ప్రశ్నకు బలాన్నిచ్చే కుల గణన

18 Nov, 2023 00:38 IST|Sakshi

విశ్లేషణ

కులాల వారీగా జనాభా విస్తృత కూర్పును బిహార్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ గణన మొదటిసారిగా కులాల వారీగా పేదరికాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కుల గణన అఖిల భారత స్థాయిలో జరిగిన తర్వాత మొత్తం రాజకీయ నిర్మాణం సమూల మార్పునకు లోనవుతుంది. సుప్రీంకోర్టు అన్ని రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని నైతిక ప్రాతిపదికన విధించింది. ఇటువంటి ప్రామాణికమైన గణాంకాలను కోర్టు ముందు ఉంచిన తర్వాత దానిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే కులాల వారీగా లెక్కల సేకరణ మొదలు పెట్టింది. ఇప్పుడు బీజేపీ కూడా కుల గణన గురించి ఒక వైఖరిని తీసుకోవలసి వస్తుంది. కుల గణన అనే ప్రశ్నను ఇప్పుడు ఏ పార్టీ కూడా తప్పించుకోలేదు.

బిహార్‌ ప్రభుత్వం మొదటి దశలో కులాల వారీగా ఆ రాష్ట్రంలోని జనాభా విస్తృత కూర్పును విడుదల చేసింది. రాష్ట్రంలో ఓబీసీలు 63.13 శాతం ఉండగా, ముస్లిమేతర అగ్రవర్ణాల వారు 10 శాతం మాత్రమే ఉన్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. వెనుకబడినవారు (27.13 శాతం), అత్యంత వెనుకబడినవారు (36 శాతం) కలిసి 63.13 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, భూమిహార్లు, కాయస్థులు, రాజపుత్రులు (క్షత్రియులు) ఉన్న జనరల్‌ విభాగంలోని జనాభా 15.52 శాతం మాత్రమే. కులాల వారీగా చూస్తే యాదవులు 14.27 శాతంతో అతిపెద్ద జనాభాగా ఉన్నారు. ఈ ఒక్క కులం ఆ రాష్ట్రంలో జనరల్‌ కేటగిరీ అంత పెద్దది. ముస్లిం జనాభాను వేరుచేస్తే, హిందూ ఓబీసీలు 50 శాతం ఉన్నారు.

కుల గణన ప్రభావం ఎలా ఉంటుంది?
సుప్రీంకోర్టు స్థాయిలో న్యాయపరమైన నిర్ణయాలలో ఈ కుల గణన ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు అన్ని రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని నైతిక ప్రాతిపదికన విధించింది. ఇటువంటి ప్రామాణి కమైన గణాంకాలను కోర్టు ముందు ఉంచిన తర్వాత దానిని అనుస రించి వెళ్లాల్సి ఉంటుంది. కుల గణన అఖిల భారత స్థాయిలో జరిగిన తర్వాత మొత్తం రాజకీయ నిర్మాణం సమూల మార్పునకు లోనవు తుంది. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై అన్ని పార్టీల్లోని ద్విజ కులాల నేతలు భయపడటానికి ఇదే కారణం.

కుల సామాజిక–ఆర్థిక, విద్యాపరమైన డేటా సిద్ధమైన తర్వాత ఓబీసీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాలని బిహార్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈడబ్ల్యూఎస్‌(ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) రిజర్వేషన్‌తో కలిపి ఇది 75 శాతానికి చేరుకుంటుంది. నితీశ్‌ కుమార్, తేజస్వి యాదవ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ భావజాలంలో సంక్షోభాన్ని సృష్టిస్తుంది. అంతేకాకుండా, కనీసం ఒక రాష్ట్రం నుండి అయినా, తాను గతంలో పేర్కొన్న 50 శాతం పరిమితి వైపు తిరిగి చూసుకునేలా భారత న్యాయవ్యవస్థను ఇది ఒత్తిడికి గురిచేస్తుంది.

పేదరికం సూచికలు
బిహార్‌లో కులాల వారీగా పేదరికం స్థాయులను చూడండి: నెలకు 6,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం సంపాదించేవారు ఏ రాష్ట్రంలోనైనా పేదవారిలో అత్యంత పేదలుగా లెక్కలోకి వస్తారు. అంటే, ఈ కుటుంబాలు సంవత్సరానికి రూ.72,000ల కంటే తక్కువ సంపాదిస్తున్నాయి. 21వ శతాబ్దపు ప్రపంచీకరణ ప్రపంచంలో, ఈ ఆదాయం ఇద్దరు పిల్లలతో కూడిన దంపతులను పోషించడం కష్టం. సాధారణంగా నాటి ప్రణాళికా సంఘం ఆర్థిక సర్వేలు, నేటి నీతి ఆయోగ్‌ సర్వేల ద్వారా తెలిసే దారిద్య్ర రేఖ ప్రకారం, బిహార్‌ అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రంగా అందరికీ తెలుసు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వస్తాయి. వీటిని ‘బిమారు’ రాష్ట్రాలు అని కూడా అంటారు.

బిహార్‌ కుల జనాభా గణన మొదటిసారిగా కులాల వారీగా పేదరికాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దీని ప్రకారం ఎస్సీలు (42.93 శాతం) సంపూర్ణ పేదరికంలో ఉన్నారు. 42.7 శాతంతో ఎస్టీలు పేదరికంలో ఎస్సీలను అనుసరిస్తున్నారు. అత్యంత వెనుకబడిన తరగ తులు(ఎంబీసీ) జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. పేదరికం పరంగా వారు 33.58 శాతం మంది ఓబీసీ వర్గాలకన్నా అధ్వాన్నంగా ఉన్నారు. అత్యంత పేదరికంలో 33.16 శాతం ఓబీసీలు ఉన్నారు. ఒక కులంగా అత్యధికంగా ఉన్న యాదవుల్లో 35.87 శాతం మంది పేదరికంలో ఉన్నారు. బిహార్‌లో బ్రాహ్మణులు (25.32 శాతం), భూమిహార్లు (27.58 శాతం), రాజపుత్రులు (24.89 శాతం) కూడా పేదరికంతో ఎలా బాధపడుతున్నారో గణాంకాలు చూపుతున్నాయి.

అతి తక్కువ పేదరికం ఉన్న కులం కాయస్థ. ఇందులో 13.38 శాతం మంది పేదరికంతో ఉన్నారు. ఏమైనప్పటికీ, చారిత్రకంగా అణచివేయబడిన కులాలు విద్య, కుల మూలధనం లేకుండా బాధపడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. కులాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని మనం పరిశీలిస్తే, బిహార్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కేవలం రిజర్వేషన్లు కాకుండా చాలా సంక్షేమ చర్యలు అవసరం అని బోధపడుతుంది.

బిహార్‌లో వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచాల్సిన అవ సరం ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక రాజధాని అనేది లేదు. రాష్ట్ర రాజధాని పట్నా(ప్రాచీన పాటలీపుత్ర)తో సహా దాని పట్టణ ప్రాంతా ల్లోని ఆర్థిక చైతన్యం దక్షిణ భారత దేశంలోని ఒక జిల్లా ప్రధాన కార్యాలయ స్థాయికి కూడా సమీపంలో ఉండదు. రాష్ట్ర ఉత్పాదకతను పెంపొందించకపోతే, ఇంత విస్తారమైన పేద జనాభాను దారిద్య్ర రేఖ నుంచి బయటకు తేవడం అసాధ్యం.

జాతీయ పర్యవసానాలు
అనేక రాష్ట్రాలు ఇప్పుడు కులాల వారీగా గణాంకాలను సేకరించ వలసి వస్తుంది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే కులాల వారీగా లెక్కలు సేకరించడం ప్రారంభించాయి. బిహార్‌ కుల గణన సమాచారం విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ సమావేశంలో, తాము అధికారంలో ఉన్న చోట కులాల వివరాలను సేకరిస్తామని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దశాబ్దానికి ఒకసారి సాధారణ జనాభా గణనలో కుల గణనను భాగం చేస్తామని పేర్కొంది.

ఈ కొత్త పరిణామం తన మానస పుత్రిక అయిన బీజేపీ ద్వారా దేశాన్ని పాలిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు షాక్‌ కలిగించింది. కారణం సులభం. రిజర్వేషన్‌ వ్యవస్థను తొలగించడం, కుల గుర్తింపు గురించి ఎటువంటి చర్చనైనా నిషేధించడం దాని లక్ష్యం. సామాజిక ఇంజ నీరింగ్‌ గురించి వారి ఆలోచన ఏమిటంటే– ముస్లింలతో, క్రైస్తవులతో పోరాడటానికి హిందువులు ఐక్యం కావాలి. కుల గుర్తింపులను విస్తరించ కూడదనీ, ద్విజ నియంత్రణలో ఉన్న సనాతన ధర్మంలో సంక్షో భాన్ని సృష్టించకూడదనీ దళిత, శూద్ర ప్రజానీకాన్ని ఒప్పించడమే వారి విధానం.

2014 ఎన్నికలలో ఓటు ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ తన ఓబీసీ గుర్తింపును ఉపయోగించుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా అయిష్టతతో అనుమతించింది. రాజకీయ చర్చలో కుల ప్రశ్నలకు తావులేకుండా, నిరంతరం ముస్లిం బుజ్జగింపులు, ముస్లిం శత్రుత్వం, పాకిస్తాన్‌ మొదలైనవాటిని ఉపయోగించి గుజరాత్‌ను నిర్వహించినట్లు మోదీ దేశాన్ని నిర్వహిస్తారని వారు భావించారు. కానీ భారతదేశం గుజరాత్‌ కాదు. మోదీ కుల గుర్తింపు, కుల గుర్తింపులపై ఆధారపడిన ఆయన ఓట్ల సమీకరణ అనేవి... ఉత్తర భారతదేశంలో, ప్రత్యేకించి ఉత్తర ప్రదేశ్‌లో కుల గుర్తింపు సమస్యను తార్కిక ముగింపు వైపునకు నెట్టడానికి మండల్‌ అనుకూల వాదులకు చోదక శక్తిగా ఉంటున్నాయి.

ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుల గణన గురించి ఒక వైఖరిని తీసుకోవలసి వస్తుంది. అలా తీసుకోలేదంటే, మొత్తం శూద్ర, ఓబీసీ ప్రజానీకం ఇంతకాలం తమ ఓటు శక్తిని ద్విజ శక్తిని సుస్థిరం చేయ డానికి మాత్రమే వారు ఉపయోగించుకున్నారని గ్రహిస్తారు. తమ ప్రభుత్వం 27 మంది ఓబీసీలను మంత్రులుగా చేసిందని 2023 రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ పదే పదే చెబుతున్నారు. కుల గణన హిందూ సమాజాన్ని విడదీస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. చారిత్రకంగా అణచివేయబడిన ఓబీసీలను క్షేత్రస్థాయిలో ఉద్ధరించ కూడదని మాత్రమే ఇలాంటి వాదనలు తెలియజేస్తాయి. కుల గణన అంటే, ప్రతి సామాజిక బృందం వాస్తవ స్థితి ప్రాతిపదికన వనరుల కేటాయింపు, సంక్షేమ ప్రణాళికల ప్రశ్న. ఇప్పుడు కుల గణన అనే ప్రశ్నను ఏ పార్టీ కూడా తప్పించుకోలేదు.

- కంచ ఐలయ్య షెపర్డ్‌
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు