అమరం... అమరం...

15 Mar, 2015 00:05 IST|Sakshi
అమరం... అమరం...

చెన్నై సెంట్రల్ : తెలుగువారి కబుర్లు
రేపు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

 
అవి... మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రోజులు...
 తెలుగువారంతా ఏకమై ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం గొంతు విప్పిన ఉద్రిక్త వాతావరణం...
 తెలుగు నాయకులంతా ముక్త కంఠంతో తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులు...


 మైలాపూర్‌లోని రెండు భవంతులు ఈ ప్రక్రియలో ప్రధానపాత్ర వహించాయి.
 మొదటిది శ్రీబాగ్... అమృతాంజనం వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావుగారికి చేరింది...
 రెండవది లజ్ చర్చ్ రోడ్డులో ఉన్న గార్డెన్ హౌస్...
 19వ శతాబ్దం ప్రారంభంలో దివంగత పి.ఆర్.సుందర్ అయ్యర్ నిర్మించిన భవంతి...
 పొట్టి శ్రీరాములు అమరులయిన భవంతి...
 
ఆ వీధిలోకి అడుగు పెడితే అమరజీవి మనకు అజరామరంగా కనిపిస్తారు. ఆయనను కన్నులారా వీక్షించని వారు సైతం ఒకసారి ఆయన మనలను పలకరించిన అనుభూతి చెందుతాం. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిస్వార్థంగా, ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఇక్కడ అమరుడయ్యాడా అని ఒక్కసారి గుండె తడి కాక మానదు. చిన్న సందులో ఆఖరున ఉన్న ఆ భవంతి నేడు ఎన్నో మార్పులకు లోనయినప్పటికీ, ఆయన కూర్చున్న ప్రదేశాన్ని వీక్షించగానే 1952 నాటి ఘటన మన ఎద లోతులను తడమక మానదు.
 
ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని కచ్చితంగా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, రాయలసీమకు గుండెకాయ వంటి కర్నూలుని రాజధానిగా ఏర్పాటు చేయడం... వంటి విషయాల గురించి తెలుగు నాయకులంతా విస్తృతంగా, తీవ్రంగా చర్చించుకుంటున్న రోజులు అవి. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, ఈ విషయం వెనకబడిపోయింది. 1949లో ఒకసారి, 1952లో ఒకసారి ఈ అంశం తెర మీదకు వచ్చినా, అధికారులెవ్వరూ ఈ విషయం మీద పూర్తి శ్రద్ధ వహించలేదు.  ప్రముఖ గాంధేయవాది అయిన  పొట్టి శ్రీరాములు సరిగ్గా ఆ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరశన దీక్ష ప్రారంభిస్తానన్నారు.

ఆ నిరశన వ్రతం ప్రారంభించడానికి స్థలం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పొట్టి శ్రీరాములు పట్టుదల మనిషి. ‘ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే నా దీక్ష ఏ మాత్రం ఆగదు. ముందూ వెనుకా అట్టలు కట్టుకుని వీధులలో తిరుగుతూ ప్రాణాలు విడుస్తాను’ అని ప్రకటించిన పట్టుదల మనిషి శ్రీరాములు. బులుసు సాంబమూర్తి ఆయన వ్రతానికి ఆశ్రయం ఇచ్చాడు. గాంధీజీతో మన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైతే, శ్రీరాములు ఆత్మబలిదానంతో మన చరిత్ర మరొక కొత్త మలుపు తిరిగింది. అక్టోబరు 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, డిసెంబరు 16వ తేదీ మంగళవారం, 58 రోజుల ఉపవాస దీక్షతో పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. ఆయన మరణంలో తెలుగు వారు ఒక్కసారిగా హింసామార్గంలో ప్రవేశించారు.
 
మైలాపుర్ లజ్ కార్నర్ సమీపంలో నెం. 89, రాయపేట్ హైరోడ్, ఇల్లు సాంబమూర్తి గారి నివాసగృహం. అక్కడే పొట్టి శ్రీరాములు కృశించిన, జీవం లేని దేహమున్న పవిత్ర స్థానం. ఆ గృహం ముందరి ప్రదేశంలోనే కర్రలతో, కొబ్బరి ఆకులతో నిర్మించిన వేదికపై శ్రీరాములు పార్థివదేహాన్ని ఉంచారు. శ్రీరాములు మరణవార్త దావానలంలా దేశమంతటా వ్యాపించింది. ఈలోగానే తండోపతండాలుగా వచ్చే జనంతో వీధివీధంతా కిక్కిరిసిపోయింది. వచ్చినవారు అమరజీవిని అంతిమ దర్శనం చేసుకొని ఆయన శరీరం మీద పుష్పమాలలు వుంచి అశ్రునేత్రాలతో మరలుతున్నారు.
 
ఆ నాటి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ ఇంటి వద్ద నుంచి పొట్టి శ్రీరాములు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర సాగుతున్నంతసేపు ఘంటసాల, మోపర్రుదాసు... అందరి హృదయాలు ద్రవించేలా జాతీయగీతాలను ఆలపించారు. మేడలపై నుంచి పౌరులు పూలవానలు కురిపిస్తూ, ‘పొట్టి శ్రీరాములు అమర్ రహే, మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలి’ వంటి నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా చేశారు.

‘‘శ్రీరాములు చనిపోలేదు. అతడు అమరజీవి అయ్యాడు’’ అని పెద్దలందరూ కన్నీటితో నిండిన గుండె బరువుతో ఆక్రోశించారు. ఊరేగింపులో పాల్గొన్నవారిలో తెలుగు వారే కాదు, తమిళులు తదితరులు కూడా ఉన్నారు. మద్రాసు తెలుగువారి పట్ల తమిళులు ఎప్పుడూ ఆదరభావాన్నే ప్రదర్శిస్తూ వచ్చారు. సాంబమూర్తి గారి ప్రైవేట్ కార్యదర్శి శ్రీరామదేశికర్ తమిళుడు! అయినా ఆ ఊరేగింపు ఏర్పాట్లలో ప్రముఖ పాత్ర నిర్వహించారు.
 
శ్రీరాముల ఆత్మబలిదాన ఫలితంగా ఎన్నడూ అనుకోని విధంగా మదరాసు నగరంలోనూ, ఆంధ్రరాష్ట్రంలోనూ మాత్రమే కాక దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా చెలరేగిన సంక్షోభం ఒక్కసారిగా నెహ్రూ కూర్చున్న సింహాసనాన్ని కుదిపేసింది. మరో ఆలోచన లేకుండా డిసెంబరు 19న, భాషా ప్రాతిపదికన, నెహ్రూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం ప్రకటించారు. ఇందులో కోస్తా ప్రాంతం, కర్నూలు రాజధానిగా రాయలసీమ, ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా... 1953, అక్టోబరు 1 న ప్రత్యేక తెలుగు రాష్ట్ర ప్రకటన జరిగింది.

మూడు సంవత్సరాల తర్వాత నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా ఇందులో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. శ్రీబాగ్ అనేది అమృతాంజనం ప్రాంగణంలో పురాతనంగా నిలిచిపోయింది. బులుసు సాంబమూర్తి గారి నివాసం పొట్టి శ్రీరాములు స్మారకంగా చరిత్రకెక్కింది. నాటి భవనం శిథిలం కావడంతో, వై.ఎస్. శాస్త్రి అవిశ్రాంతంగా తపస్సు చేసి, ప్రస్తుతం ఉన్న  భవంతిని పూర్తి చేసి, అక్కడ శ్రీరాములు జయంతి, వర్థంతులను ఘనంగా నిర్వహిస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఈ మహానుభావుని త్యాగఫలంగా నిర్వహించుకుంటున్నాం. కాని చెన్నైలో జన్మించి, చెన్నైలో దీక్ష చేసి, చెన్నైలో తనువు చాలించిన ‘అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం’ ఏటా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చే నిధుల కోసం నిరీక్షిస్తూ ఉండటం తెలుగువారు బాధపడాల్సిన విషయంగా పలువురు పెద్దలు అంటున్నారు.
- డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
(ఇన్‌పుట్స్: వై రామకృష్ణ, వై.యస్.శాస్త్రి రచించిన ‘అమరజీవి సమరగాథ’ పుస్తకం ఆధారంగా)

మరిన్ని వార్తలు