సాఫీగా కావడం లేదు... సమస్య ఏంటి?

4 Oct, 2016 23:26 IST|Sakshi
సాఫీగా కావడం లేదు... సమస్య ఏంటి?

హోమియో కౌన్సెలింగ్


నా వయసు 49 ఏళ్లు. బాగా ముక్కితే గానీ మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఎండీ హుసేన్, కందుకూరు
మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం.

యానల్ ఫిషర్‌లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి. మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్‌సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది.

 

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి,  హైదరాబాద్

 

 

కాఫ్ వేరియంట్ ఆస్తమా తగ్గుతుందా?
పల్మునాలజీ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 12 ఏళ్లు. అతడు పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం కూడా ఉంటోంది. శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాం. కాఫ్ వేరియంట్ ఆస్తమా అన్నారు. మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.  - సీతారామయ్య, కొత్తగూడెం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో  తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ  తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ  నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్‌పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా-బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు.

కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి.  వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు.

 

డా॥రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్

 

 

మరిన్ని వార్తలు