Kanyaputri Dolls: బిహార్‌ బొమ్మలట- కొలువుకు సిద్ధమట

17 Nov, 2023 00:16 IST|Sakshi

సంస్కృతి

ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్‌... బిహార్‌లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్‌మేన్‌ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు
ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్‌ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి..

ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్‌ను వారం క్రితం బిహార్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్‌ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం.

కన్యాపుత్రి బొమ్మలు
వీటిని బిహార్‌లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్‌లో చంపారన్‌ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు.

కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్‌.

వదలని ఆ గుడియాలు
నమితా ఆజాద్‌... చంపారన్‌ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్‌లోని ‘ప్రాచీన్‌ కళాకేంద్ర’లో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్‌ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది.

ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాన్నే మానేసింది.

పిల్లల సైకాలజీ తెలిసి
పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా.

పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్‌షాప్‌ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్‌ఫోన్ల నుంచి వీడియో గేమ్స్‌ నుంచి కాపాడుతాయి.
 

ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు
కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్‌ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‌‘ క్రియేషన్స్‌ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్‌ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది.

మరిన్ని వార్తలు