సినిమా కథ! | Sakshi
Sakshi News home page

సినిమా కథ!

Published Mon, Apr 17 2017 12:01 AM

సినిమా కథ!

హ్యూమర్‌ ప్లస్‌

అందరూ సుష్టుగా భోంచేసిన తరువాత దర్శక నిర్మాతలతోపాటు రైటర్‌ కూడా కథ మీద కూచున్నారు. ‘‘ఓపెనింగ్‌ సీన్‌లోనే హీరో ఒక కర్ర తీసుకుని చావబాదుతాడు’’ చెప్పాడు రైటర్‌. ‘‘ఎవర్ని? ప్రేక్షకుల్నా?’’ అడిగాడు నిర్మాత. ‘‘అది రిలీజ్‌ తరువాత, ఇప్పుడిక్కడ రౌడీల్ని. ఈ సీన్‌ స్పెషాలిటీ ఏమంటే ప్రతి దెబ్బకీ ఒక కర్ర విరిగిపోతుంది. బుర్ర పగిలిపోతుంది.’’ ‘‘ఎందుకలా తన్నడం?’’ అడిగాడు డైరెక్టర్‌. ‘‘ఎందుకంటే చిన్నప్పుడు కర్రలు కొట్టి జీవించాడు. పెద్దయ్యాక కర్రతో కొట్టి జీవిస్తాడు కాబట్టి.’’ ‘‘నేను గాంధీ ఫాలోయర్ని. హింసను ఇష్టపడను. లవ్‌స్టోరీ ఉంటే చెప్పండి’’ అన్నాడు నిర్మాత.

‘‘హీరో లండన్‌లో ఉంటాడు. హీరోయిన్‌ జపాన్‌లో ఉంటుంది. ఇద్దరూ ఫ్లయిట్‌లో కలుసుకుంటారు. ఎందుకు ప్రేమిస్తున్నారో తెలుసుకోకుండా ప్రేమించుకుంటారు’’ కథ మార్చాడు రైటర్‌. ‘‘అంటే మూగ ప్రేమన్నమాట’’ అడిగాడు డైరెక్టర్‌.‘‘లాజికల్‌గా ఆ వర్డ్‌ కరెక్ట్‌ కాదు. ఎందుకంటే ఇద్దరూ పాటలు పాడుకుంటారు కాబట్టి. డ్యూయెట్ల తరువాత విడిపోయి ట్విట్టర్‌లో మెసేజ్‌లు పెట్టుకుంటూ వుంటారు. ఒకరోజు ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ కట్‌ అవుతుంది. ఆ కోపంలో హీరో వెళ్లి నెట్‌ సర్వీస్‌వాడ్ని హత్య చేస్తాడు.’’ ‘‘అదిగో, మళ్లీ వయలెన్స్, వద్దన్నానా?’’ అన్నాడు నిర్మాత.

‘‘హింస లేకుండా సినిమా కథ చేయలేమండి. కనపడే హింస, కనపడని హింస. ఈ రెంటిలో ఒకటి ఉండాల్సిందే’’ అన్నాడు రైటర్‌.‘‘హింసకి వ్యతిరేకి అని నేను చెప్పానా లేదా?’’ అని అక్కడున్న చాకును అందుకున్నాడు నిర్మాత. రైటర్‌ గజగజ వణుకుతూ డైరెక్టర్‌ వెనక దాక్కున్నాడు.‘‘నువ్వు కథలో రక్తపాతం చూపిస్తే, నేన్నీకు లైవ్‌లో చూపిస్తా’’ చాకుని గొంతు మీద నూరుతూ చెప్పాడు నిర్మాత.‘‘గాంధీ ఫాలోయర్ని అన్నారు కదండి’’ అన్నాడు రైటర్‌. ‘‘అవును థియరీ ప్రకారం గాంధీ శిష్యుడ్ని. ప్రాక్టికల్‌గా కత్తికి భక్తుడ్ని. ఏం చెబుతామో అది ఆచరించకుండా వుండటమే జీవితం. ఈ పాయింట్‌ మీద కథ చెప్పు.’’

‘‘హీరో నేపాల్‌లో బౌద్ధ సన్యాసిలాగా జీవిస్తూ వుంటాడు. ఎవరుదగ్గరికి వెళ్ళినా బుద్ధం శరణం అంటూ వుంటాడు. కడప నుంచి నేపాల్‌కి ఒక బృందం టూరిస్ట్‌ బస్సులో టూర్‌ వెళుతుంది. వాళ్ళలో ఒకడు హీరోని చూసి మహదేవరెడ్డీ అని అరుస్తూ పారిపోతాడు. వాడ్ని చూసి బస్సులో ఉన్న వాళ్ళంతా డ్రైవర్‌తో సహా ఎక్కడికి పారిపోతున్నారో కూడా తెలియకుండా పారిపోతారు’’ అని కొత్తకథ ప్రారంభించాడు రైటర్‌. ‘‘ఇంద్ర కథనే మళ్ళీ చెప్పావు కదా.. దొంగ’’ అన్నాడు నిర్మాత. ‘‘అన్నిటికి అడ్డుచెబితే నేనేం చేయలేనండి. ఇంద్రకి ముందు ఈ కథను తీశారు. తరువాత కూడా తీస్తున్నారు. మీకేంటి బాధ’’ కోప్పడ్డాడు రైటర్‌. ‘‘ఫాక్షన్‌ కథలు పాచిపోయాయి కానీ కొంచెం కొత్తది చెప్పు’’ అన్నాడు నిర్మాత. ‘‘జీవితం పాతగా వున్నప్పుడు కథలు కొత్తగా ఎట్టా వస్తాయి సార్‌’’ మూలిగాడు రైటర్‌.  ‘‘ఫిలాసఫీ వల్ల లాసే తప్ప గెయినుండదు’’ అన్నాడు డైరెక్టర్‌.

‘‘ఒక రాజ్యం. అక్కడ సెల్‌ఫోన్లుండవు, ల్యాండ్‌ ఫోన్లుండవు. అసలు మనుషులే మనుషుల్లా ఉండరు. ఎవడైనా తప్పు చేస్తే మెడ నరుకుతారు. నరికే ముందు ఒక ఐటమ్‌ సాంగ్‌ వేయిస్తారు. నరికే ముందు బాదంకాయ పుట్టుమచ్చ ఉంటే వదిలేస్తారు...’’‘‘ఆపహే... ఈ కాలంలో కూడా రాజ్యాలెక్కడున్నాయి’’ చిరాకుపడ్డాడు నిర్మాత. ‘‘సినిమాల్లో వుంటాయి. ప్రేక్షకులు పేపర్లు చదవరని ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్‌’’ ‘‘నాకీ కథ నచ్చింది’’ అన్నాడు డైరెక్టర్‌. ‘‘దీంట్లో కథ ఎక్కడుంది?’’ అన్నాడు నిర్మాత. ‘‘కథ లేకపోవడమే తెలుగు సినిమా కథ’’ అన్నాడు డైరెక్టర్‌. రైటర్, నిర్మాత మూర్ఛపోయారు.
– జి.ఆర్‌. మహర్షి

Advertisement
Advertisement