'యుద్ధాల్లో హీరోలు ఉండరు.. కేవలం బాధితులే'

20 Oct, 2023 12:45 IST|Sakshi

రియాద్‌: యుద్ధాల్లో హీరోలు ఉండరని కేవలం బాధితులు మాత్రమే మిగులుతారని సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టర్కీ ఆల్‌ ఫైసల్ అన్నారు. ప్రజాపోరాటాలు, శాసనోల్లంఘన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్, తూర్పు యూరప్‌లో సోవియట్ రాజ్యాధికారాలను కూలదోశాయని ఆయన గుర్తుచేశారు. దురాక్రమణ ప్రాంతాల్లో ప్రజలకు సహాయనిరాకరణ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం దురంహకారం గాజాలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫైసల్ అభిప్రాయం విలువైనదిగా పేర్కొంటూ ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్(ఎక్స్‌)  లో షేర్ చేశారు.  

హమాస్ తీరు శోచనీయం 
ఇస్లామిక్‌ ప్రతినిధిగా పేర్కొంటూ పిల్లలు, మహిళలపై క్రూరంగా దాడులకు పాల్పడుతున్న హమాస్‌ చర్యలను ఖండిస్తున్నానని ఫైసల్ అన్నారు. అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులను హతమార్చడం ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన.. పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని కూడా ఇస్లాం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై నైతికతను ప్రదర్శించడం పట్ల ఆయన హమాస్‌ను విమర్శించారు. ఇజ్రాయెల్‌లాగే హమాస్‌ కూడా పాలస్తీనా అధికార వర్గాలను తక్కువ అంచనా వేయడంపై ఆయన మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల దుస్థితికి శాంతియుత పరిష్కారం కోసం సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాన్ని విధ్వంసం చేసిన హమాస్‌ తీరును ఫైసల్ తప్పుబట్టారు. 

ఇజ్రాయెల్ రక్తపాతం..
పాలస్తీనా ప్రజలపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై ఫైసల్ మండిపడ్డారు. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లో పిల్లలు, మహిళల పట్ల ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న మారణకాండపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు అమెరికా సైతం వంతపాడటాన్ని తప్పుబట్టారు. దాదాపు 75 ఏళ్లుగా ఈ దారుణాన్ని పాలస్తీనా ప్రజలు భరిస్తున్నట్లు చెప్పారు. 1948 నాటి పాలస్తీనా దురంతం పేరుతో వెలుగులోకి వచ్చిన 2014 నాటి ఓ పత్రికా కథనంలో ఇజ్రాయెల్ సేనల పాత్రను ఆయన ఎండగట్టారు. ఈ ఏడాది కూడా మే నుంచి జులై మధ్య 67 మంది పిల్లలతో సహా దాదాపు 450 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. 

ప్రాశ్చాత‍్య మీడియా తీరు సరికాదు..
పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నానని ఫైసల్ తెలిపారు. అల్-అక్సా మసీదులోని ప్రార్థనా స్థలాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించడాన్ని తీవ్రంగా విమర్శించారు. పాలస్తీనా స్త్రీలు, పిల్లలు  పురుషులను నిర్బంధించారని మండిపడ్డారు. పాలస్తీనియన్ల చేతుల్లో చనిపోతున్న ఇజ్రాయెలీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాలస్తీనియన్ల హత్యలపై కనీసం విచారం వ్యక్తం చేయని ప్రాశ్చాత్య మీడియా తీరును ఆయన ఖండించారు.

ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్

మరిన్ని వార్తలు