రేవంత్‌ గజదొంగ.. ఇందిరపై చీటింగ్‌ కేసు.. నాపై ఒక్క కేసు లేదు: కడియం కౌంటర్‌

14 Nov, 2023 19:25 IST|Sakshi

సాక్షి, జనగాం: కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ​రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇవాళ జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రేవంత్‌.. కడియంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కడియం కౌంటర్‌ ఇచ్చారు.  

రేవంత్‌ ఓ గజదొంగ. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇందిరపై, రేవంత్‌రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. కానీ, నాపై ఒక్క కేసు కూడా లేదు అని కడియం అన్నారు. నియోజక వర్గంలోని మాదిగలపై నిజంగా ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ఇందిరకు సవాల్‌ విసిరారాయన. ఇందిర తన ఆస్తుల్ని రాసిచ్చిన మరు క్షణమే తాను తన ఆస్తుల్ని రాసి ఇచ్చేస్తానని కడియం తెలిపారు.

2018 ఎన్నికల్లో రాజయ్య చేతిలో ఇందిర చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గం పైన అవగాహన లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నా. నియోజకవర్గంలోని ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇందిర సాయం చేయలేదు. ఆపై చీటింగ్‌ కేసు నమోదు అయ్యింది. సుప్రీం కోర్టులో ఆ కేసు నడుస్తోంది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండని ఆమెకు.. ఇక్కడి ప్రజల కష్టాలు  ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారాయన.

మరిన్ని వార్తలు