అస్త్ర తంత్ర : అద్దెకు దిగేముందు అన్నీ గమనించండి

10 Dec, 2013 23:21 IST|Sakshi
అస్త్ర తంత్ర : అద్దెకు దిగేముందు అన్నీ గమనించండి

 మొన్నామధ్య ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి తన ఇంట్లోనే హత్యకి గురయ్యింది. ఎవరూ లేని సమయం చూసి, ఎవరో ఆగంతకుడు ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు. ఇంట్లో ఎవరూ లేకపోయినా, ఇరుగూ పొరుగూ ఉంటారుగా, ఆమె అరుపులు వినిపించలేదా అని అనుమానం రావచ్చు. ఆ అవకాశమే లేకపోయింది. ఎందుకంటే... ఆ ఇల్లు కాలనీకి కాస్త దూరంలో ఉంది. అందుకే ఎవరూ గమనించలేదు. మనకి ఏ సమస్యా రాకుండా, ఎంతో సురక్షితంగా ఉంటాం అనుకునే ఒకే ఒక ప్రదేశం... మన ఇల్లు. అయితే   ప్రదేశాన్ని బట్టి కూడా మన ఇల్లు కొన్నిసార్లు మనకి సేఫ్ కాకపోవచ్చు. అందుకే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు ఇవి కూడా గమనించాలి.
 
  ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే ఇల్లు తీసుకోవద్దు. కుటుంబంతో ఉన్నా కూడా అలాంటి ఇంటిలో భద్రత ఉండదు. ఇక ఒంటరిగా ఉండేవారైతే... అసలు మంచిది కాదు!
 
  వాహన సదుపాయాలు (బస్టాప్, ఆటోస్టాండ్ వంటివి) దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడే అవసరం వస్తుందో తెలీదు కదా. పైగా ఎక్కడో బస్సు దిగి ఒంటరిగా నడచుకుంటూ వెళ్తే ప్రమాదాలు రావచ్చు!
  చుట్టూ ఇళ్లు ఉన్నా, గుడ్డిగా తీసేసుకోవద్దు. ఆ చుట్టుపక్కల ఎలాంటి వాళ్లు ఉంటున్నారు, అంతకుముందు ఆ ఏరియాలో ఏవైనా గొడవల్లాంటివి జరిగాయా అని ఎంక్వయిరీ చేసి తీరాలి!
 
  ఇంటి యజమానుల గురించి కూడా ముందే తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒంటరిగా ఉండే అమ్మాయిలు... ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వారు ఏయే వృత్తుల్లో ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది  తెలుసుకోండి. మీరు తీసుకునే ఇంట్లో ఎక్కువ పోర్షన్లు ఉంటే, అందరి గురించీ తెలుసుకోండి!
 
  దగ్గర్లో పోలీస్ స్టేషన్ ఉందా, ఎంత దూరంలో ఉంది, ఒక ఫోన్ చేస్తే వాళ్లు ఎంతసేపట్లో రాగలరు వంటివి అంచనా వేసుకోండి!

మరిన్ని వార్తలు