గాలితోనే జీవించిన జానీ బాబా! విస్తుపోయిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు!

25 Dec, 2023 16:46 IST|Sakshi

ఏ కారణం చేతైనా ఒక్కపూట తినకపోతే రెండో పూట ఆకలికి ఆగడం కష్టమైన పనే. ఇక పూజో, వ్రతమో చేసి.. తప్పక సాయంకాలం వరకూ ఉపవాసం ఉండాల్సివస్తే మాత్రం రాత్రికి ఆ లెక్క పక్కాగా సరిచేయాల్సిందే. ఉదయం నుంచి తినలేదనే సాకుతో తూకం సరిచేసినట్లుగా నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. అలాంటిది ఒక మనిషి.. కొన్ని ఏళ్ల పాటు నీరు, ఆహారం తీసుకోకుండా బతకడం సాధ్యమేనా?

గుజరాత్‌కి చెందిన ప్రహ్లాద్‌ జానీ బాబా 90 ఏళ్ల పాటు అలానే జీవించారు. గాంధీనగర్‌ జిల్లా, చరాడ అనే గ్రామానికి చెందిన ప్రహ్లాద్‌ జానీ బాబాకు ‘చున్రీవాలా మాతాజీ’ అనే మరో పేరుంది. అతను నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా కేవలం గాలితోనే బతుకుతున్నాడనే వార్త 2001లో సంచలనం సృష్టించింది. అయితే అదే వార్త.. మరెందరికో అనుమానాలనూ రేకెత్తించింది. దాంతో 2003 నుంచి 2010 మధ్య కాలంలో ప్రహ్లాద్‌ బాబా జీవన శైలిపై నిఘాపెట్టిన కొందరు శాస్త్రవేత్తలు.. ‘అతను చెప్పేది, చేసేది నిజమే’ అని గ్రహించి నివ్వెరపోయారు. 

అప్పటికే 70 ఏళ్లు పైబడిన ఆ మాతాజీ.. ‘నేను నా పద్నాలుగో ఏట నుంచి తినడం, తాగడం మానేశాను. ఇన్నేళ్లు నేను బతికుండటానికి కారణం సాక్షాత్తు ఆ అమ్మవారే. స్వయంగా ఆవిడే నన్ను పోషిస్తున్నారు. కాబట్టి నాకు నీరు, ఆహారం అవసరం లేదు’ అని ప్రకటించడంతో భక్తుల శాతం అమాంతం పెరిగింది. అతనిపై ‘డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌’ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని.. ‘డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (డీఐపీఏ) శాస్త్రవేత్తలు, వైద్యులు నిఘా పెట్టారు. సుమారు 15 రోజుల పాటు పరిశీలనాత్మకంగా సీసీ కెమెరాల ద్వారా అతన్ని గమనించారు. ఆ పరిశీలనలో.. అతను ఏం తినకుండా, తాగకుండా కేవలం గాలి సాయంతోనే జీవిస్తున్నాడని, అయినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తేలింది.

గాలితో మాత్రమే జీవించే యోగిగా ఎంతో ప్రజాదరణ పొందిన జానీ బాబా.. ‘మాతాజీ’గా పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. అతని వేషధారణ.. పెద్దబొట్టు, పాపిట కుంకుమ, ముక్కపుడక, గాజులు, ఎర్రటి వస్త్రాన్ని చీరగా కట్టుకునే తీరు అంతా కూడా  అమ్మవారిని తలపించేది. ‘ఆధ్యాత్మిక అనుభూతి’ కోసం జానీ చాలా చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి.. బనస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయం సమీపంలోని గుహలో నివసించారట. అక్కడే ధ్యానం చేసి.. తను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు ఆ సమీపంలోనే తన ఆశ్రమాన్ని నిర్మించారట.

దశాబ్దాల పాటు అన్నపానీయాలు తీసుకోకుండానే జీవించిన మనిషిగా అంతర్జాతీయంగా పాపులరైనప్పటికీ.. సమాజంలోని ఓ వర్గం అతని శైలిని అనుమానించింది. తన 91 ఏట.. 2020 మే నెలలో మాతాజీ మరణించారు. అతని ఆశ్రమంలోనే ఆ బాబాకు సమాధి నిర్మించిన భక్తులు నేటికీ అతన్ని దైవంగానే భావించి పూజిస్తుంటారు. ప్రస్తుతం అతని శిష్యులే ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అయితే చున్రీవాలా మాతాజీ.. అన్నేళ్లపాటు ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాకుండా ఎలా జీవించారు అనేది నేటికీ మిస్టరీనే!
సంహిత నిమ్మన

(చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్‌ దాడి! వీడియో వైరల్‌)

>
మరిన్ని వార్తలు