నాదో విన్నపం మహర్షీ!

11 Jul, 2018 00:09 IST|Sakshi

చెట్టు నీడ

‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు.

వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరన్న సందేహం కలిగింది. కాసేపు కన్నులు మూసుకుని దేవతలందరినీ తలచుకుంటూ పోతున్నాడు వ్యాసుడు. ఈ క్రమంలో ఓం ప్రథమంగానే పార్వతీ తనయుడైన గణపతి రూపం మదిలో మెదిలింది. తన కావ్య రచనకు సమర్థుడు వినాయకుడే అని అవగతమైంది, ఆయనను ప్రార్థించాడు.

వెను వెంటనే గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు. ‘ధన్యోస్మి వినాయకా’ అని వేదవ్యాసుడు నమస్కరించగా, ‘‘వేదపారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతి నమస్కారం చేశాడు. మహాభారతాన్ని తాను చెబుతుంటే, గణపతి లిఖిస్తే బాగుంటుందన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు వ్యాసుడు. గణపతి అందుకు ఆనందంగా అంగీకరిస్తూనే, ‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడా ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంట వెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న తరువాతనే రాయాలి సుమా..’’ అన్నాడు.అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడు. సరే ననక తప్పదు అనుకుని, ‘నాకూ మంచిదే ఆ మహాగ్రం«థమెన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’ అని సరిపెట్టుకున్నాడు గణపతి. 

ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహంలా నిరాటంకంగా, నిరంతరాయంగా సాగిపోతోంది. వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్నీ వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని ఆస్వాదిస్తూ, ప్రశంసిస్తూ ఆనందిస్తూ దానిని గ్రంథస్థం చేసుకుంటూ పోతున్నాడు. తదుపరి శ్లోక రచనకు తనకు ఇంకాస్త  సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవాడు. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గణపతి కాస్త నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు. ఆ విధంగా ఇద్దరూ ఒకరి వైదుష్యానికి మరొకరు భంగం కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు ఒకరికొకరు ఏమీ తీసిపోకుండా. అందుకే దేనికైనా సమఉజ్జీలు ఉండాలంటారు. 
– డి.వి.ఆర్‌. 
 

మరిన్ని వార్తలు