విసిరేసిన రాళ్లు

24 Nov, 2018 00:27 IST|Sakshi

చెట్టు నీడ 

చేపలు పట్టే ఒక వ్యక్తి తెల్లవారుజామునే ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. దారిలో అతని కాలికి ఏదో సంచీలాంటిది తగిలితే దాన్ని తీసుకుని తడిమి చూస్తే అందులో ఏవో కొన్ని రాళ్లలాంటివి తగిలాయి. వెలుగు వచ్చాక చేపలు పట్టుకోవచ్చనుకుని వలను పక్కనపెట్టి నది ఒడ్డునే కూర్చుని బద్ధకంగా ఆ సంచీలోంచి ఒక రాయిని తీసి నదిలోకి విసిరాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నదిలోకి విసిరిన రాయి నీట మునిగే శబ్దం అతనికి తమాషాగా అనిపించింది. వెలుగు వచ్చేదాకా ఏ పనీలేదు కాబట్టి అలా రాళ్లు విసురుతూ కాలక్షేపం చేస్తూనే ఉన్నాడతను. మెల్లిగా సూర్యోదయమైంది. కాంతికిరణాలు పరుచుకున్నాయి. అప్పటికే ఆ సంచీలోని రాళ్లన్నిటినీ అతను విసిరేసి ఉన్నాడు.

ఇక విసిరేందుకు చేతిలో చిట్టచివరి రాయి ఒక్కటే మిగిలి ఉంది. వెలుతురులో దాన్ని గమనించిన అతని గుండె ఆగినంతపనైంది. అది ఒక వజ్రం. అనుకోకుండా అతనికి అంతులేని సంపద లభించినా, చీకటిలో తెలియక దాన్ని చేజార్చుకున్నాడు. ఒక విధంగా అతను అదృష్టవంతుడు. వెలుగు రావడం కొంచెం ఆలస్యమైతే అతను ఆ రాయిని కూడా నీటిలోకి విసిరేవాడే. చాలామంది ఆపాటి అదృష్టానికి కూడా నోచుకోరు. జీవితంలో లభించిన వజ్రాలను గులకరాళ్లుగా భావించి, వాటిని విసిరిపారేస్తారు. కొద్దిమంది మాత్రం కనీసం ఆఖరునిమిషంలో అయినా మేలుకొంటారు. నిజానికి జీవితమే విలువైన వజ్రం లాంటిది. చివరి వరకూ దాన్ని వ్యర్థంగా గడిపి, చరమాంకంలో దాని విలువ తెలుసుకుని, మంచి పనులు చేయడం మొదలు పెడతారు చాలామంది.

మరిన్ని వార్తలు