నాన్నా.. ఎందుకలా నవ్వుతున్నావు?!

21 Feb, 2020 09:29 IST|Sakshi

యుద్ధం ‘నవ్వులపాలు’

చిన్నారి సల్వా మరికొన్నాళ్లు.. పూర్తిగా ఊహ వచ్చేవరకు.. తండ్రి చెప్పిన అబద్ధాన్ని నిజం అని నమ్ముతూ హాయిగా నవ్వుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక అమాయకపు నవ్వు చాలదా.. పెద్దలు.. తాము ఆడుతున్న యుద్ధం అనే ఆటను ఆపేయడానికి! 

సల్వాకు మూడేళ్లు. ఆమె తండ్రి అబ్దుల్లా అల్‌–మొహమ్మద్‌. ఆ కుటుంబం సిరియాలోని ఇద్లిబ్‌ పట్టణంలో ఉంటోంది. ఉండటం కాదు. అదే వారి ఊరు. అదే వారి దేశం. సిరియాలో పదకొండేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఉన్నది రెండు కోట్ల జనాభా. బాంబులు, ఫిరంగుల దాడులలో ఇప్పటివరకు 3 లక్షల 70 వేల మందికి పైగా చనిపోయారు. ఇంటి పైకప్పులో ప్రాణాలు పెట్టుకుని నిద్ర లేస్తున్నారు బతికున్న సిరియన్‌లు. ఎప్పుడు ఏ బాంబు, ఏ ఫిరంగి నెత్తిపైన వచ్చిపడుతుందో తెలియదు. రోజూ గుప్పెడు మందైనా విగత జీవులై అరిచేతులు తెరుస్తున్నారు. చనిపోయిన వారిలో 13 వేల మందికి పైగా స్త్రీలు, 21 వేల మందికి పైగా చిన్నారులు. యుద్ధం ఇప్పట్లో ఆగేటట్లు లేదు. ప్రభుత్వాన్ని దించేందుకు పౌరులు, ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సిరియా ప్రభుత్వ స్నేహ దేశాలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే పట్టుకుని శరణార్థులుగా వెళ్లిపోతున్నాయి సాధారణ సిరియన్‌ కుటుంబాలు. (ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!)

అయితే అబ్దుల్లా అల్‌-మొహమ్మద్‌ కుటుంబం మాత్రం ఇద్లిబ్‌ నుంచి కదలడం లేదు. ఏ క్షణాన  గూడు కూలిపోతుందో తెలియదు. అయినా.. అక్కడే, ఆ ఇంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశంలో విమానం ఉరిమిన ప్రతిసారీ ఇళ్లలోని చిన్నారులు ఉలిక్కిపడుతున్నారు. ఫిరంగులు వచ్చి గోడలకు చిల్లులు కొడుతున్నప్పుడు అమ్మానాన్నని హత్తుకుపోతున్నారు. సల్వా కూడా మొదట్లో ఆ శబ్దాలకు గుక్కపట్టి ఏడ్చేదే కానీ.. అబ్దుల్లా తన కూతురు భయపడకుండా ఉండటం కోసం ఓ ట్రిక్‌ కనిపెట్టాడు. బాంబు పడిన శబ్దం చెవుల్ని తాకగానే ఆయన పెద్దగా నవ్వేవాడు. ఇంటి గోడకు వచ్చి ఫిరంకి తగిలినప్పుడూ అంతే. పెద్ద నవ్వు. ‘‘ఎందుకు నాన్నా నవ్వుతున్నావ్‌?’ అని అడిగింది ఓ రోజు సల్వా.‘‘బయట పిల్లలెవరో ‘ఢాం’ అని పేలుస్తున్నారు. ఆ చప్పుళ్లకు నవ్వొస్తోంది’’ అని చెప్పాడు.

ఇక అప్పట్నుంచీ బాంబు పడితే సల్వా కూడా నవ్వడం మొదలు పెట్టింది. అలా ఇద్దరూ నవ్వేవారు. ముఖాలు చూసుకుంటూ నవ్వేవారు. అదిప్పుడు ఆ తండ్రీ కూతుళ్లకు ఒక ఆట అయింది. రోజూ అంతే. ‘‘ఆ చప్పుడేంటో చెప్పుకో! అది విమానం విడిచిన బాంబా? ఫిరంగా?’’ అని తండ్రి కూతుర్ని అడుగుతాడు. ‘ఆ.. అది ఫిరంగి’ అంటుంది కూతురు.. పెద్దగా ఆలోచించకుండానే. చివరికి ఎలాగైందంటే.. విమానం కనిపిస్తే చాలు, సల్వా నవ్వడానికి సిద్ధం అయిపోయేది. ‘సల్వా బేటా.. విమానం ఎందుకు వస్తుంది?’’ అని అడుగుతాడు తండ్రి. ‘‘మనల్ని నవ్వించడం కోసం’’ అంటుంది కూతురు. (ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో! )

సల్వాకు ఏడాది వయసున్నప్పుడు ఇంటి బయట ఎవరో ‘ఈద్‌’కి బాణాసంచా కాలుస్తుంటే ఆ పేలుడుకి, కళ్లు జిగేల్మనిపించే నిప్పురవ్వలకు భయపడి పెద్దగా ఏడ్చేసింది. అప్పుడే చెప్పాడు అబ్దుల్లా.. అవి పిల్లలు ఆడుకునే ఆటలని. వాటికి భయపడకూడదని. నవ్వాలని. బాంబుదాడుల గురించి ఇప్పుడూ అదే చెబుతున్నాడు. సల్వా నమ్ముతోంది. నవ్వుతోంది. ఒక్కోసారి.. దూరాన్నుంచి బాంబు శబ్దాన్ని తనే ముందు పసిగట్టి.. ‘అబ్బాజాన్‌.. బాంబు పడబోతోంది, నవ్వడానికి సిద్ధంగా ఉండు’ అని తండ్రికే చెబుతోంది! వెంటనే కూతుర్ని దగ్గరకు తీసుకుని నవ్వుతాడు. నిజమేమిటో తెలిసీ, నిజమేమిటో తెలియని కూతురితో కలిసి నవ్వుతాడు. వీళ్లిలా నవ్వుతున్నపుడు కుటుంబ సభ్యులు తీసిన వీడియో ఇప్పుడు ప్రపంచం గుండెను బరువెక్కిస్తోంది. 

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ 
1997లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనే ఇటాలియన్‌ సినిమా వచ్చింది. కామెడీ డ్రామా. మూడు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల చేతికి చిక్కిన ఒక యూదు కుటుంబంలోని తండ్రీ కొడుకుల కథ అది. నిర్బంధ శిబిరాలలో కళ్లముందు జరుగుతున్న ఘోరాలకు కొడుకు బెదిరిపోకుండా ఉండడం కోసం.. అదంతా ఊరికే నవ్వు తెప్పించడానికి చేస్తున్నారని కొడుకుని నమ్మిస్తాడు. చివరి సీన్‌లో ఆ చిన్నారి.. చాటుగా ఉండి చూస్తున్నప్పుడు.. నాజీ సైనికులు తన తండ్రిని గోడచాటుకు తీసుకెళ్లడం కనిపిస్తుంది. తండ్రి వెనక్కి తిరిగి కొడుకువైపు చూసుకుంటూ వెళుతూ కన్ను కొడతాడు.. ఇదంతా ఆటలో భాగమే అన్నట్లు. తండ్రి అలా కనుమరుగు కాగానే తుపాకీ చప్పుళ్లు వినిపిస్తాయి. ప్రేక్షకులకు అర్థమౌతుంది. అతడిని చంపేశారని. కళ్లలోంచి నీళ్లు వస్తుండగా.. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనిపిస్తుంది మనకు.. అంత మంచి డైరెక్టర్‌ ఉన్నందుకు. ఇప్పుడూ అనిపించి తీరుతుంది. అబ్దుల్‌ అనే ఇంతమంచి తండ్రి ఉన్నందుకు. అయితే జీవితంలోని అందం మాత్రం.. చిన్నారుల అమాయకత్వంలోని నమ్మకమే.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు