మెర్సీ ప్లీజ్‌!

4 Oct, 2023 23:57 IST|Sakshi

‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్‌’’ అని అడుగుతోంది డాక్టర్‌ పార్వతీ కుమారి.

జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్‌. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్‌ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్‌లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి.

కళ్లు తెరిచింది కానీ....
 స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్‌ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది.

ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు.

పీహెచ్‌డీ దాకా...
అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ విజువల్లీ హ్యాండీక్యాప్డ్‌’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్‌ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్‌ కాలేజీలో ఎమ్‌.ఏ. చేసింది. తరువాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్‌ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది.  

పుంజుకునేలోపే...
కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి.

కాలేజీలో కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్లను పర్మినెంట్‌ చేసే సమయం వచ్చింది. తాను  కూడా పర్మినెంట్‌ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్‌ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది.
‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది?

మరిన్ని వార్తలు