లోక కల్యాణం

4 Apr, 2017 23:45 IST|Sakshi
లోక కల్యాణం

ఈ లోకంలో... మనిషికి మంచి గుణాలుంటే! ఈ లోకం తప్పకుండా... సుభిక్షంగా... సులక్షణంగా... ఆనందంగా ఉంటుంది. శ్రీరాముడిని... ఎలా పూజించాలనే మీమాంస అక్కరలేదు. ఈ సకలగుణాభిరాముడి సుగుణాల్లో... కొన్నింటినైనా మనవిగా చేసుకుంటే... ఆయనకు నైవేద్యం పెట్టినట్లూ ఉంటుంది! మనకు ప్రసాదం అందినట్లూ ఉంటుంది!! అదే లోక కల్యాణం.

రామ... ఆ పేరే ఎంతో ప్రియమైనది. తియ్యనైనది. సుందరమైనది. పిబరే రామరసం... రాముని భక్తిలో ఐక్యమవడానికి మించిన ధన్యత ఏముంటుంది గనక. మానవునిగా పుట్టి దేవునిగా ఎదిగినవాడు రాముడు. బలహీన పడే సందర్భాలలో బలహీన పడక, తల వొగ్గాల్సిన సమయాలలో తల వొగ్గక, మాట తప్పాల్సిన సంకటాలలో కూడా మడమ తిప్పక... అదిగో నేను సంపూర్ణమై నిలిచాను... నా దారిలో నడవండి... ఈ దారిలో కష్టాలు ఎదురు కావచ్చు కాని విజయం మాత్రం తథ్యం... అని నిరూపించినవాడు పరంధాముడు.

కుమారుడంటే ఇలా ఉండాలి... భర్త అంటే భార్య కోసం ఇలా పరితపించాలి... సోదరుడంటే తన సోదరుల మీద ఇంత ఆపేక్ష చూపాలి, స్నేహితుడంటే తన స్నేహితుడి కష్టాలలో అండగా ఇలా ఉండాలి... ఆహా... రాముడి చరితలో ప్రతి సామాన్యుడు వెతుక్కోవాల్సిన ఘట్టాలు ఎన్నో ఎన్నెన్నో... అందుకే ధర్మవర్తనకు, ప్రవర్తనకు ప్రతిరూపం ఆ శ్రీరామచంద్రుడు. ఆయన కల్యాణ వేడుక పుడమి పరవశించే పర్వదినం. ఆ రాముడు ఎందుకు అవతారమూర్తి అయ్యాడో ఈ శ్రీరామనవమిన చేస్తున్న భక్తిపూర్వక సందర్శనమిది.

గొప్ప కుమారుడు
అయోధ్యానగరం అంటే ఒక మూలన బంగారం... ఆ మూలన వెండి... ఎటు చూసినా ఐశ్వర్యం... అది రాముడి రాజ్యం. రామరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు రాముడు. రాజయ్యాక, అవక ముందు కూడా తనను తాను దశరథ తనయుడనే చెప్పుకున్నాడు తప్ప రాజునని ఏనాడూ చెప్పుకోలేదు. అంతటి వినమ్రుడు రాముడు. చిన్ననాటి నుంచే ఆయనకు ఈ వినమ్రత ఉంది. విశ్వామిత్రుడు వచ్చి, యాగరక్షణ కోసం పంపమని అడిగినప్పుడు, తండ్రి ఆజ్ఞపై తమ్ముడు లక్ష్మణునితో కలసి విశ్వామిత్రుని వెంట నడిచాడు రాముడు. సీతాస్వయంవరానికి తీసుకెళ్లినప్పుడు లేశమాత్రంగా శివధనుర్భంగం చేసి సీతను గెలుచుకున్నా విశ్వామిత్రుడి ద్వారా తలిదండ్రులకు సమాచారాన్ని తెలియజేశాకే సీతను వివాహం చేసుకున్నాడు. తండ్రి మాట కోసం పూచికపుల్లతో సమానంగా రాజ్యాన్ని త్యజించినవాడు మానవుడవుతాడా మహనీయుడవుతాడుగానీ!

గొప్ప స్థితప్రజ్ఞుడు
కన్నతల్లి కౌసల్యను ఎంతగా ప్రేమించాడో పిన తల్లులు సుమిత్రను, కైకను కూడా అంతగా ప్రేమించినవాడు రాముడు. మరికొద్దిసేపటిలో యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన వాడు కైక వరం వల్లే సామాన్యుడిగా మిగిలాడు. కైకను నిందించినా కైకను ఎదిరించినా కైకకు తండ్రి ఇచ్చిన వరాలను తోసిపుచ్చినా,  అతడి రాజ్యం అతడికి దక్కి ఉండేది. కాని కైక దుర్బలత్వాన్ని, రాజ్యం పట్ల, కుమారుడు భరతుడి పట్ల ఆమెకున్న లాలసను రాముడు అర్థం చేసుకున్నాడు. అందుకే కైకను పన్నెత్తి ఒక్కమాట అనలేదు. అపకారికి అపకారం చేయడం దానవ లక్షణమైతే, ఉపకారం చేయడం రాముడి లక్ష్యం.

 గొప్ప భర్త
రాముడు ఏకపత్నీవత్రుడు. పురాణాలలో పతివ్రతలుగా అనేకమంది కనిపిస్తారు. కాని ఏకపత్నీవ్రతం వల్ల పూజలు అందుకున్న ఒకే ఒక పురుషుడు రాముడు. సీత సమక్షంలో లేని రాముడు అసంపూర్ణుడు. సీతారాములు అనేది జంటగా కనిపించే ఒకే మాట. రాముడూ సీతా వేరు వేరు కాదు. మనసా వాచా కలగలిసిపోయిన ఏకరూపం. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా సీతమ్మను తప్ప మరొకరి వంక కన్నెత్తి కూడా చూడలేదాయన. వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు సుకుమారి అయిన సీతమ్మ తనతో అడవులకు వస్తే కష్టపడవలసి వస్తుందని వారించాడు. తనను అడవులకు రావద్దన్నందుకు ఎన్నో విధాలుగా సీతమ్మ నిష్టూరపడితే తప్ప ఆమె తనతో రావడానికి అంగీకరించలేదు. ఇంతి కష్టం తన కష్టం చేసుకునేవాడే పురుషుడు. మర్యాదరాముడు.

గొప్ప శ్రేయోభిలాషి...
శ్రీరాముడు అందరి బంధువు. ఆయనను చూడాలని, ఒక్కసారి దర్శించాలని కోరుకోని వారెవరు? శబరి శ్రీరాముణ్ణి ఆరాధించింది. ఆయన దర్శనం కోసం పరితపించిస్తోందని తెలిసి, ఆమెను మించిన స్థాయి లేదని, ఆమె వద్దకెళ్లి, ఆమె ఎంగిలిని మహాప్రసాదంలా స్వీకరించాడు. ఇక అడవుల్లో జడ పదార్థం వలే రాయిలా మారి ఉన్న అహల్య రాముడి ఓదార్పు వల్లే తిరిగి మామూలు మనిషయ్యింది. రాముడు శ్రేయోభిలాషి. ఎదుటివారి శ్రేయస్సు కోరే వాడే శ్రీరాముడు.

గొప్ప స్నేహితుడు
మన స్నేహంలో గొప్పతనం ఉంటేనే మనకు గొప్ప స్నేహితులుంటారు. శ్రీరాముడి గొప్పతనం సుగ్రీవుడితో స్నేహంలోనే తెలిసి వచ్చింది. ఇద్దరూ కష్టకాలంలోనే స్నేహితులయ్యారు. ఇద్దరూ రాజ్యాన్ని విడిచి, అడవులలో ఉంటున్నారు. రాముడు సుగ్రీవుడికి ధైర్యాన్ని ఇచ్చాడు. అతడి వల్ల ఆసరాను పొందాడు. అందుకే సుగ్రీవుడు  ‘నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’ అంటాడు. పడవ నడిపేవాడైన గుహునితో కూడా రామునికి అంతే స్నేహం. రాముడిలాంటి స్నేహితుడు ఉంటే చేతిలో రామబాణం ఉన్నట్టే.

గొప్ప సహోదరుడు
అనుక్షణం నీడలా తనను అనుసరించే లక్ష్మణుడంటే శ్రీరాముడికి ఎంతో ప్రేమ. ఆ అన్నదమ్ముల మధ్య మౌఖిక సంభాషణ తక్కువ. వారి ఆత్మలే మాట్లాడుకునేవి. ఒకరి సమక్షమే మరొకరికి ఆనందం. అటువంటి లక్ష్మణుడికి ప్రాణం మీదకు వచ్చినప్పుడు రాముడు తల్లడిల్లిపోయాడు. ఇంద్రజిత్తు తన అస్త్రాలతో లక్ష్మణుడిని మూర్ఛిల్లజేసినప్పుడు హనుమంతుడు వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకు వచ్చి లక్ష్మణుని బతికించాక ‘నా బహిఃప్రాణాన్ని తిరిగి నాకు తెచ్చిచ్చినందుకు నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను హనుమా’ అంటూ పట్టరాని ఆనందంతో హనుమను కౌగిలించుకుంటాడు. లక్ష్మణుడే రాముడికి ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ. తమ్ముడి పర్యవేక్షణకు అంత విలువ ఇచ్చి రాముడు ఆదర్శనీయుడైనాడు.

గొప్ప ధర్మపరాయణుడు
తండ్రి కైకకిచ్చిన మాటకోసమే రాముడు వనవాసం వెళ్లవలసి వచ్చిందని తెలిసి భరతుడు మండిపడ్డాడు. వెంటనే కొంతమంది అనుచరులతో కలసి రాముడిని అన్వేషిస్తూ ఆయన ఉన్న చిత్రకూట పర్వతానికి వెళ్లి, ‘అన్నయ్యా! నిన్ను వనవాసానికి పంపించిన నాన్నగారు ఇక లేరు కదా, నీవు వచ్చి రాజ్యాన్ని ఏలుకో’ అంటూ అర్థిస్తాడు. రాముడు అంగీకరించడు. తండ్రికి ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోడు. దాంతో నిస్సహాయుడై రాముడి పాదుకలను నెత్తి మీద పెట్టుకుని వెళ్లి ఆ పాదుకలకే పట్టం కట్టి, పరిపాలన చేస్తాడు భరతుడు.

అ–సామాన్యుడు
రావణుడు మాయావి, అమిత బలవంతుడు, అపారమైన బలగం గలవాడు. తానేమో సామాన్య మానవుడు. కోతిమూక, తమ్ముడు తప్ప తనకు ఏ బలమూ, బలగమూ లేదు. అయినా సరే, రాముడు ఏమాత్రం అధైర్యపడలేదు. వారి సాయంతోనే సేతువు నిర్మించాడు. వారినే వెంటబెట్టుకుని, లంకా న గరానికి వెళ్లి, వారినే సైన్యంగా చేసుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. మధ్యమధ్యలో రావణుని మాయోపాయాలకూ, కుతంత్రాలకూ కుంగిపోలేదు. గొప్ప యుద్ధతంత్రాన్ని రచించి రావణుని సేనను, సోదరులను, పుత్రులను, ఇతర బలగాన్నంతటినీ క్రమక్రమంగా మట్టుపెడుతూ, రావణుని ధైర్యాన్ని నీరుకార్చి, చివరకు అంతటి బలశాలినీ నేలకూల్చాడు.

గొప్ప శిష్యుడు
కులగురువైన వశిష్ఠుని మాటను శ్రీరాముడు ఏనాడూ మీరలేదు. ఆయన చెప్పిన శాస్త్రాలను, శస్త్రాస్త్రాలనూ ఆపోశన పట్టాడు. మధ్యలో వచ్చిన విశ్వామిత్రుడినీ గురువుగానే భావించాడు. ఆయన వద్ద యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆయన తీసుకువెడితేనే సీతా స్వయంవరానికి వెళ్లాడు. శివధనుర్భంగానంతరం ఆయన అనుమతితోనే తల్లిదండ్రులనూ, ఇతర సోదరులనూ, పరివారాన్నీ వశిష్టునీ మిథిలానగరానికి రప్పించాడు. ఆదినుంచి అభిప్రాయ భేదాలతో రగిలిపోతున్న ఇరువురు గురువులనూ ఒక్కతాటిమీద నడిపించాడు.

గొప్ప యజమాని
చేసిన సాయాన్ని మరువని కృతజ్ఞతాభిరాముడు శ్రీరాముడు. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమంతుని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. కొన్ని సార్లయితే  సీతమ్మకు సైతం దక్కని చొరవ ఆంజనేయునికి దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. గొప్ప యజమానికే గొప్ప భక్తుడు దొరుకుతాడు. రాముడు గొప్ప యజమాని. హనుమంతుడు గొప్ప స్వామి భక్తుడు. ఈ జంట ప్రజల గుండెల్లో చెరగని జోడి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు