మన ఆటలు ఆడుకుందాం

23 Mar, 2017 22:52 IST|Sakshi
మన ఆటలు ఆడుకుందాం

దాగుడు మూతా దండాకోర్‌

తాటికాయలకు పుల్లగుచ్చి దర్జాగా దొర్లించుకుంటూ వెళ్లే రెండు చక్రాల బండి, ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని క్షణాల్లో సృష్టించే పొగలేని రైలుబండి, ఒకటి నుంచి వంద ఒంట్లు లెక్కబెట్టిన బుజ్జి దొంగ కళ్లు తెరిచి చేసే భీకర వెతుకులాట, ఝుమ్మని తిరిగే బొంగరం, కూత ఆపకుండా గోదాలో నిలిచే ఆటగాడి పనితనం, పెచ్చులుగా పగిలే గోళీలు, పెరటి కొమ్మలకు ఊగే ఊయలలు, వరండాల్లో అష్టాచెమ్మా, వీ«థుల్లోన కుందుడుగుమ్మా... మన ఆటలు నిజంగా బంగారం. మన పిల్లల కోసం సంప్రదాయం సృష్టించిన తెలుగుదనపు సింగారం.

బొద్దుగా ముద్దుగా ఉండే కుమారరత్నం పొద్దున లేస్తే టీవీకి అతుక్కుపోతాడు. నోరు తెరిస్తే పవర్‌ రేంజర్స్, పొకెమాన్‌ మాట్లాడతాడు. అవసరమైతే బేబ్లేడ్‌లు అడుగుతాడు. కాదంటే చాక్లెట్‌ ఫ్యాక్టరీ చదువుతానంటాడు. అమ్మాయికి ఎస్‌ఎంఎస్‌ల పిచ్చి.  చాటింగ్‌లో తప్ప క్లోజ్‌ ఫ్రెండ్‌ ఎదురుగా నిల్చున్నా మాట్లాడదు. టైముంటే ట్వంటీ ట్వంటీ, నో అంటే టామ్‌ అండ్‌ జెర్రీ.

వీళ్ల ఇష్టాలు వీళ్లవే. వీళ్ల కోసం పిజ్జాలు బర్గర్‌లు కాదనక్కర్లేదు... కాకపోతే అప్పుడప్పుడన్నా మన సద్దిబువ్వ సంగతి తెలియాలి. వాటర్‌ పార్కులు, హారర్‌ హౌస్‌లు ఎంజాయ్‌ చేయాల్సిందే... కానీ ఏడాదికోమారన్నా వరిచేల మీద నుంచి వీచే చల్ల గాలి వీళ్ల ఒంటికి తగలాలి. అమ్మమ్మ కలిపే ఆవకాయ ముద్ద నోటికి అందాలి. మట్టివాసన తెలియని వాళ్లకి మరే పరిమళం అంటదంటారు. మన సంస్కృతి తెలియనివారికి మరే సంస్కృతైనా అర్థం అవుతుందా? తెలుగు భాష తీయదనం పిల్లల నాలుకకు తగలాలని ఉద్యమిస్తున్నట్టే తెలుగు ఆటల రుచి వారికి చేరువ కావాలని ఎందుకు ఉద్యమించకూడదు?

ప్రతిదీ ఒక ముచ్చట...
పిల్లలంతా గోలగా మూగుతారు. జట్లు జట్లుగా పంటలు వేస్తారు. ఒక్కొక్కరూ ‘పండు’గా మారి చివరకు ఒకరిని దొంగ చేస్తారు. ఆ దొంగతో దాగుడుమూతలు ఆడతారు. ఆ దొంగతో కోతి కొమ్మచ్చి ఆడుతారు. ఆ దొంగను కుంటుకుంటూ వచ్చి కుందుడుగుమ్మలో అందరినీ పట్టుకోమంటారు. ఆ దొంగ మెడలు వంచి ‘ఒంగుళ్లూ దూకుళ్లూ’ వినోదిస్తారు. ప్రతిదీ ఒక ముచ్చట. జీవితంలో గెలుపోటములను నేర్పే కళ. అందని వాటిని అందుకోవడం, దొరకనివాటిని వెతుకులాడటం, అనువుకాని చోట తలను వంచడం, అడ్డంకులు ఉన్న చోట ఒంటికాలితోనైనా సరే గమ్యాన్ని చేరుకోవడం... మన ఆటల్లో నిగూడార్థాలు... నిబ్బరాన్ని నింపే రహస్య సూచనలు.

ఖర్చు లేని వినోదం...
ఒక క్రికెట్‌ కిట్‌ కొనాలంటే ఎంతవుతుంది? ఒక టెన్నిస్‌ రాకెట్‌కు ఎంత వెచ్చించాలి. ఒక సాయంత్రానికి షటిల్‌కాక్‌లు ఎన్ని సమర్పించాలి? వీడియో గేమ్స్‌ వెల ఎంత? కానీ మన ఆటల్లో ఎంత ఖర్చవుతుంది? చింతపిక్కలు, ఇటుక ముక్కలు, వెదురుకర్రలు, రూపాయికి ఇన్నేసి వచ్చే గోళీలు... అందుబాటులో వున్న వస్తువులనే క్రీడాసామాగ్రిగా చేసుకొని ఖర్చులేకుండా వినోదించడం మన గ్రామీణులు నేర్చిన విద్య. బాదం ఆకులు కుట్టుకోవడం తెలిసినవాడు పేపర్‌ప్లేటు వచ్చేదాకా తలగీరుకుంటూ నిలుచోడు. గమనించి చూడండి... మన ఆటలన్నీ ఇలాంటి నేటివ్‌ ఇంటెలిజెన్స్‌ను పెంచేవే.

మళ్లీ చిగురించాలి...
దాగుడు మూతలు, దొంగ పోలీస్, చుకు చుకు పుల్ల దాంకో పుల్ల, అణాకు రెండు బేరీ పండ్లు, ఒప్పుల కుప్ప వయ్యారి భామ, గిన్నె గిరగిరా, ఎత్తు పల్లం, చీర్‌ ఆట, ఏడు పెంకుల ఆట, బజారు బంతి, తొక్కుడు బిళ్ల, అష్టా చెమ్మా... ఇంకా ఎన్నో ఆటలు, తెలుగు నేల మీద ప్రాంతాల వారీగా ప్రాచుర్యం పొందిన ఆటలు ఉన్నాయి. గత తరాలు ఆడిన ఈ ఆటలు నేటి తరాలకు అందించకపోవడం వల్ల ఇవన్నీ అంతరిస్తున్నాయి. నేటి పెద్దలకు కథలు చెప్పే తీరిక లేనట్టే, ఈ ఆటలు ఆడించే తీరిక కూడా లేదు. మంచి అందుకోవడానికి పిల్లలు సదా సిద్ధంగా ఉంటారు. వారికి మన ఆటలు అందిస్తే ఆడుకుంటారు. లేదంటే మనది కాని బ్యాటు బాల్‌ అందుకుంటారు. క్రూరత్వాన్ని నేర్పే వీడియో గేముల్లో మునిగిపోతారు. గుంపు నుంచి విడివడి ఏకాంతంలో ఉంచే టీవీని ఆరాధిస్తారు. కనీసం ఈ వేసవి వారికి మన ఆటలు నేర్పాలని కోరుకుందాం. అందుకోసం కొన్ని ఆటలు ఇక్కడ గుర్తు చేస్తున్నాం.    

గోళీలు: గోళీలతో నాలుగైదు ఆటలు ఆడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల గోళీలను వృత్తంలో పెట్టి దూరం నుంచి కొడతారు. మరికొన్ని చోట్ల ‘దెబ్బ కొట్టి జానా’, ‘దెబ్బలూ జానాలూ’ ఆడతారు.  ఆటలో పద్ధతులు ఎన్ని ఉన్నా గోళీల ఆటకు మాత్రం గ్రామాల్లో విశేష ప్రాధాన్యం ఉంది. ఈ ఆటలో కొందరు తమ గోళీలను పందెం కాస్తారు. దీనిలో ఓడేవారికి చిత్రవిచిత్రమైన శిక్షలను అమలు చేస్తుంటారు.

ఇవి ఆడుదామా... వామనగుంటలు: ఆడపిల్లలు చింతపిక్కలతో ఆడే ఇష్టమైన ఆట  వామనగుంటలు. ఈ ఆటలో  చెక్క ఉంటుంది.  చెరోవైపు ఏడు గుంటల చొప్పున 14 గుంటలు ఉంటాయి. మధ్యలో చెరోవైపు ఉన్న గుంటలను కాశీ అంటారు. వీటిలో పదమూడు చొప్పున చింతపిక్కలు వేస్తారు. వామనగుంటను ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఆడే అవకాశం ఉంది. ముందుగా ఒకరు గుంటలో ఉన్న పదమూడు చింతపిక్కలను తీసి మిగిలిన వాటిలో సర్దుతారు. చింతపిక్కలను సర్దుతున్నప్పుడు ఎవరైనా మధ్య గుంట దగ్గర ఆగిపోతే, మిగిలిన వారు ఆటను ప్రారంభించాల్సి ఉంటుంది. తమ వద్దనున్న చింతపిక్కలను ఆటలో  పోగొట్టుకోవడం ద్వారా ఒకరు తరువాత ఒకరు చొప్పున ఈ ఆటలో ఓడిపోతారు. ఆట పూర్తవడానికి  సుమారు గంటకు పైగా సమయం పడుతుంది.

తొక్కుడు బిళ్ళ: తొక్కుడు బిళ్ళను ఎవరికి వారుగా, ఇద్దరు చొప్పన ఒక జట్టుగా ఆడతారు. ఇది పూర్తిగా ఆడపిల్లల ఆట. చెరోవైపు ఐదేసి గడులుంటాయి. ఆటకు వినియోగించే రాతి బిళ్ళను మొదటి గడిలో వేసి ఆటను ప్రారంభిస్తారు. గడి దాటుకుని మిగిలిన గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ వెళతారు. మొత్తం గడులను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత బిళ్ళను చేతులపైనా, తలపైనా, కాళ్ళపైనా, నుదుటిపైనా పెట్టుకుని గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ దాటాల్సి ఉంది. ఇవన్నీ విజయవంతంగా పూర్తిచేసిన వారు ఈ ఆటలో విజేతలుగా నిలుస్తారు.

అష్టాచెమ్మా: అడ్డంగా, నిలువుగా ఐదు చొప్పున గడులుంటాయి. నాలుగు చింతపిక్కలను సగానికి అరగదీసి ఆటను ఆడతారు. లేకుంటే సముద్రపు గవ్వలను వినియోగిస్తారు. ఒక్కొక్కరికి నాలుగు చొప్పున కాయలు ఉంటాయి. వీటిని అన్ని గడులను దాటుకుంటూ మధ్యలో ఉండే గడి(పంటగడి)లోకి తీసుకుని వెళ్ళాలి. నాలుగు చింతపిక్కలు పైకి పడితే చెమ్మా (నాలుగు), బోర్లా పడితే అష్టా (ఎనిమిది) చొప్పున పాయింట్లు ఇస్తారు. మధ్యలో ఒకరి మప్పులను మరొకరు చంపుకుంటారు. ఆట మధ్యలో కాయలను సేఫ్టీ(రక్షణ) గడిలో ఉంచుకునే అవకాశం ఉంది. ముందుగా ఎవరి కాయలైతే పంటగడిలో చేరతాయో వారే విజేతలవుతారు. అష్టాచెమ్మా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది.

కర్రాబిళ్ళ: నిజానికి ఇది క్రికెట్‌కు జేజమ్మ. కర్రాబిళ్లను ఆడేందుకు చిన్న పిల్లలు పోటాపోటీగా ముందుకు వస్తారు. ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. మొదటి గ్రూపు చేసిన స్కోర్‌ను రెండో గ్రూప్‌ ఛేజ్‌ చేస్తుంది. మొదటి గ్రూపు చేసిన స్కోరును పూర్తి చేయలేకపోయినా, చేసేలోపలే ఆటగాళ్లందరూ అవుటైనా మొదటి గ్రూపు విజేతగా మారుతుంది.

మరిన్ని వార్తలు