అక్కే దిక్కు

9 Feb, 2015 22:35 IST|Sakshi
అక్కే దిక్కు

తండ్రికి వ్యవసాయ పనులలో సహాయం చేద్దామని వెళ్లిన ఆ యువకుడికి విద్యుదాఘాతం శాపంగా మారింది. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు కాళ్లు చచ్చు బడిపోయి మంచాన పడటంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. జీవచ్ఛవంలా బతుకుతున్న కొడుకు దీన స్థితిని చూస్తూ తట్టుకోలేక తల్లిదండ్రులు కాలం చేసారు. దాంతో అక్కే అతడికి దిక్కయింది. ఎవరి జీవితాన్ని వారు చూసుకునే ఈ రోజుల్లో ఆ యువకుడి అక్క పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని తమ్ముడి సేవకే అంకితం చేసింది. తమ ఇద్దరి పొట్ట పోషించుకోవడం కోసం, తమ్ముడి వైద్య ఖర్చుల కోసం ఆమె బీడీ కార్మికురాలిగా, వ్యవసాయ కూలీగా మారింది. తమ్ముడికి అన్నీ తానే అయి, అతడి మల మూత్రాదులనూ శుభ్రం చేస్తూ జీవితం సాగిస్తోంది. ఈ కుటుంబం దీనస్థితిని చూసి అయ్యో పాపం అనని వారులేరు. అలాగని ఆర్థికంగా చేయూతనిచ్చినవారూ లేరు. దీంతో తమకు ఆదుకోవాలంటూ, కనిపించిన ప్రతి ఒక్కరినీ ఈ అక్కా, తమ్ముళ్లు వేడుకుంటున్నారు. ఆపన్న హస్తం కోసం క్షణమొక యుగంలా వేచి చూస్తున్నారు.
 
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ గ్రామం. ఓ పెంకుటిల్లు తలుపు తట్టగానే ఓ మహిళ దీనంగా వచ్చి తలుపు తెరిచింది లోపల మంచం మీద జీవచ్ఛవంలా పడి ఉన్నాడు ఓ యువకుడు. అతని పేరు బొబ్బిలి రమేష్. వ యస్సు 36. 18 ఏళ్ల వయసు వచ్చేంత వరకు తను కూడా అందరిలాగే జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశపడ్డాడు. తల్లిదండ్రుల పేదరికానికి తను పరిష్కారం కావాలనుకున్నాడు. అయితే ఇంటర్ ఫెయిలవడం అతని జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఓ రోజు వ్యవసాయ పనులలో సహాయం చేద్దామని పొలానికి వెళ్లాడు. అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చూడడానికి స్తంభం ఎక్కాడు. కరెంట్ లేదనుకొని తీగలను సరిచేయబోయాడు. అంతే! విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. తీవ్రగాయాలయ్యాయి. నడుము నుంచి కింది వరకు శరీరం చచ్చుబడిపోయింది. ఒక్కగానొక్క కొడుకును బతికించుకోవడానికి తల్లిదండ్రులు పడరాని పాట్లు పడ్డారు. హైదరాబాద్ సహా పొరుగు రాష్ట్రాల పెద్ద ఆస్పత్రులకూ తిరిగారు. ఖర్చుల కోసం ఉన్న నాలుగెక రాల పొలాన్ని అమ్ముకున్నారు. అయిన వాళ్ల దగ్గర అప్పులు చేశారు. తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో సాయం చేసేవారే కరువయ్యారు. ఈ దిగులుతోనే 2000 సంవత్సరంలో తండ్రి బాలయ్య చనిపోగా, తల్లి సాయమ్మ 2013లో మరణించింది. దీంతో రమేష్ బాధ్యత అక్క ఇందిరపై పడింది. తమ్మునిపై ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టింది. తాను పెళ్లి చేసుకుంటే, తన తమ్ముడు ఎక్కడ అనాథ అవుతాడేమోనని పెళ్లి ఆలోచనే మానేసింది.

అమ్మ, నాన్న అన్నీ... అక్కే

18 ఏళ్లుగా రమేశ్ మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఇందిర అతడికి తల్లీ, తండ్రీ, అక్కా తానే అయి సేవలు చేస్తోంది. తాను కష్టపడి పని చేయాల్సిన వయసులో అక్క కూలి పని చేసి తనను బతికించుకోవడానికి పడుతున్న తపనను చూసి రమేష్ కుమిలి పోతున్నాడు. 40 ఏళ్లు దాటినా తన కోసం అక్క పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకుందంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. రమేష్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఊరు ఊరంతా సానుభూతి చూపించింది. ‘సాయం చేస్తాం’ అంటూ నేతలెందరో అభయమిచ్చారు. వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. అప్పటి ఎంపీ మధుయాష్కి, ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ పోషణకు బ్యాంకు రుణం, ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరాలు గడిచిపోయాయి. రమేష్ మరింత అనారోగ్యానికి గురవుతున్నా ఏ సాయమూ అందలేదు.
 
ఇల్లు గడవడం కష్టంగా ఉంది
 
తమ్ముడిని వదిలి వెళ్లిపోతే ఎక్కడ అనాథ అవుతాడోనన్న భయంతో వాడితోనే ఉండిపోయాను. పూట గడవడం కష్టంగా మారింది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. కాళ్లు చచ్చు బడిపోయివాడు.. పేదరికం కారణంగా నేనూ ఏమీ చేయలేకపోతున్నాం.
 - రమేష్ అక్క ఇందిర
 
 సాయం చేయాలనుకుంటే బొబ్బిలి రమేష్ ఫోన్ నంబర్లు
 9490242011 ; 9948084048
 
 

మరిన్ని వార్తలు