ప్రవాహమే పరమశివుడు

24 Jan, 2017 23:39 IST|Sakshi
ప్రవాహమే పరమశివుడు

పుణ్యతీర్థం :: సహస్రలింగ

ఆలయం అంటే నాలుగు గోడలు గోపురం ధ్వజస్తంభం ఉండాలి. కాని నదే అక్కడ ఆలయంగా మారుతుంది. ప్రవాహమే గర్భగుడై తన ఒడిలో సహస్ర లింగాలను ప్రతిష్టించుకుంది. కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో దట్టమైన అడవుల మధ్య శల్మల నదిలో దర్శనమిచ్చే ‘సహస్రలింగ’ అనే ఈ శైవతీర్థం జీవితంలో ఒక్కసారైన దర్శించతగ్గది.

శివుడు నిర్మలుడు, నిరాకారుడు, నిరాడంబరుడు,లింగాకారంలో దర్శనమిచ్చే ఆదిభిక్షువు.ఆయన ఏకాంత ప్రదేశాలలో సంచరించడానికి ఇష్టపడతాడు. ప్రకృతిలో నిమగ్నమై ఉంటాడు. అందుకే మనదేశంలోని చాలా శైవక్షేత్రాలు రణగొణధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. సహస్ర లింగాల కూడా అలాంటి క్షేత్రమే. ప్రకృతి ఛాయల వెనుక దాగినట్టున్న ఆ క్షేత్రం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాదు ఆత్మను తేజోమయం కూడా చేస్తుంది.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ‘ సిరిసి’ ముఖ్యమైన పట్టణం. దీనికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రమే  సహస్రలింగ క్షేత్రం. దీనిని చేరుతుండగానే  దివ్యానుభూతి కలిగి కైలాసానికి రాలేదు కదా అని అనుమానం కలుగుతుంది.  పరమశివుడు ఇక్కడ గంగమ్మలో మునకలేస్తూ వేయి లింగాలుగా నందీశ్వరునితో పరివ్యాప్తం అయి ఉంటాడు. తలపైన ఉండవలసిన గంగమ్మ ప్రేమతో పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహంలో తలస్నానం చేస్తున్న శివలింగాలను చూసి  దివ్యానుభూతి పొందుతాం.

శల్మల నదీ తీరం...
పచ్చని అరణ్యాలలో ప్రవహిస్తున్న శల్మల నది సమీపిస్తుండగానే ప్రకృతి శివనామస్మరణ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. గలగలమనే ఆకుల శబ్దాలతో చెట్లు, జలజలమనే జల నినాదంతో  నది ఓం నమశ్శివాయ అంటున్న భావన కలుగుతుంది. శల్మల నది పేరుకి తగ్గట్టుగానే అందమైన సంగీత నాదం చేస్తూ ప్రవహిస్తుంది. గంగవల్లి నదికి ఉపనదిగా ప్రవహిస్తున్న ఈ నది పడమటి కనుమల నుంచి బయలుదేరుతుంది. మనసును హత్తుకునే సుందరమైన  ఈ నదే సాక్షాత్తు దేవాలయంగా మారింది.  సాధారణంగా ఎక్కడైనా ఏక లింగం చూస్తేనే పరవశించిపోతాం. అటువంటిది ఇక్కడ సహస్ర లింగాలను ఏకకాలంలో దర్శించడమంటే ఊరిపి పీల్చడం మర్చిపోతాం. శల్మల నదిలో వేయి శివలింగాలు, వేయి నందులు దర్శనమిస్తాయి. పేరుకి మాత్రమే వెయ్యి. వాస్తవానికి అవి లెక్కలేనన్ని. నది మట్టం కొద్దిగా తగ్గగానే అన్ని లింగాలు కనువిందు చేస్తాయి. ప్రతి శివలింగానికి అభిముఖంగా నందీశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. అయితే కొన్ని నందులు ప్రవాహానికి శిథిలమవడం కొట్టుకుపోవడం జరిగిందని పరిశోధకుల పరిశీలన.  శివరాత్రికి భక్తుల సందడితో ఈ ప్రాంతం కోలాహలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న అడవులలో అమూల్యమైన వనమూలికలు ఉన్నాయని పరిశోధకులు ఇప్పటికే తేల్చడం వల్ల శల్మల నదిలో మునకలు వేయడం స్నానాలు చేయడం చాలా మంచిదని భక్తులు భావిస్తారు. అనేక రకాల వనపుష్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి. బుల్‌బుల్‌ పిట్టల గానం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది.

సంతానం కోసం
1678 – 1718 ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడిగా సదాశివరాయలు అనే రాజు  సిరిసి ప్రాంతాన్ని పాలించేవాడు. అతడికి ఎంతకూ సంతానం కలగలేదు. నాకు గనుక సంతానం కలిగితే సహస్రలింగాలను చెక్కిస్తాను అని అతడు శివుడికి మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు కుమార్తె పుట్టింది. మొక్కు చెల్లుబాటులో భాగంగా అతడు శల్మల నదీ ప్రవాహంలో లెక్కక మించి ఉన్న రాతి శిలలపై సహస్ర లింగాలను చెక్కించాడు. నదీ ప్రవాహం నిండుగా ఉన్నప్పుడు లోపల ఉండే ఈ లింగాలు ప్రవాహం పూర్తిగా తగ్గాక నక్షత్రాల వలే బయటపడి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.

ఇతర ప్రదేశాలలోనూ...
అయితే ఒకే ప్రాంతంలో వందలాది లింగాలు ప్రతిష్టించిన సందర్భాలు ఇతర చోట్ల ఉన్నా సహస్ర లింగ మాత్రం విభిన్నమైన క్షేత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది కాకుండా ఒరిస్సా పరశురామేశ్వర దేవాలయంలో, కర్ణాటకలోని హంపీలో ఇటువంటి శివలింగాలు దర్శనమిస్తాయి.  పరశురామేశ్వర దేవాలయంలో పెద్ద శివలింగం మీద 1008 లింగాలు దర్శనమిస్తాయి. హంపీ నగరంలో, తుంగభద్ర నదీ తీరం వెంబడి శివలింగాలు చెక్కబడి ఉన్నాయి. శివారాధకులు భక్తితో వీటిని చెక్కి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.  అజంతా గుహలలో బుద్ధుడి విగ్రహాలు అనేక రూపాలలో ఉన్నట్లుగానే, ఇక్కడ కూడా  లింగాలు దర్శనమిస్తాయి.  జపాన్‌లోని ‘హియాన్‌ జపాన్‌’ ప్రాంతంలో కొందరు శిల్పకారులు సంజుసాంజెన్‌ దో (క్యోటో) లో ఆయుధం ధరించిన కానన్‌ (జపాన్‌ దైవం) 1001 విగ్రహాలు చెక్కారు. ఈ దేవాలయాన్ని జపాన్‌ జాతీయ సంపదగా భావిస్తుంది. కాంబోడియాలో అంగార్‌వాట్‌ సమీపంలోని పచ్చని అడవుల గుండా ప్రవహిస్తున్న నదిలో కూడా ఇటువంటి శివలింగాలే కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని వేయిలింగాల నదిగా పిలుస్తారు.

ఉత్సవాలలో...
శివరాత్రి, నదీ ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతంలో నివిసించేవారు, నదీ తీరాన్ని పూలమాలలు, మామిడి తోరణాలతో అలంకరించి, డప్పులు వాయిస్తూ నృత్యం చేస్తారు. శల్మల నది ఉత్సవాన్ని సంబరంగా జరుపుకుంటారు. వారికి జీవనాన్ని ఇచ్చింది ఆ నదీమతల్లి అనే భావంతో వారు ఈ ఉత్సవాలు జరుపుతారు. ‘‘మా పరిసరాలను ఎవరైనా పాడు చేయాలనుకుంటే, మేం ఊరుకోం’’ అంటూ వారి భక్తిని చాటుకుంటున్నారు.

►ఈ నదిమీదుగా ఇటీవలే వేలాడే వంతెనను నిర్మించారు. రెండువైపుల గ్రామాలను ఈ వంతెన కలుపుతుంది. వంతెన మధ్యభాగంలోకి చేరుకోగానే, చుట్టుపక్కల అంతా ప్రకృతిమాతను చూస్తూ పరవశించిపోతాం. ఆ వంతెన మీదనుంచి సహస్ర లింగాలను వీక్షిస్తుంటే, పైనుంచి పక్షుల కిలకిలరవాలు, కింద నుంచి నదీమ తల్లి జలజల ధ్వానాలు మాత్రమే వినిపిస్తాయి.

►ఇటీవలి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో, నీటి మట్టం బాగా తగ్గి, మరిన్ని లింగాలు బయటకు వచ్చాయి. వీటిని లెక్కించడం సాధ్యం కాకపోవడంతో, ఈ ప్రాంతానికి సహస్రలింగాల అని పేరుపెట్టారు. ప్రతి లింగానికి ముందు నందీశ్వరుడు కూడా దర్శనమిస్తాడు.

ఇలా చేరుకోవాలి....
►సిరిసి నుంచి ఎల్లాపూర్‌ వెళ్లే మార్గంలో అంటే సిరిసి నుంచి 17 కి.మీ.దూరంలో ఉంది సహస్రలింగాల క్షేత్రం. ౖ¿ñ రుంబే తరువాత హుల్‌గోల్‌ బస్‌ స్టాప్‌లో దిగాలి. అక్కడ నుంచి హుల్‌గోల్‌కి నడవాలి. మెయిన్‌రోడ్‌ నుంచి ఇది రెండు కి.మీ. దూరంలో ఉంది.

►ఉడిపి వరకు రైలులో ప్రయాణించి, అక్కడ నుంచి సొంత వాహనంలో కాని, బస్సులో కాని ప్రయాణించి ఈ ప్రాంతం చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 405 కి.మీ. ఆరున్నర గంటల ప్రయాణం.  ఇది హుబ్లీ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.

►ఇక్కడకు వచ్చే సందర్శకులు, తినడానికి కావలసిన ఆహారపదార్థాలు వారి వెంట తెచ్చుకోవడం మంచిది.  ఇక్కడ ఆహారం లభించదు. అన్ని పదార్థాలు వెంట తెచ్చుకుని, భగవంతుని సన్నిధిలో ఒకరోజు ప్రశాంతంగా గడపవచ్చు. దయచేసి ఇక్కడ ప్లాస్టిక్‌ వస్తువులు, చెత్త పారవేయవద్దని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి పురాతనమైన ప్రదేశాన్ని ప్రభుత్వం వారసత్వ సంపదగా ప్రకటించాలని మేధావులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు