కూర్చుంటే.. లేవలేరిక

11 Feb, 2020 08:35 IST|Sakshi

కాలు, చెయ్యి కదిపితేనే ఆరోగ్యం

అదే పనిగా కూర్చొంటే అథోగతే

అన్ని అవయవాలపై దుష్ప్రభావం

గుండె నుంచి మోకాలి వరకు ఇబ్బందులే

రోజూ వ్యాయామం తప్పనిసరి

ఇంట్లో ఉన్నా...కార్యాలయానికి వెళ్లినా.. చాలామంది కూర్చోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తుంటారు. ఉన్నచోటు నుంచి కదలడానికి ఇష్టపడరు. ఇంట్లో ఉంటే ల్యాప్‌టాప్, స్మార్ట్‌ ఫోన్‌ , టీవీకి పరిమితమవుతుంటారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.                    
– విజయనగరం   

గంటల తరబడి కంప్యూటర్‌ వినియోగిస్తే కంటికి అలసట
కళ్లు: కంప్యూటర్‌ ముందు రాత్రి పగలు గంటల తరబడి పనిచేయడం వల్ల కళ్లకు ఇబ్బందులు తప్పవు. దాని నుంచి వెలువడే కాంతి కంటిచూపుపై పడుతుంది. కళ్లల్లో దురద, ఎర్ర బారడం, కన్నీళ్లు ఇంకిపోవడం (డ్రై ఐస్‌) తదితర సమస్యలు బాధిస్తాయి. ప్రతి గంటకు ఒకసారి కంప్యూటర్‌ నుంచి చూపు పక్కకు మరల్చడం, సీటులోంచి లేచి నిలబడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కొద్దిసేపు కళ్లను మూసుకోవడం ద్వారా విశ్రాంతి పొందవచ్చు. కంటి అద్దాలను ధరించవచ్చు. 

ప్రస్తుతం 25–30 శాతం వరకు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా అనారోగ్య సమస్యలకు ఇదే హేతువుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. తల నుంచి అరికాలి వరకు అన్ని భాగాలపైనా దుష్ప్రభావం చూపుతుందంటున్నారు. ఆయా అవయవాలకు జరిగే నష్టం పెద్ద మొత్తంలో ఉంటుందని చెబుతున్నారు. 

వ్యాయామం లేకపోతే శరీరానికి ముప్పు 
జీర్ణవ్యవస్థ: వ్యాయామం లేకపోవడం వల్ల ఆ భారం జీర్ణ వ్యవస్థపై పడుతుంది. చాలామంది కూర్చున్న చోటు నుంచి కదలడానికి ఇష్టపడరు. టీవీ చూస్తూ తింటుంటారు. అది తొందరగా జీర్ణం కాదు. పుల్లని తేన్పులు, గుండెలో మంట ఇతర సమస్యలు వేధిస్తాయి. రోజూ కొంత వ్యాయామం చేయడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.

సక్రమంగా కూర్చోకపోతే వెన్నునొప్పి సమస్య
మెడ, వెన్నునొప్పి: ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులు చాలామందిలో వచ్చే సాధారణ సమస్య వెన్నునొప్పి. కంప్యూటర్‌ ముందు కూర్చొనే భంగిమ, కీబోర్డ్‌లు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లను భూమికి పూర్తిగా ఆనించాలి. ఇంట్లో పడక సమాంతరంగా ఉండాలి. దిండు మరీ ఎత్తుగా మరీ తక్కువగా ఉండకూడదు. లేదంటే వెన్నుపూసలోని డిస్క్‌లపై ఒత్తిడి పెరిగి అది వెన్ను నొప్పికి దారి తీస్తుంది.

కంప్యూటర్‌ ముందు ఇలా కూర్చోరాదు
మెదడు: ఎలాంటి వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చొని గంటల తరబడి పనిచేయడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది. ఊబకాయం పెరిగి హైపర్‌ టెన్షన్‌కు దారితీస్తుంది. అధిక బీపీ ఉన్నా చాలామందిలో బయట పడదు. చివరికి ఇది బ్రెయిన్‌  స్ట్రోక్‌కు కారణమవుతుంది. మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం వంటి సమస్యలతో జీవితమే దుర్భరంగా మారుతుంది. విపరీతమైన పని ఒత్తిడి వల్ల తరచూ తలనొప్పి, నిద్రలేమి వేధిస్తుంది.

ఊబకాయంతో అధిక రక్తపోటు
గుండె:  గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక రక్తపోటు, మధుమేహం. వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయానికి దారి తీస్తుంది. ఇది అధిక రక్తపోటు, మధుమేహానికి కారణమవుతుంది. ఫలితంగా గుండె నాళాల్లో పూడికలు ఏర్పడి రక్తసరఫరా సక్రమంగా జరగదు. ఆకస్మిక గుండె జబ్బులు తలెత్తుతాయి. 
ఊపిరితిత్తులు: ఊబకాయంతో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. గురక సమస్య వేధిస్తుంది. నగరంలో ఇది ఎక్కువగా ఉంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. గురక వల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పడిపోతుంది. తద్వారా మెదడుకు మరింత ప్రమాదం. 
కాళ్ల నరాలపై: ఎక్కువ సమయం కూర్చొంటే కాళ్ల నరాల్లో పూడిక ఏర్పడుతుంది. వెంటనే చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, గుండెకు రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తి పల్మనరీ ఎంబాలిజమ్‌కు దారి తీసి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. 
క్యాన్సర్ల ముప్పు: కూర్చొని పని చేసే వారిలో క్యాన్సర్ల ముప్పు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చొని ఉంటే పెద్దపేగు, మహిళల్లో అండాశయం, రొమ్ము, పురుషుల్లో వీర్య గ్రంథి కేన్సర్లు చుట్టుముట్టే ప్రమాదం ఉందని తేల్చారు. కొందరు పనిచేస్తూ ఏమీ తినకుండా ఉంటారు. కొందరు అదే పనిగా టీవీ చూస్తూ జంక్‌ఫుడ్స్‌ ఇతర పదార్థాలు లాగించేస్తుంటారు. ఈ రెండు ప్రమాదమే.

​​​​​​​ 

బరువు పెరిగితే మోకాళ్ల నొప్పులు  
మోకాళ్ల నొప్పులు: శారీరక వ్యాయామం లేని వారిలో చాలామందికి మోకాళ్ల నొప్పులు వస్తాయి. శరీర బరువు పెరిగి అది మోకాళ్లపై పడుతుంది. కీళ్లలో ఉండే మృదులాస్థి దెబ్బతింటుంది. కీళ్లు అరిగిపోతాయి. అక్కడ వాపు వచ్చి అడుగు వేయలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ.

కూర్చుని తింటే ఊబకాయం తప్పదు 
పొట్ట (బెల్లీ ఫ్యాట్‌): అదే పనిగా కూర్చోవడం వల్ల పొట్ట భాగంలో అనవసరపు కొవ్వు పెరుగుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌గా మారుతుంది. చాలామంది కార్యాలయాల్లోని క్యాంటీన్లలో జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తింటుంటారు. పనిచేస్తూనే ఫ్రైడ్‌ స్నాక్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌ తినేస్తుంటారు. తెలియకుండానే బరువు పెరిగిపోతారు. పొట్టభాగం ముందుకొస్తుంది. ​​​​​​​

ఇలా చేయండి..  
► కొందరు ఏదో అనారోగ్య సమస్య బయట పడితేనో.. లేదంటే వైద్యులు చెప్పారనో ఉదయపు నడకకు వస్తుంటారు. వ్యాయామశాలకు వెళుతుంటారు. కొన్ని రోజులు చేసి మానేస్తుంటారు. ఇది సరికాదని వైద్యులు సూచిస్తున్నారు. 
► 25 ఏళ్లు దాటిన వ్యక్తి రోజూ గంటపాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. పెద్ద పెద్ద బరువులు ఎత్తడమో, రూ.వేలు ఖర్చు పెట్టి జిమ్‌లకు వెళ్లడమో కాదు. చెమట పట్టే ఎలాంటి పని అయినా చేయవచ్చు. రోజూ 45 నిమిషాల పాటు తప్పనిసరిగా వేగంగా నడవాలి. 
► గంటపాటు ఒకేచోట కూర్చుంటే.. లేచి 2–5 నిమిషాలు అటుఇటు తిరగాలి. చూపును కంప్యూటర్‌ నుంచి పక్కకు తిప్పాలి. సీటులో కూర్చొనే భంగిమ కూడా కీలకం. కంప్యూటర్‌ ముందుకి ఒంగిపోకుండా నిటారుగా కాళ్లు భూమికి పూర్తిగా అనించి కూర్చోవాలి. 
► చాలామంది అల్పాహారం తీసుకోవడం మానేసి నేరుగా లంచ్‌ తింటుంటారు. ఇది సరికాదు. తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. 
► లంచ్, డిన్నర్‌లో కనీసం 400 గ్రాములకు తక్కువ కాకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి తీసుకోవాలి. వీలైనంత వరకు జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు, నూనెలు, ఉప్పు ఉన్న వంటకాలు తగ్గించుకోవాలి. 

చెమట వచ్చేలా కష్టపడాలి
పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించగలిగారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కష్టపడే తత్వం తగ్గిపోతుంది. దీంతో అరోగ్యానికి అనర్దం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరు రోజూ చెమట పట్టేలా కష్టపడాలి. నడక, వ్యాయామం లేదంటే ఇతర పనులు చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 
– ఫణికుమార్, ఫిట్‌నెస్‌ ట్రైనర్, విజయనగరం

>
మరిన్ని వార్తలు