నిన్ను నువ్వు పట్టించుకో

7 Jan, 2018 00:39 IST|Sakshi

ఒక గ్రామంలో చెప్పులు కుట్టే ఆయన ఉన్నాడు. ఆయన్ని ‘పాదరక్షకుడు’ అందాం. ఆ గ్రామం మొత్తానికి ఆయనే పాదరక్షకుడు. చెప్పులు మరమ్మతు చేయించుకోడానికి, కొత్త చెప్పులు చేయించుకోడానికి ఊరివాళ్లంతా ఆయన దగ్గరికే వస్తారు కాబట్టి ఎప్పుడూ తీరిక లేకుండా పని చేస్తుండేవాడు. ఓసారి ఆయన చెప్పులే పాడైపోయాయి. తన చెప్పులు బాగు చేసుకునే ఆ కొద్ది సమయంలో బయటి వారి చెప్పుల్ని బాగు చేయొచ్చు కదా అని, తన చెప్పుల గురించి ఆలోచించడం మానేశాడు. చివరికి అవి శిథిల దశకు వచ్చాయి.

పాదరక్షకుడి పాదంలో ఆనెలు వచ్చాయి. ఆ నొప్పిని భరించలేకపోయినా అలానే నడిచేవాడు కానీ, తన చెప్పుల గురించి పట్టించుకునేవాడు కాదు. వాళ్లూ వీళ్లూ చూసి, ‘అదేం పనయ్యా! నీ గురించి నువ్వు శ్రద్ధ వహించాలి కదా’ అనేవారు. అయినా ఆయన పట్టించుకోలేదు. చివరికి పాదం నొప్పి ఎక్కువై, పరిస్థితి ప్రాణాంతకమై మంచాన పడ్డాడు. దాంతో ఆ గ్రామంలో చెప్పులు కుట్టేవాళ్లే లేకుండా పోయారు. పర్యవసానంగా గ్రామస్థులు కూడా చాలాకాలం ఇబ్బందులు పడ్డారు. మొత్తం ఊరే నడవలేనట్లుగా అయిపోయింది!

మనం ఏదైనా బాధ్యతాయుతమైన పనిలో ఉన్నప్పుడు, మధ్యమధ్య మనల్ని కూడా పట్టించుకుంటుండాలి. నాయకులు, సామాజిక కార్యకర్తలు, టీచర్లు, ఇంటిపెద్ద, గృహిణి.. వీళ్లంతా తమ ఆరోగ్యం గురించి, తమ క్షేమం గురించి శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే కుటుంబాలు, సమాజం సజావుగా ఉంటాయి.
(గమనిక : నిన్నటి ‘చెట్టు నీడ’లో ‘జీవితం సంతోషాల పూదోట’ అని వచ్చిన సందేశం పోప్‌ ఫ్రాన్సిస్‌ పేరిట సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ప్రసంగ భాగం అని పాఠకులు గమనించగలరు)

మరిన్ని వార్తలు