BAN Vs MAL Highlights: బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించిన మలేషియా.. సెమీస్‌లో టీమిండియాతో "ఢీ"

4 Oct, 2023 15:14 IST|Sakshi

ఏషియన్‌ గేమ్స్‌-2023 మెన్స్‌ క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్‌-4లో పసికూన మలేషియా, తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్‌లో మలేషియా.. బంగ్లాదేశ్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. అఫీఫ్‌ హొస్సేన్‌ ఆల్‌రౌండ్‌ షోతో (14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు, 4-0-11-3) ఆదుకోకపోయి ఉంటే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది. అఫీఫ్‌ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో గట్టెక్కిన బంగ్లాదేశ్‌, అక్టోబర్‌ 6న జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన టీమిండియాను ఎదుర్కొంటుంది.

బంగ్లా బ్యాటర్లకు కట్టడి చేసిన మలేషియా బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసింది. మలేషియా బౌలర్లు పవన్‌దీప్‌ సింగ్‌ (4-1-12-2), విరన్‌దీప్‌ సింగ్‌ (4-0-13-0) బంగ్లా బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. విజయ్‌ ఉన్ని, అన్వర్‌ రెహ్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సైఫ్‌ హస్సన్‌ (50 నాటౌట్‌), అఫీఫ్‌ హొస్సేన్‌ (23), షాదత్‌ హొస్సేన్‌ (21) మాత్రమే రాణించారు.

మలేషియాను గెలిపించినంత పని చేసిన విరణదీప్‌ సింగ్‌..
117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేషియా 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరన్‌దీప్‌ సింగ్‌ (39 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి ఓవర్‌ వరకు క్రీజ్‌లో నిలబడి మలేషియాను గెలిపించినంత పని చేశాడు. అయితే ఆఖరి ఓవర్లో అఫీఫ్‌ హొస్సేన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మలేషియా గెలుపుకు కావాల్సిన 5 పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు.

అఫీఫ్‌ చివరి ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ (విరన్‌దీప సింగ్‌) పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. దీనికి ముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ 3లో ఆఫ్ఘనిస్తాన్‌.. శ్రీలంకు షాకిచ్చి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌.. పాక్‌ను ఢీకొంటుంది.

మరిన్ని వార్తలు