మన కోసమే సిలువ మరణం

30 Mar, 2018 00:18 IST|Sakshi

ఇవాళ గుడ్‌ ఫ్రైడే, అంటే శుభ శుక్రవారం, యేసు క్రీస్తును కల్వరి సిలువ వేసినరోజే శుభ శుక్రవారం అని పిలువబడుతోంది, అదేంటి యేసు క్రీస్తు సిలువలో మరణించిన రోజు శుభ శుక్రవారం ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? ఇలా లోకంలో నిజంగా యేసు క్రీస్తును ఎరుగని వారందరూ ప్రశ్నిస్తూ ఉంటారు కదూ? అయినా మరణించిన దినం చెడు అవుతుంది కానీ, మంచి దినం కాదు కదా అనే వారు కూడా ఉన్నారు.

అయితే, యేసు క్రీస్తు మరణం మానవ జాతికి జీవము కలుగజేసేదిగా ఉన్నందువలన సకల మానవుల పాప పరిహారార్థ » లిగా ప్రాణమిచ్చిన ప్రభువు మరణం సర్వలోకానికి ఆనందకరంగా మారింది. దానికి కారణం అపవాదిని మరణము ద్వారా జయించిన ప్రభువు జీవిత కాలమంతా మరణ భయంతో పీడింపబడుతున్న మనలను విడిపించినదిగా ఉన్నది గనుక యేసు క్రీస్తు మరణము శుభ దినముగా పిలువబడుతుంది.

అవును, ఎవరైతే యేసు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఆయన మరణములో ఉన్న జయము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది, కాబట్టి, యేసు క్రీస్తు మరణించిన రోజు గుడ్‌ ఫ్రైడే అయింది. లోకమంతటా ఈ శుభ శుక్రవారమును పూర్వం ఆచారంగా ఆచరిస్తుంటారేమో గాని, యేసు క్రీస్తును ఎరిగిన వారు ఈ  శుభ శుక్రవారమును ఎంతో ఆనందంగాను స్వీకరిస్తారు, మరొకసారి తమ పాప క్షమాపణల  కొరకు ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసుప్రభువు మరణాన్ని జ్ఞాపకము చేసుకుని తమ్ము తాము సమర్పించుకుంటారు.

ప్రతీ మనిషికీ మరణం తప్పదు. ఎంతోమంది దేశం కోసం, రాష్ట్రం కోసం మరణిస్తున్నారు. త్యాగంతో మరణిస్తున్నారు. ఇలా పలువిధాలైన మరణాలను మనము ఈ భూలోకంలో చూస్తున్నాము. కానీ, యేసు క్రీస్తు మాత్రం సర్వజనులను ప్రేమించి వారి పాప ప్రాయశ్చిత్త నిమిత్తము సిలువ వేయబడ్డాడు. అయితే, యేసు క్రీస్తు మరణం ఒక్కటే ప్రత్యేకమైనదిగా ఉంది. ఆయన మరణించినప్పటికీ మరణాన్ని జయించి మూడవ దినాన మృత్యుంజయుడై లేచాడు.మీకు తెలుసా? ఆనాడు యెరూషలేము పట్టణములో సమాధులు భూమిలో తవ్వేవారు కాదు. కొండలలో తొలుచునవిగా ఉండేవి, అలాగే రాతి సమాధి లో యేసు క్రీస్తు శరీరాన్ని ఉంచి ఒక పెద్ద బండను ద్వారముగా అడ్డముగా నిలిపారు.

అయితే మూడవ దినాన రాతి సమాధి తెరవబడింది, యేసు క్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచి యున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇది సత్యం. ఇది యథార్థం. ఈనాటికీ యేసు క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేము పట్టణములో మనం చూడగలం. యేసు క్రీస్తు మరణించడమే కాదు తిరిగి లేచాడు కనుక శుక్రవారం నాడు శుభ శుక్రవారంగా జ్ఞాపకం చేసుకుంటున్న వారందరు ఆదివారమును ఈస్టర్‌గా అంటే యేసు క్రీస్తు పునరుత్థానుడైన ఆదివారముగా జ్ఞాపకం చేసుకుంటారు.

యేసు క్రీస్తు మరణం మానవ జాతికి జీవము కలుగజేసేదిగా ఉన్నందువలన సకల మానవుల పాప పరిహారార్థలిగా ప్రాణమిచ్చిన ప్రభువు మరణం సర్వలోకానికి ఆనందకరంగా మారింది.

– బ్రదర్‌ కర్నే జాన్‌

మరిన్ని వార్తలు