ధోనీ సాక్షిగా..

16 Apr, 2017 23:41 IST|Sakshi
ధోనీ పూర్వపు జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పతాకాన్ని సగర్వంగా ప్రదర్శిస్తున్న ధోనీ భార్య సాక్షిసింగ్‌ రావత్‌

ఇండియా సాక్షిగా... ధోనీ ఆడాడు.
క్రికెట్‌ సాక్షిగా... హెలికాప్టర్‌ షాట్‌ కొట్టాడు.
ఫ్యాన్స్‌ సాక్షిగా... బౌలర్‌లను ఉతికేశాడు.
ఓటమి సాక్షిగా... విజయాన్ని సాధించాడు.
ప్రేమ సాక్షిగా... ప్రియురాలిని వెంటాడాడు.
పంచభూతాల సాక్షిగా... ఆమెను పెళ్లాడాడు.
ఇప్పుడు...
ధోనీ సాక్షిగా... సాక్షి సింగ్‌ రావత్‌
ధోనీ విమర్శకులపై తిరగబడుతోంది.
ధోనీని కాపాడుకుంటోంది.


ఐదు అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉండే సాక్షి ధోనీ తన బరువు ఎప్పుడూ 50 కిలోలు మించకుండా జాగ్రత్త పడుతుంటారు. అంతేకాదు, తన భర్త ‘వెయిట్‌’ తగ్గకుండా ఎప్పటికప్పుడు అతడి చుట్టూ ఉన్న ప్రపంచంపై ఆమె ఓ కన్నేసి ఉంచుతారు. ‘రామ్‌ ప్రసాద్‌ గోయెంకా’ కంపెనీ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా ఈ నెల 6న ట్వీటర్‌లో ‘రైజింగ్‌ పుణె సూపర్‌జయెంట్‌’ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను ప్రశంసిస్తూ... తన భర్తను చిన్నబుచ్చేలా ట్వీట్‌ చేయడాన్ని ఆమె ఏమాత్రం సహించలేకపోయారు.  Smith proves who's the king of the jungle. Overshadows Dhoni totally. Captains innings. Great move to appoint him as captain మృగరాజెవరో స్మిత్‌ నిరూపించాడు. ధోనీని మించిపోయాడు. కెప్టెన్‌ ఆడితే ఎలా ఉంటుందో చూపించాడు.

స్మిత్‌ని పుణె టీమ్‌ కెప్టెన్‌ని చెయ్యడం గొప్ప నిర్ణయం) అని హర్ష్‌ గోయెంకా చేసిన ట్వీట్‌ని ధోనీ తేలిగ్గా తీసుకోగలిగారు కానీ, అతడితో ఏడడుగులు నడిచిన బాల్య స్నేహితురాలు సాక్షి మాత్రం తనకు పట్టనట్టు ఉండలేకపోయారు. వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. ఎల్లో జెర్సీ వేసుకుని, తన భర్త కెప్టెన్‌గా ఉన్న పూర్వపు జట్టు ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ హెల్మెట్‌ను తలపై ధరించి తీసుకున్న సెల్ఫీనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి  ‘త్రోబ్యాక్‌’ అనే కామెంట్‌ పెట్టారు సాక్షి! దీనర్థం.. ధోనీలో మునుపటి సత్తా ఎక్కడికీ పోలేదు అని చెప్పడం.

ఐపీఎల్‌ తొలినాళ్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ధోనీని దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించి కాంట్రాక్టుకు తీసుకుంది! ధోనీకి అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపును ఇచ్చింది ఆ కాంట్రాక్టే. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకుంది. 2010 చాంపియన్స్‌ లీగ్‌ ట్వెంటీ 20 కూడా దక్కించుకుంది. ఇప్పుడు అతడి భార్య సాక్షి తన తలపై ధరించి, సెల్ఫీ తీసుకున్న హెల్మెట్‌ ఆ టీమ్‌దే. (చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పుడు ఐపీఎల్‌లో లేదు. బెట్టింగ్‌ వివాదమై ప్రస్తుతం అమలులో ఉన్న రెండేళ్ల నిషేధం పూర్తయ్యాక తిరిగి 2018లో ఐపీఎల్‌లోకి వస్తుంది.) ధోనీ ప్రస్తుతం పుణె సూపర్‌జయెంట్స్‌కి ఆడుతున్నాడు. ఈ జట్టు ప్రాంఛైజీ ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా. ఆయన అన్నగారే ఇప్పుడు ధోనీపై కామెంట్‌ చేసిన హర్ష్‌ గోయెంకా.

ఈ ఏడాది ఐపీఎల్‌లో సంజీవ్‌ గోయెంకా ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి, అతడి స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు జట్టును అప్పగించాడు. దాంతో ధోనీ... ఆ టీమ్‌లో ఒక సభ్యుడిగా మాత్రమే అడుతున్నాడు. స్మిత్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని నాలుగు బాదుళ్లు బాది తన టీమ్‌ని గెలిపించడంతో అన్నగారు హర్ష్‌ గోయెంకా ఉద్వేగానికి లోనై ట్విట్టర్‌లో ‘ధోనీని తప్పించడం’అనే తన తమ్ముడిగారి గొప్ప నిర్ణయాన్ని అభినందించారు! ఇంతకుమించి ఇందులో ఏం లేదు. అయితే దీనిని సాక్షి తట్టుకోలేకపోయారు. ‘త్రోబ్యాక్‌’ అనే కామెంట్‌తో పాటు చిన్న కర్మసిద్ధాంతాన్ని కూడా సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌కు జోడించారు.

ఒక పక్షి బతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది. ఆ పక్షి చనిపోయినప్పుడు దానిని చీమలు తింటాయి. కాలం, పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి. జీవితంలో ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు. ఎవర్నీ బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండొచ్చు. కానీ కాలం నీ కన్నా శక్తిమంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చెయ్యడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి. మంచిమనసుతో ఆలోచించాలి. ఇదీ ఆ సిద్ధాంత సారాంశం.
దీనిపై హర్ష్‌ గోయెంకా స్పందనలు ఏమీ లేవు. విషయం అంతటితో సద్దుమణిగింది. కానీ ఫోకస్‌ సాక్షి మీదకు మళ్లింది. ఏమిటీ అమ్మాయి?! ధోనీ మీద మాట పడనివ్వదా? ఏ భార్య అయినా ఎందుకు పడనిస్తుంది? కానీ సాక్షి స్పెషల్‌. ధోనీ కొట్టింది ఒక్క రన్నే అయినా ఆ రన్‌ వెనుక ఆమె కొట్టే చప్పట్లు ఉంటాయి. లిప్‌ క్లాపులూ ఉంటాయి.

ఈ ఏడాది మార్చి చివరి వారంలో కూడా వార్తల్లోకి వచ్చారు సాక్షి.  ట్విట్టర్‌లో ధోనీ ఆధార్‌ వివరాలు బహిర్గతం కావడంపై ఆమె ఏకంగా కేంద్ర న్యాయ, సమాచార, సాంకేతిక శాఖల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. చుట్టూ ఇలా గట్టిగా అల్లుకుపోయి, రక్షణ కవచంలా నిలిచే భార్య ఉన్నప్పుడు ఏ భర్త మాత్రం ఎందులోనైనా ఎలా విజయం సాధించకుండా ఉంటాడు?

ఎలా పరిచయం?
సాక్షి కొన్నాళ్లు రాంచిలోని డీఏవీ శ్యామలి స్కూల్‌లో చదివింది. అక్కడే ధోనీ కూడా చదివాడు. అలా వాళ్లిద్దరూ బాల్యస్నేహితులు. స్కూల్లో ఎప్పుడూ ఇద్దరూ కలిసి కనిపించేవారు. సాక్షి కుటుంబం డెహ్రాడూన్‌కి వెళ్లి్లపోయింది. సాక్షి తండ్రి, ధోనీ తండ్రీ ‘మెకాన్‌’ కంపెనీలో కొలీగ్స్‌. ఊరు మారడం వల్ల విడిపోయిన చాలా కాలం తర్వాత, 2007లో సాక్షి, ధోనీ తిరిగి కోల్‌కతాలోని తాజ్‌ బెంగాల్‌లో  కలుసుకున్నారు! అక్కడికి సాక్షి ఎడ్యుకేషనల్‌ ట్రైనింగ్‌ కోసం వచ్చింది. అప్పటికి ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు. అక్కడే ఇద్దరి ఉమ్మడి స్నేహితుడు యుద్ధజిత్‌ దత్తా ఇంట్లో కలుసుకున్నారు. ధోనీ, సాక్షి అంత దగ్గరగా మాట్లాడుకోవడం అదే మొదటిసారి.

ఎవరీ అమ్మాయి?
స్టార్‌ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోనీ భార్య. పూర్తి పేరు సాక్షిసింగ్‌ రావత్‌. వయసు 28. నవంబర్‌ 19న గౌహతిలో పుట్టింది. తల్లిగారిల్లు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో. అక్కడి వెల్హెల్మ్‌ గర్ల్స్‌ స్కూల్‌లో సాక్షి చదివింది. తర్వాత. రాంచి జవహర్‌ విద్యా మందిర్‌లో, ఆ తర్వాత ఔరంగాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. సాక్షి తండ్రి ఆర్‌.కె.సింగ్‌. తల్లి షీలా సింగ్‌. అక్క అభిలాష బిస్త్, తమ్ముడు అక్షయ్‌సింగ్‌... ఇదీ సాక్షి పుట్టిల్లు. వీళ్లది మధ్యతరగతి కుటుంబం. సాక్షి తండ్రి ‘బినగురి టీ కంపెనీ’లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.

ప్రేమ... చిగురించిన కాలం
సాక్షి, ధోనీ... యుద్ధజిత్‌ ఇంట్లో మాట్లాడుకున్నాక... మొదటిసారి ధోనీ వైపు నుంచి సాక్షికి టెక్స్‌ట్‌ మెసేజ్‌ వెళ్లింది. యుద్ధజిత్‌ నుంచి సాక్షి నెంబరు తీసుకుని మెసేజ్‌ పంపాడు ధోనీ. సాక్షి మెసేజ్‌ చూసుకుంది. నమ్మలేకపోయింది. అప్పటికే ధోనీ స్టార్‌. ప్రేమ అనగానే సాక్షి భయపడింది! ధోనీ వదల్లేదు. ఆమె వెంటపడ్డాడు. 2008లో వాళ్ల డేటింగ్‌ మొదలైంది. చిన్నప్పుడు స్కూల్లో కలిసి కనిపించినట్లే, లవ్‌లో పడ్డాక మాల్స్‌లో, రెస్టారెంట్‌లలో, క్రికెట్‌ మ్యాచ్‌లు అయ్యాకా... ఇద్దరూ కలిసి కనిపించడం మొదలైంది. తర్వాత రెండేళ్లకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలకు చెప్పారు. డేట్‌ ఫిక్స్‌ అయింది. 2010 జూలై 4న డెహ్రాడూన్‌ సమీపంలో పెళ్లయింది. కోహ్లీ, సచిన్, రోహిత్‌శర్మ, వీరేందర్‌ సెహ్వాగ్, శిఖర్‌ ధావన్‌ ఇషాంత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్, జడేజా, పుజారా.. ఇంకా ఇతర క్రికెట్‌ ప్లేయర్‌లు పెళ్లికి వచ్చారు. 2015లో సాక్షి దంపతులకు పాప పుట్టింది. జీవా అని పేరు పెట్టారు.

ఎం.ఎస్‌.ధోనీ : ది అన్‌టోల్డ్‌ స్టోరీ
గత సెప్టెంబర్‌లో ధోనీ బయోపిక్‌ ‘ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ విడుదలైంది. నీరజ్‌ పాండే డైరెక్ట్‌ చేశారు. పిక్చర్‌ హిట్‌ అయింది. 104 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీస్తే 215 కోట్ల రూపాయలు వసూలయ్యాయి! అసలు సినిమా రిలీజ్‌ అయిన మొదటి మూడు రోజుల్లోనే 66 కోట్లు వచ్చాయి. ఈ సినిమా చూశాక సాక్షి ధోనీ ఏం చేశారో తెలుసా? థియేటర్‌ నుంచి రాగానే కైరా అద్వానీకి ఫోన్‌ చేశారు. ఆమె నటనను ప్రశంసించారు. కైరా ఆ సినిమాలో ధోనీ భార్య పాత్ర వేశారు. అందులో అమ్మాయి నటన చూసి సాక్షి ముగ్ధులయ్యారట. అంతేకాదు, కైరా నటన బాగుందంటూ తనకు వచ్చిన మెసేజ్‌లను కైరాకు ఫార్వర్డ్‌ చేశారు.

మరికొన్ని విశేషాలు
కుకింగ్‌లో సాక్షి ఎక్స్‌పర్ట్‌. భర్త వెంట టూర్‌లకు వెళ్లినప్పుడు తనతో పాటు ఎలక్ట్రికల్‌ కుకర్‌ తీసుకెళతారు.
అనాథల కోసం సాక్షి ‘సాక్షి రావత్‌ ఫౌండేషన్‌’ నడుపుతున్నారు.
మరీ చిన్నప్పుడు గౌహతిలో అనుష్క శర్మ, సాక్షి కలిసి చదువుకున్నారు.
సాక్షి బెస్ట్‌ ఫ్రెండ్‌ పూర్ణ. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌ కూతురు పూర్ణ.


సాక్షిసింగ్‌ రావత్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సెల్ఫీ

>
మరిన్ని వార్తలు