పాహిమాం సుబ్రహ్మణ్యేశ్వరా

28 Apr, 2019 00:46 IST|Sakshi

ప్రపంచంలో ఎత్తయిన సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహాలు రెండున్నాయి. వాటిలో మొదటిది మలేషియాలో 140 అడుగుల ఎత్తులో స్వామివారి విగ్రహం రూపుదిద్దుకుంది. మరలా భారతదేశంలో అంతటిస్థాయిలో 60 అడుగుల విగ్రహాన్ని విజయనగరంలోనే నెలకొల్పడం విశేషం. ఈ అద్భుత కట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉత్తరాంధ్ర నుంచే కాక ఒడిశా, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ స్వామివారితోపాటు వినాయకుడు, మహాశివుడు, మానసాదేవి, లక్ష్మీదేవి విగ్రహాలూ కొలువై ఉన్నాయి.

ఇటీవలే సరస్వతీదేవీ, రాహుకేతు విగ్రహాలను నెలకొల్పారు.శత్రు, రోగ, రుణబాధ నివారణ కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ప్రతి మనిషి ఈ మూడు సమస్యలతోనే ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు. వీటిని ఏకకాలంలో నివారించగలిగే దేవునిగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు కొలుస్తారు. ఆయనకు ముడుపు కట్టి మొక్కితే సకలరోగాలు పటాపంచలై అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం.

ఆలయ విశిష్టత...
పట్టణశివారు పూల్‌బాగ్‌ లక్ష్మీగణపతి కాలనీలో శ్రీశ్రీశ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. 1990కి ముందు ఆలయ ప్రదేశంలో  పెద్ద పుట్ట ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతమంతా అభివృద్దికి నోచుకోలేదు.  కేవలం నాగుల చవితి నాడు మాత్రమే పుట్టకు పూజలు చేసేవారు. అక్కడ పెద్ద నాగసర్పం ఉండేదని పరిసర ప్రాంతవాసులు చెబుతుంటారు. అప్పటి వరకూ కొత్తపేట నీళ్ల ట్యాంక్‌ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో  అర్చకులుగా పనిచేసిన కర్రి వెంకటరమణ సిద్ధాంతి కలలో ఈ ప్రాంతమంతా కనిపించింది.

అక్కడ తనకు ఆలయం నిర్మించమని స్వామి చెప్పడంతో మరుసటిరోజున అక్కడికి వెళ్లిన సిద్ధాంతికి  పెద్ద పుట్ట  దర్శనమిచ్చింది. దీంతో  ఆ ప్రాంతాన్ని దాతల సహాయంతో కొనుగోలు చేసి పుట్టను పరిశీలించగా అందులో దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. కలలో కనిపించిన స్వామివారి విగ్రహాలు .. పుట్ట మడిలో నుంచి వెలిసిన విగ్రహాలు ఒకటే కావడంతో సిద్దాంతి కొందరి సహాయంతో ఆ ప్రాంతంలో ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో నిత్యారాధనలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, విశేష  కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రతీ  ఏడాది జరిగే పూజలు...
నిత్యపూజలతోపాటూ ప్రతినెలా మాస శివరాత్రినాడు  రుద్రాభిషేకాలు, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మదిన తిథి షష్టి. ప్రతి నెలా రెండు షష్టి తిధులలో స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. జ్యేష్ఠమాసంలో నాగదేవత మానసాదేవికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర షష్టితిథి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఐదురోజుల పాటూ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.  

సకల దోషాలకు నివారణ ...
జాతకరీత్యా, కుజ, శని, రాహు, కేతు దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు పరిహారమవుతాయి. ఆలస్యవివాహాలు, కుటుంబ కలతలు, దాంపత్య అనుకూలత లేకపోవడం, సంతానం లేనివారు, ఉన్న సంతానం సక్రమంగా ఉండాలనుకునేవారు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగ సంబంధ సమస్యలు, ఉద్యోగ ప్రమోషన్లకు స్వామివారికి మొక్కుతారు. వృత్తి, వ్యాపార  వ్యవహార అనుకూలతకు, కుటుంబ వృద్ది, గృహ సౌఖ్యం, రాజకీయ అభివృద్ధికి స్వామివారికి పూజలు చేయిస్తుంటారు.  విద్యార్ధులకు విద్యాభివృద్ధికి, శత్రువుల నుంచి రక్షణకు, రుణ విమోచనకు, శరీర అనారోగ్య నివారణ, జాతకరీత్యా, నవగ్రహ దోష నివారణకు స్వామివారి పూజలు నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగిస్తుంటారని భక్తుల ప్రగాడ విశ్వాసం.
బోణం గణేష్, విజయనగరం.
ఇన్‌పుట్స్‌: – కంది గౌరీశంకర్, విజయనగరం టౌన్‌.

స్వామి అనుగ్రహంతోనే...
‘‘ఎందరో భక్తులు తమ కష్టాలను ఇక్కడకు వచ్చి స్వామికి చెప్పుకుంటారు. వారి కష్టాలు తీరిన తర్వాత మరలా ఇక్కడకు వచ్చి విశేషపూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్ల కోసం కృషిచేస్తున్నాం. స్వామి అనుగ్రహంతోనే ఇవన్నీ సాధ్యపడుతున్నాయి.’’కర్రి వెంకటరమణ సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపకులు, స్వామి ఉపాసకులు, వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, విజయనగరం.

మరిన్ని వార్తలు