నాలోని ఆ తెరలు తొలగించవా స్వామీ !

17 Mar, 2019 01:12 IST|Sakshi

సంగీత సాహిత్యం

క్రికెట్‌ బ్యాట్‌ తెస్తాన్రా, తెస్తాన్రా అని కొడుకుతో పదిరోజులుగా చెప్తున్న తండ్రి పదకొండోరోజున నిజంగానే తెచ్చినా...‘అరే! ఇవ్వాళకూడా మర్చిపోయాన్రా’ అంటే... కొడుకు ‘మీరెప్పడూ ఇలాగే అంటారు’ అని ఏడుపు మొదలెడతాడు. వెంటనే తండ్రి తాను దాచిన క్రికెట్‌ బ్యాట్‌ చూపితే అంత ఏడుపులోకూడా సంతోషంగా దాన్ని అందిపుచ్చుకుంటున్న కొడుకును చూసి తండ్రి మురిసి పోతాడు. అదో ఆనందం తండ్రికి. అలాగే కుమార్తె వివాహానంతరం ‘జగమేలే పరమాత్మా...’ అంటూ త్యాగయ్య ఆర్తితో పిలుస్తూంటే...‘‘ రహస్యంగా నీకు దర్శనమిస్తాననుకున్నావా త్యాగయ్యా! నీ ఆర్తి ఏమిటో లోకానికి తెలిసేటట్లు ఒకరోజు దర్శనం ఇస్తాను’ అని అనుకుని ఉంటారు. అందుకే...త్యాగయ్యగారి జీవితంలో ఒకసారి తీర్థయాత్రకు వెడుతూ తిరుమల వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పటికి వేళమించిపోయిందని తెరలు వేసేశాం అని చెప్పారు అక్కడి వారు.

క్షోభించిన మనసుతో ‘తెరతీయగరాదా! లోని / తిరుపతి వేంకటరమణ మత్సరమను /తెరతీయగరాదా ! / పరమపురుష ధర్మాదిమోక్షముల పారదోలుచున్నది నాలోని /తెరతీయగరాదా! / త్యాగరాజనుత మదమత్సరమను తెరతీయగరాదా !’’ అని పరమ ఆర్తితో త్యాగయ్య కీర్తన అందుకుంటే... కదిలిపోయిన వేంకటాచలపతి తెరలు తొలగించుకుని అందరూ చూస్తుండగా దర్శనమిచ్చారు. మన ఆంధ్రదేశంలో త్యాగరాజుగారి భక్తిని నిరూపించిన కీర్తన అది. రెండవ వారు శ్యామశాస్తిగ్రారు. ఒకానొక కాలంలో కంచిలో స్వర్ణకామాక్షిని ప్రతిష్ఠించారు. ఆదిశంకరాచార్యులవారు  శ్యామశాస్త్రి గారి పూర్వీకులలో ఒకరిని అక్కడ అర్చకులుగా నియమించారు.  కొంతకాలం తరువాత శ్రీ కృష్ణ్ణదేవరాయలు సామ్రాజ్యం పతనమై బహమనీ సుల్తాన్‌లు విజృంభించిన తరువాత బంగారు కామాక్షికి ఇబ్బంది ఏర్పడుతుందని భావించి అర్చకస్వామి కుటుంబీకులు ఆ విగ్రహాన్ని తీసుకుని అరణ్యమార్గాలగుండా తిరిగి తిరిగి, అనుకోకుండా తిరువారూరు చేరుకున్నారు.

త్యాగయ్య (ఆ పేరుతో వెలసిన పరమశివుడి) ఆలయంలోనే ఆ విగ్రహాన్ని కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. విశ్వనాథశాస్త్రి దంపతులకు చైత్రమాసం కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున శ్యామశాస్త్రి గారు జన్మించారు. నామకరణం రోజున పెట్టిన పేరు వేంకట సుబ్రహ్మణ్యం. నీలమేఘశ్యాముడైన కృష్ణమూర్తిలా ఉన్నాడని తల్లి ‘శ్యామకృష్ణా! శ్యామకృష్ణా !’ అని పిలిచేది. అదే తరువాత శ్యామశాస్త్రి గా మారింది.శ్యామశాస్త్రి గారికి చిన్నతనం నుంచే అర్చకత్వంలోనూ, ఆ మంత్రాలలోనూ దానికి సంబంధించిన విషయాలలో తండ్రి తర్ఫీదు ఇచ్చాడు. మేనమామగారు మాత్రం సంగీతంలో కొంత ప్రవేశం ఉన్నవారు. ఆయన దగ్గర కొన్ని కృతులు నేర్చుకుని శ్యామశాస్త్రి గారు పాడుతుండేవారు. ఒకరోజున తండ్రిలేని సమయంలో రాగబద్ధంగా అమ్మవారి కీర్తనలు చాలా మధురంగా ఆలపిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమైనారు.

దర్శనానికి గుడికి వచ్చిన ధనిక భక్తుడొకరు అది చూసి మురిసిపోయి చాలా ఖరీదైన శాలువా ఒకటి బహూకరించారు. ఇది తెలిసి మేనమామగారికి ఆగ్రహం వచ్చి శ్యామశాస్త్రి గారు అభ్యసిస్తున్న సంగీత పుస్తకాలను చింపి అవతల పారేశారు.అయినా తల్లి కొడుకును ఓదార్చి సంగీతాభ్యాసం కొనసాగేలా సర్దుబాటు చేసింది.రామకృష్ణ స్వాములవారు త్యాగయ్యగారిని ఉద్ధరించినట్లుగానే సంగీత స్వాములవారు అనే ఒక విద్వాంసుడు చాతుర్మాస్య దీక్షకోసం తంజావూరు వచ్చి ఉన్నారు. అప్పటికి అక్కడ ఉన్న శ్యామశాస్త్రిగారికి స్వర్ణార్ణవాన్ని బహూకరించి సంగీతంలోనే అనేక రహస్యాలను బోధించారు. పోతూ పోతూ ఆయన పచ్చిమిరియం అప్పయ్య శాస్త్ర్రిగారనే మరో గురువుకు శామశాస్త్రి గారిని అప్పగించి వెళ్ళారు.

మరిన్ని వార్తలు