విశ్వాస దృక్పథం అంటే అదే!

19 Feb, 2017 00:17 IST|Sakshi
విశ్వాస దృక్పథం అంటే అదే!

మనం అడుగకుండానే దేవుడు మనకిచ్చిన అత్యంత అమూల్యమైన కానుక మన జీవితం! మనల్ని పుట్టించడంలో పదిమందీ మన ద్వారా ప్రయోజనం పొందాలన్నది దేవుని సంకల్పం. అలా అందరికీ ఆశీర్వాదకరంగా బతికేవారు తాత్కాలికంగా శ్రమ పడ్డా దేవుడిచ్చే అనూహ్యమైన ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. కాని దేవుడిచ్చిన జీవితాన్ని చాలా భద్రంగా బతుకుతూ ఎవరికీ ప్రయోజనం చేకూర్చకుండా తమ కడుపు తాము చూసుకునే బాపతు వారు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో దెబ్బ తినక తప్పదు. అంతా దేవుని నుండి విలువైన ఈవులు కోరుకుంటారు.

కాని ఆయన మనకిచ్చిన జీవితాన్ని మించిన విలువైన కానుక మరొకటి లేదు. అందువల్ల ఈ ‘కానుక’కు సంబంధించి దేవునికి ఒక రోజున లెక్క ఇవ్వాల్సి ఉంటుందన్న గ్రహింపుతో జీవిస్తే, పదిమందికీ ఆశీర్వాదకరంగా ఉంటే, దేవుడు తనవంతుగా వెయ్యింతల ఆశీర్వాదాలు జత చేస్తాడు. కాని ‘మా జీవితం–మా ఇష్టం’ అనుకుంటే దేవుని కృపకు దూరమవుతారా, చివరికి అశాంతికి లోనవుతాం. మరి కొందరైతే మహానటులు! దేవుణ్ణి కూడా బోల్తా కొట్టించగలమనుకునే ప్రబుద్ధులు ఎంతో చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటారు కాని నిజానికి వాళ్లు చేసేదల్లా వాళ్ల కోసమే! ఎంతో సౌమ్యంగా మాట్లాడే యేసుక్రీస్తు ఇలాంటి వేషధారులనుద్దేశించి అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.

పక్కనే ఆకలితో అలమటించే వారిని కరుణించరు కాని, రోజూ పావురాలకు పిడికెడు గింజలు విదిల్చి పరలోకంలో బెర్తు కన్‌ఫర్మ్‌ చేసుకుందామనుకునే వారి పప్పులు దేవుని వద్ద ఉడకవు. విశ్వాసులు దేవుని హృదయ స్పందనను గ్రహించాలి. ఆకలి కేకలు, దౌర్జన్యం, పీడితుల ఆర్తనాదాలను ప్రతిఘటించాలి. విశ్వాసుల దృక్పథం, వైఖరి, చర్చలు, మాటల్లో ఆత్మీయతే నిస్వార్థత కాదు, సార్వత్రికత ఉండాలి. ఒక పాస్టర్‌ను ఎవరైనా చితకబాదితే వచ్చే ఆగ్రహం, ఒక పూజారిని, మసీదులో ముల్లాను ఎవరైనా కొట్టినా పెల్లుబకాలి! అదే సరైన విశ్వాస దృక్పథం, ఆత్మీయ విజయం!!
– రెవ.డాక్టర్‌ టి.ఎ. ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు