కశ్మీర్ స్త్రీఎం

27 Mar, 2016 23:31 IST|Sakshi
కశ్మీర్ స్త్రీఎం

తీర్చిదిద్దినట్లుండే రాష్ట్రం కాదు జమ్మూ-కశ్మీర్! చక్కదిద్దుకోవలసిన రాష్ట్రం. ఇంకా చెప్పాలంటే ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటూ ఉండవలసిన రాష్ట్రం. బయటి నుంచి ఉగ్రవాదం. లోపలి నుంచి వేర్పాటు వాదం. ఈ రెండు వాదాల మధ్య నలిగిపోతూ... యువత నిర్వేదం. మహిళల దైన్యం. ఇంతటి అమానవీయమైన పరిస్థితులున్న రాష్ట్రానికి తొలిసారిగా ఒక స్త్రీ..సీఎంగా వస్తున్నారు. కశ్మీర్ ప్రజలంతా ఆశగా ఆమె వైపే చూస్తున్నారు.


తండ్రి మరణించిన విషాదం నుంచి  మార్చి 1 లోపు మెహబూబా ముఫ్తీ తేరుకుంటారనే జమ్మూ-కశ్మీర్ ప్రజలంతా ఆశించారు. ఏడాది క్రితం అది ఆమె తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజు.

 
తీవ్రమైన అనారోగ్యంతో న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్‌లో చేరిన వారం రోజుల తర్వాత, 2016 జనవరి 7న సయీద్ తన 79 ఏళ్ల వయసులో మరణించారు. అంత్యక్రియలకు ఆయన భౌతిక కాయాన్ని బంధువులు, అభిమానులు మోసుకెళుతున్నప్పుడు భుజం పట్టడానికి తోపులాటైతే జరిగింది కానీ.. ఆ తర్వాత జమ్మూ-కశ్మీర్ బాధ్యతలను మోసేందుకు ఆయన వారసురాలైన మహబూబా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు! ఒక విధమైన వైరాగ్యంలోకి ఆమె జారిపోయారు. కొన్నాళ్ల తర్వాతనైనా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి మెహబూబా సమ్మతిస్తారని   సంకీర్ణ భాగస్వామి బి.జె.పి. తలచింది కానీ ఆమె మరీ ఇంత దీర్ఘ విరామం తీసుకుంటారని అనుకోలేదు. 

 

 
రుబియా.. మెహబూబా

మోహబూబా వయసు 56 ఏళ్లు. ఎంపీ. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పి.డి.పి.) అధ్యక్షురాలు. అయితే ముఫ్తీ మరణం తర్వాత ఆయన కుమార్తె ప్రమాణం స్వీకారం చేస్తారని అంతా అనుకున్నప్పుడు దేశ ప్రజలలో ఎక్కువ మందికి మొదట మోహబూబా గుర్తుకు రాలేదు. ఆమె కన్నా ఆరేళ్లు చిన్నదైన రుబియా ముఫ్తీ మాత్రమే మదిలో మెదిలారు. రుబియా ఆ ఇంట్లో మూడో అమ్మాయి. ముఫ్తీ మహ్మద్ సయీద్ భారతదేశానికి తొలి ముస్లిం హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు 23 ఏళ్ల రుబియాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, తమ అనుచరులను విడిపించుకుని, బదులుగా ఆమెను వదిలేసిన ఘటనతోనే దేశ ప్రజల్లో ఎక్కువ శాతం మంది ముఫ్తీ కుటుంబాన్ని పోల్చుకోవడం ఇందుకు కారణం.

 
ఇద్దరు చెల్లెళ్లు.. ఒక తమ్ముడు

ముఫ్తీ మహ్మద్ సయీద్ కుటుంబంలో పెద్దమ్మాయి మెహబూబా తప్ప మిగతా ముగ్గురు పిల్లలూ రాజకీయాల్లో లేరు. మెహబూబా పెద్ద చెల్లెలు మెహమూదా, చిన్న చెల్లెలు రుబియా, తమ్ముడు ముఫ్తీ తసాదక్ హుస్సేన్ వేర్వేరు రంగాలలో స్థిరపడ్డారు. తసాదక్ బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ కొరియోగ్రాఫర్. విశాల్ భరద్వాజ్ తీసిన ఓంకార, కామిని చిత్రాలకు కొరియోగ్రఫీ తసాదక్ దే. మెహమూదా అమెరికాలో డాక్టర్. ఎండోక్రినాలజిస్టు. రుబియా చెన్నైలో ఉంటున్నారు. ఉంటున్నారన్న మాటే గానీ ఆమె గురించి ఆ చుట్ట్టుపక్కల వాళ్లకు కూడా తెలీదు. చెన్నై చెట్‌పట్ ప్రాంతంలో హారింగ్‌టన్ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్‌లో రుబియా కుటుంబం ఉంటోంది. సాయుధులైన ఐదుగురు పోలీసులు గత పదేళ్లుగా ఆ కుటుంబానికి రక్షణగా ఉంటున్నారు. తండ్రి ఆసుపత్రిలో ఉన్న చివరి రోజులలో రుబియా ఆయన పక్కనే ఉన్నారు. రుబియాకు ఇద్దరు పిల్లలు. భర్త చెన్నైలోనే వెలచెరిలో ఆటోమొబైల్ షో రూమ్ నడుపుతున్నారు.

 

చెల్లి కిడ్నాప్ తర్వాతే..అక్క వెలుగులోకి!
1989 డిసెంబర్ 8న రుబియా.. లాల్ దేడ్ మెమోరియల్ ఉమెన్స్ హాస్పిటల్ నుంచి నౌగామ్ (అనంతనాగ్)లోని ఇంటికి మినీ బస్‌లో వెళుతుండగా మధ్యాహ్నం 3.30 గంటలకు నలుగురు ఉగ్రవాదులు తుపాకులు చూపిస్తూ ఆమెను కిందికి దించి, మారుతీ కారులో అపహరించుకు వెళ్లారు. తిరిగి ఐదు రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఈ ఐదు రోజుల్లో రుబియా కన్నా, రుబియా తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నా కూడా మెహబూబా ముఫ్తీ ఎక్కువగా వార్తల్లోకి వచ్చారు! కిడ్నాప్ నేపథ్యంలో మీడియాకు ఆమెకు విరివిగా ఇంటర్వ్యూలు ఇవ్వవలసి వచ్చింది. అలా అకస్మాత్తుగా దేశమంతటికీ మెహబాబాకు పరిచయం అయ్యారు. అప్పటి వరకు ఆమె 28 సంవత్సరాల ఒక సాధారణ యువతి. తొలిసారిగా 1996లో ఆమె క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చారు. ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యంత సున్నితమైన పరిస్థితులు ఉన్న జమ్మూ-కశ్మీర్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు.

 

ఇష్టం లేని పెళ్లి.. విడాకులు
మెహబూబా భర్త జావెద్ ఇక్బాల్. కూతుళ్లు ఇతిజ, ఇర్తిక. భర్త నుంచి విడాకులు తీసుకున్నాక, ఇద్దరు కూతుళ్లతో కలిసి మెహబూబా వేరుగా ఉంటున్నారు. జావెద్ కూడా తనకు భార్యా పిల్లలు వద్దని వెళ్లిపోయారు. పెద్ద కూతురు లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయం ఉద్యోగి. చిన్నమ్మాయి తన మేనమామ తసాదత్ హుస్సేన్‌లాగే సినిమా రంగం వైపు వెళ్లిపోయింది. మెహబూబాకు మొదట్నుంచి ఆ పెళ్లి ఇష్టం లేదు. జావెద్.. వారి కుటుంబంలోని వ్యక్తే. తండ్రి ముఫ్తీ మహ్మద్‌కు దగ్గరి బంధువు. బహుశా బాగా తెలిసిన మనిషి కావడం వల్ల మెహబూబా అతడిని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయారని, తండ్రి బలవంతం మీద పెళ్లికి అయిష్టంగానే ఒప్పుకున్నారని అంటారు. జావెద్ ఇప్పుడు ముఫ్తీ కుటుంబానికి విరోధి. పార్టీ పరంగానూ ప్రత్యర్థి. 2008లో ఆయన ఒమర్ అబ్దుల్లా పార్టీ ‘నేషనల్ కాన్ఫరెన్స్’ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు.

 

తండ్రి వారసత్వం
తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ వారసత్వంగా మాత్రమే మెహబూబా ముఫ్తీ రాజకీయాలలోకి వచ్చారు. ముఫ్తీ మహ్మద్ రెండుసార్లు (2002-05, 2015-2016) జమ్మూ-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1987 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. అదే ఏడాది వి.పి.సింగ్ నాయకత్వంలోని జనమోర్చాలో చేరారు. 1989-90 మధ్య హోం మినిస్టర్‌గా పని చేశారు. తిరిగి పి.వి.నరసింహారావు హయాంలో (1996) కాంగ్రెస్‌లోకి వచ్చి, అందులోంచి మళ్లీ కూతురు మెహబూబాతో కలిసి బయటికి వచ్చి 1999లో జమ్మూ-కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పి.డి.పి)ని స్థాపించి కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. పి.డి.పి.లో ప్రతి అడుగునూ తండ్రితో కలిసి వేసిన మెహబూబాకు ఆయన అనంతర ప్రయాణం కష్టమైనదేమీ కాదు కానీ.. తండ్రిని కోల్పోయిన బాధ,  బి.జె.పి. ఉన్న అపనమ్మకం ఆమెను తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటుకు కదలనివ్వలేదు.

 

రాజకీయ ప్రవేశం
ముప్పై ఏడేళ్ల వయసులో మెహబూబా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె బిజ్‌బెహారా ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో విపక్ష నేతగా ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం పనితీరుపై ఆమె చేసిన నిర్మాణాత్మకమైన విమర్శలు ఆమెనొక విజ్ఞత గల రాజకీయ నాయకురాలిగా నిలబెట్టాయి. 1999లో ఆమె తండ్రి సొంత పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి మెహబూబా ఉపాధ్యక్షరాలిగా ఉన్నారు. అసెంబ్లీ సీటుకు రాజీనామా చేసి 1999 ఎన్నికల్లో శ్రీనగర్ నుంచి ఒమర్ అబ్దుల్లా పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2002 పహల్గామ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో, 2014లో అనంత్‌నాగ్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. మళ్లీ ఇప్పుడు ఎంపీగా రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా నిలబడాలి. ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి.


మెహబూబా ముఫ్తీ (56)
జన్మదినం   :     22 మే 1959
జన్మస్థలం   :     అనంతనాగ్
చదువు :     బి.ఎ., ఎల్ ఎల్‌బి. (కశ్మీర్ యూనివర్శిటీ)
రాజకీయ పార్టీ    :     పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పి.డి.పి.)
నియోజకవర్గం    :     అనంతనాగ్ (జమ్ము కశ్మీర్)
తండ్రి    :     ముఫ్తీ మహమ్మద్ సయీద్
తల్లి     :     గుల్షన్
మతం  :     ఇస్లాం
సంతానం    :     ఇద్దరు అమ్మాయిలు. ఇతిజ, ఇర్తిక
జకీయాలకు ముందు   :     సమాజ సేవ
నిర్వహించిన విధులు :     1996-99 : జమ్మూ- కశ్మీర్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకురాలు
2002-2004 : ఎమ్మెల్యే
2004 : ఎంపీ (14వ లోక్‌సభ)
2009 : జమ్మూ- కశ్మీర్  పీపుల్స్
డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు
2014 : (సెప్టెంబర్ 1 నుంచి)
ఎంపీ (16వ లోక్‌సభ)

మరిన్ని వార్తలు