ఇంద్రియాలను జయించిన మహావీరుడు

10 Apr, 2014 22:59 IST|Sakshi
ఇంద్రియాలను జయించిన మహావీరుడు

ఏప్రిల్ 13న మహావీరుడి జయంతి

హిందూ, జైన, బౌద్ధ, సిక్కు వుతాల్లో బౌద్ధ, జైనమతాలు కొంచెం భిన్నమైనవి. అహింస, సత్యవాక్పాలన, ఆస్తేయం (దొంగతనం చేయకుండా ఉండటం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకపోవటం) అనే ఐదు సూత్రాల ఆధారంగా ఏర్పడినదే జైనమతం. జినులు అంటే జయించినవారు అని అర్థం. వారు జయించింది ఇంద్రియాలను, ఆ తర్వాత జనుల హృదయాలను.  
 జైనమత వ్యాపకుడైన వర్థమాన మహావీరుడు రాజుగా పుట్టాడు.

తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వర్ధమానుడు. పెరిగి పెద్దవాడయ్యాక ఆయన ఇతర రాజ్యాల మీద దండెత్తి రాజులను జయించి ఉంటే అందరూ వీరుడని కొనియాడేవారేమో! అయితే వర్థమానుడు అలా చేయలేదు. రాగద్వేషాలను, అంతఃశత్రువులైన అరిషడ్వర్గాలను జయించి మహావీరుడయ్యాడు.
 
క్రీ.పూ. 599లో నేటి బీహార్‌లోని విదిశ (నాటి వైశాలి) లో త్రిశల, సిద్ధార్థుడు అనే రాజదంపతులకు జన్మించిన వర్థమానుడు  బాల్యం నుంచి ప్రాపంచిక విషయాల మీద ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదట. యశోధర అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల మరణానంతరం భార్యాబిడ్డలను వదిలి సన్యాసం స్వీకరించాడు. వృషభనాథుడు ప్రతిపాదించిన జైనమతాన్ని తన బోధనల ద్వారా, ఆచరణ ద్వారా బలోపేతం చేశాడు. వర్థమాన మహావీరుడిని ఆనాటి ప్రజలు సాక్షాత్తూ భగవంతుడి ప్రతిరూపంగా ఆరాధించారు.

 - డి.వి.ఆర్.
 
వర్థమానుడి తత్వం ద్వైతం. ఆయన సిద్ధాంతం ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవుడు, రెండు అజీవుడు. జీవుడంటే ఆత్మ, అజీవుడంటే పదార్థం. అజీవుడు అణునిర్మితమైతే, జీవుడు అమర్త్యం. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మల కారణంగానే జన్మలు ఏర్పడతాయి.

జన్మరాహిత్యం చేసుకోవాలంటే మోహవికారాదులను, ఇంద్రియానుభవాలను తగ్గించుకోవాలి. అందుకు సన్యాసం, తపస్సు రెండూ అవసరమవుతాయి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. అంటే నిష్క్రియాత్మకమైన, నిర్మలమైన శాశ్వతానందం. నిర్వాణం లక్ష్యంగా ఉన్నవారు దుష్కర్మలను పరిహరించాలి. అంతేకాదు, నూతనకర్మలు చేయకుండా ఉన్న కర్మలను క్రమంగా నశింపజేసుకోవాలి. ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అంటే సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన.
 

మరిన్ని వార్తలు