కెమేరా కన్ను... చేతిలో పెన్ను... పిన్నవయసు ధ్రువ తారక

16 Oct, 2014 23:24 IST|Sakshi
కెమేరా కన్ను... చేతిలో పెన్ను... పిన్నవయసు ధ్రువ తారక

ప్రకృతి దృశ్యాలు చూస్తే అతని కళ్లు విశాలమవుతాయి. అతని కెమెరా కన్ను ఆ అద్భుతాలను ‘క్లిక్’మనిపిస్తుంది. వన్యప్రాణుల జీవనశైలిని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. జాతీయ ఉద్యానాల్లో అతనితో పాటే అతని కెమెరా పరుగులు పెడుతుంది. కెమెరాతో జాతీయ ఉద్యానాల చరిత్రను కళ్లకు కడుతున్న అతని పేరు ధ్రువ్ వాడ్కర్! వయసు పధ్నాలుగేళ్లు. జాతీయస్థాయిలో అత్యంత పిన్నవయస్కుడైన ఫొటోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకున్న ఈ టీనేజర్ సింగపూర్ పార్క్‌లలో ఫొటోలు తీసి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీటేబుల్ బుక్‌ను రూపొందించాడు. చిన్ననాటి నుంచి ధ్రువ్ చేసిన ‘గ్రీన్ జర్నీ’ పెద్దవారికీ ఓ పాఠంలా ఉపయోగపడుతోంది.
 
పధ్నాలుగేళ్ల ధ్రువ్ వాడ్కర్ హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. మూడేళ్ల క్రితం వరకు ఇక్కడే చదువుకున్నాడు. తల్లిదండ్రులు సింగపూర్‌లో స్థిరపడడంతో  ధ్రువ్ కూడా అక్కడే కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో టెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. సింగపూర్‌లోని 20 ఉద్యానాలను సందర్శించిన ధ్రువ్ ఇప్పటి వరకు దాదాపు 3000 ఫొటోగ్రాఫ్‌లు తీశాడు. అంతేకాదు పార్క్‌లకు వచ్చే వారిని కలిసి, వారితో మాట్లాడాడు. శ్రద్ధగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. మన ఉద్యానాలకూ, సింగపూర్ ఉద్యానాలకూ ఉన్న తేడా తెలుసుకున్నాడు. వాటన్నింటినీ ఒక చోట పొందుపరచి ‘పార్క్ ఆఫ్ సింగపూర్’ అని ఒక కాఫీ టేబుల్ బుక్‌ను తయారుచేశాడు.  అతను చేసిన ‘గ్రీన్ జర్నీ’లో చాలా ఆసక్తికర అంశాలే ఉన్నాయి.
 
ఆకుపచ్చని ప్రయాణం...

‘‘ఏడేళ్లుగా వీలు చిక్కితే మన దేశంతో పాటు సింగపూర్ జాతీయ ఉద్యానాలను సందర్శిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉద్యానాల చరిత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫొటోలతో పాటు, సందర్శకుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నాను. రికార్డులను శోధిస్తున్నాను. అలా అన్నింటినీ సమకూర్చి ఒక పుస్తకంలో వాటిని పొందుపరిచాను. ఇదంతా ఉద్యానాల అద్భుతాలను, అక్కడి స్థితిగతులను తెలియజేయడానికి. సింగపూర్ పార్కులలో పచ్చదనం చాలా గొప్పగా ఉంటుంది. చుట్టుపక్కల పట్టణ వాతావరణం ఉన్నప్పటికీ విశాలమైన మైదానాలు అబ్బురపరుస్తాయి. ఏ పార్క్ చూసినా శుభ్రంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా పార్క్‌లను తమ నేస్తాలుగా చూస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మన దేశంలోనూ ఎన్నో పార్కులను చూశాను. అక్కడి పార్కులకూ, ఇక్కడి పార్కులకూ ఎంతో తేడా ఉంది. మన దేశంలో పార్కులను కేవలం ఉదయం, సాయంకాల వేళల్లో వాకింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తారు’’ అని వ్యాఖ్యానించాడు ధ్రువ్!
 
పన్నెండేళ్ల వయసులో...

అత్యంత పిన్నవయసులోనే మన దేశంలోని రణథంబోర్, కన్హా జాతీయ ఉద్యానాల అధికారుల ఆహ్వానం మేరకు వాటిని సందర్శించి, ఫొటోలు తీసి ప్రసిద్ధుల చేత ప్రశంసలు పొందాడీ కుర్రాడు. పన్నెండేళ్ల వయసులో ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ సేవర్స్ సొసైటీ, ఎర్త్ మ్యాటర్ ఫౌండేషన్‌కు ధ్రువ్ వాడ్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. మన దేశంలో రణథంబోర్ జాతీయ ఉద్యానంలో ధ్రువ్ తీసిన 75 ఫొటోలతో హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్‌లోని నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏడో తరగతి చదివే సమయంలో తాను తీసిన పులుల ఫొటోలను స్కూల్‌కు అందజేశాడు. ఢిల్లీలో ‘కాల్ ఆఫ్ ద టైగర్’ పేరుతో వన్యప్రాణుల సంరక్షణ సొసైటీ, ఎర్త్ మ్యాటర్స్ ఫౌండేషన్ ఒక పోటీని నిర్వహించింది. అందులో 32 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారందరిలో అత్యంత పిన్నవయస్కుడు ధ్రువ్! వారికి దీటుగా ధ్రువ్ తీసిన ఫొటోలు ఎంపికయ్యాయి.
 
హాబీగా ఫొటోగ్రఫీ

ధ్రువ్ చిన్నతనమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి రోజూ దగ్గరలోని పార్క్‌కు వెళ్లేవాడు. అక్కడి పచ్చని గడ్డి మీద గంటలు గంటలు ఆడుకునేవాడు. అలా పార్క్‌లతో అనుబంధం ముడిపడిపోయింది అంటాడు ధ్రువ్.  ‘‘ఫొటోగ్రఫీలో ధ్రువ్‌కు ఉన్న ఆసక్తి, అభిరుచిని గమనించిన మా ఆవిడ వాడికి ఏడేళ్ల వయసులో ఒక చిన్న కెమేరా కొనిచ్చింది. అప్పుడు మొదలైన హాబీతో ఇప్పటికీ వాడు క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు’’ అంటూ ఆనందంగా వివరిస్తారు ధ్రువ్ తండ్రి అనంత్ వాడ్కర్. ‘‘నా అభిరుచిని గమనించి అమ్మా నాన్న కన్హా జాతీయ ఉద్యానం, సలీమ్ అలీ బర్డ్ శాంక్చ్యువరీ వంటివాట న్నింటికీ తీసుకెళ్లారు’’ అనే ధ్రువ్ మన దేశంలోనూ పార్కులు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తన కాఫీటేబుల్ బుక్‌లో పొందుపరిచాడు. ‘‘చిన్న ప్రయత్నం జగమంతా పచ్చదనం నిండడానికి దోహదం చేస్తుంది. ఆ ప్రయత్నం మనం నిరంతరం చేస్తూనే ఉండాలి’’ అంటాడు ధ్రువ్. ఈ పిన్నవయస్కుడి ఆలోచన ఎందరికో స్ఫూర్తి నిస్తుందని, ఆకుపచ్చని అందాలను కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ఆశిద్దాం.      

- నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు