
 
 ఇవాళ ఎంతొస్తుంది?
 ఇన్ని వందల థియేటర్లలో రిలీజై, వేల కొద్దీ రేటుకు టికెట్లు అమ్ముడవుతున్న ‘బాహుబలి’ రేపు వసూళ్ళలోనూ సహజంగానే కొత్త అధ్యాయం రాసే సూచనలున్నాయి. తెలుగు నేలపై నూటికి 90 దాకా థియేటర్లలో ఈ శుక్రవారం ‘బాహుబలి’ సినిమానే వేస్తున్నారు. తెనాలి, నరసరావుపేట, కర్నూలు, పొద్దుటూరు లాంటి అన్నిచోట్లా హాలులోకి అడుగు పెట్టాలంటే, వందల్లో డబ్బు కట్టాల్సిందే. థియేటర్ ఫుల్ కెపాసిటీ కేవలం రూ. 15 వేలే అయినా, లక్షన్నర పైగా వస్తోందంటే ఈ ఫ్లాట్ టికెట్ రేట్ల చలవే. ఆ లెక్కన ఫస్ట్ డే ‘బాహుబలి’కి వచ్చే రెవెన్యూ గురించి రకరకాల అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ. 25 కోట్ల దాకా షేర్ వస్తుందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒకరు చెప్పారు.
 
తెలివైన నిర్మాతలు... తెలివితేటల పబ్లిసిటీ
 పబ్లిసిటీలోనూ ‘బాహుబలి’ ట్రెండ్‌సెట్టర్. చిత్ర నిర్మాణం మొదలైనప్పటి నుంచి అనధికారిక లీక్‌లు, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో సమాచారం వెల్లడించడం మినహా ప్రత్యేకించి ఖర్చుపెట్టి, పబ్లిసిటీ చేయలేదు. మీడియాను విభజించి, ఎంపిక చేసుకున్న కొన్ని పేపర్లకూ, టీవీలకు మాత్రం యూనిట్ ఇంటర్వ్యూలిచ్చింది. ఆ మాటకొస్తే అధికారికంగా ఆ టీమ్ పెట్టిన ప్రెస్ మీట్లు కూడా రెండే రెండు. ఒకటి - ఆడియో వాయిదా గురించి చెప్పడానికి, రెండోది- పైరసీని అడ్డుకోవాలంటూ మూడు రోజుల క్రితం పెట్టినది. మధ్యలో ఆడియో రిలీజ్ వేడుక తిరుపతిలో జరిగింది. ఇక, సినిమా సెన్సారయ్యాక, ‘జూలై 10న రిలీజ్’ అంటూ నాలుగు న్యూస్‌పేపర్లకు ఇచ్చిన ప్రకటనలు తప్ప, ఇప్పటి దాకా పేపర్‌లో, టీవీలో, రేడియోలో ఈ సినిమాకు యాడ్సే ఇవ్వలేదన్నది విచిత్రమైన నిజం. అందుకే, ‘రేపే విడుదల’ లాంటి పేపర్ ప్రకటనలేవీ ఇవ్వకుండా విడుదలవుతున్న మొట్టమొదటి భారీ తెలుగు సినిమా కూడా ఇదే! మీడియా వెంట తాను పడకుండా, మీడియానే తన వెంట పడేలా చేసుకోవడానికి నిర్మాతలు, ఈ చిత్ర బృందం చూపిన తెలివితేటలు, తద్వారా సినిమాకు సృష్టించిన హైప్ అనూహ్యం.
 
భీమవరంలో... భలే క్రేజ్
 కోడిపందాల లాంటి అనేక విలాసాలకు కేరాఫ్ అడ్రసైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ‘బాహుబలి’కి వినూత్నంగా సిద్ధమైంది. హీరో ప్రభాస్‌కు అక్కడ ప్రాబల్యం ఎక్కువ. గుర్రాలు, ఏనుగులు, సినిమాలో వాడిన యుద్ధ సామగ్రితో కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు. అందుకు ఏర్పాట్లూ చేసుకున్నారు. దాదాపు 40 దాకా గుర్రాలు, ‘బాహుబలి’ ఆయుధాలు కూడా ‘ఆంధ్రా లాస్‌వేగాస్’ అని అందరూ అనుకొనే భీమవరానికి చేరాయి. అయితే, ఈ రకమైన ర్యాలీలు సామాజిక వర్గాల పరంగా లేనిపోని ఉద్రిక్తతలకు దారి తీస్తాయని జిల్లా ఎస్పీ గుర్తించారు. ఈ ర్యాలీని అనుమతిస్తే, రేపు ఇతర వర్గాల హీరోల సినిమాలకూ ర్యాలీల బెడద ఉంటుందని గ్రహించి, ఆఖరు నిమిషంలో అనుమతి నిరాకరించారు. ఈ పరిణామంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురైనా, భీమవరంలోని మొత్తం 14 స్క్రీన్స్‌లోనూ (6 థియేటర్లలో 10 స్క్రీన్‌లు, ఒక మల్టీప్లెక్స్‌లో 4 స్క్రీన్‌లు) ఇవాళ ‘బాహుబలి’ రిలీజ్ చేస్తున్నారు. అన్ని హాళ్లలోనూ బెనిఫిట్ షోలూ వేస్తున్నారు. ఒక్కో టికెట్ ధర రూ.2 వేల పైనే. ఇక, మామూలు షో టికెట్ కూడా అసలు రేటు 50 అయితే, అమ్ముతున్నది కనీసం రూ.200కి!
 - రెంటాల జయదేవ
 
తెలుగులో ఎంతకు కొన్నారంటే..
ఏరియాల వారీగా  ఈ చిత్ర ప్రదర్శన హక్కులు అమ్ముడైన రేట్లు...
నైజామ్ ఏరియా రూ.22.5 కోట్లు  (కొన్నది - ‘దిల్’ రాజు)
సీడెడ్ - 13 కోట్లు (నిర్మాత సాయి కొర్రపాటి )
ఆంధ్రా ఏరియా ఏ వైజాగ్ -7.10 కోట్లు (ఏ.వి. ఫిల్మ్స్. ప్రభాస్ బంధువులు)
ఈస్ట్ గోదావరి - 5 కోట్లు (ఓం సాయి మణికంఠ ఫిల్మ్స్ - అమలాపురం)
వెస్ట్ గోదావరి - 4 కోట్లు (ఉషా పిక్చర్స్ వి.వి. బాలకృష్ణారావు)
కృష్ణా - 5 కోట్లు (ఓ ప్రముఖ హీరోతో కలిసి సాయి కొర్రపాటి)
గుంటూరు - 6.5 కోట్లు (వెంకటేశ్వర క్రియేషన్స్)
నెల్లూరు - 3.15 కోట్లు (గ్రేట్ ఇండియా)
కర్ణాటక - 8 కోట్లు (సాయి కొర్రపాటి )
విదేశాలు - 9 కోట్లు
 
రాజమౌళికి జూలై నెల బాగా అచ్చొచ్చింది. సింహాద్రి, మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలు జూలైలోనే విడుదల అయ్యాయి.
 
 చికెన్ కొంటే...  టికెట్ ఫ్రీ

‘బాహుబలి’ టికెట్లకున్న క్రేజ్ సరికొత్త మార్కెటింగ్‌కు దారి తీసింది. నెల్లూరులో ఒక చికెన్ షాప్ ఓపెన్ చేస్తున్న పెద్దమనిషి తమ దగ్గర కనీసం రూ. 500కి చికెన్ కొంటే ఒక టికెట్, వెయ్యి రూపాయలకు చికెన్ కొంటే రెండు టికెట్స్ ఫ్రీ అని ప్రకటించారు. ‘బాహుబలి’ మార్కెటింగ్ బాహుబలి టీమ్‌దైతే, చికెన్ షాపు మార్కెటింగ్ చికెన్ షాప్‌ది!

మరిన్ని వార్తలు