-

ఇరవై రెండు

24 Mar, 2015 23:09 IST|Sakshi
ఇరవై రెండు

మాధవ్ శింగరాజు
 
ఇరవయ్యీ ఇరవై రెండేళ్ల వయసులో అమ్మాయిలు ఎలా ఉంటారు? చీర కడితే దేవకన్యలా ఉంటారు. కత్తి పడితే రుద్రమదేవిలా ఉంటారు. ఒళ్లంతా మెరుపు, వయ్యారాల విరుపు. ఆ వయసులో ప్రతి అమ్మాయీ తన దేశపు యువరాణే. నింగీ తనదే, నేలా తనదే. బయట పడీ పడక కొట్టుకు చచ్చే వేల గుండెకాయల శ్రుతిలయలన్నీ తనవే. ఇరవైకి అంత ‘ఛార్మ్’ ఉంది. ‘‘అబ్బా..స్! ఇప్పుడే ఇలా ఉందంటే, ఇక ట్వంటీస్‌లో..’ అంటూ అబ్బాయిలు అప్పుడప్పుడు స్త్రీల ‘శిల్ప’యుగంలోకి ప్రయాణిస్తుండేది ఇందుకే. బహుశా స్త్రీలు కూడా వీలుంటే మళ్లీ ఆ ఏజ్‌లోకి వెళ్లిపోవాలని కోరుకుంటారేమో.

కానీ లెవిన్‌స్కీ (41) తన ట్వంటీస్ అంటేనే ఉలిక్కిపడుతున్నారు!  ‘‘వద్దు బాబోయ్, ఆ ఇరవై రెండేళ్ల వయసులోకి తిరిగి వెళ్లడం ఊహల్లోనైనా నాకు ఇష్టం లేదు’’ అంటున్నారు! ట్వంటీస్‌లో లెవిన్‌స్కీ అమెరికన్ దేవకన్యలా ఉండేవారు. కన్నీరు పెట్టకుండా, కత్తి పట్టి ఉంటే ఆమె కూడా అమెరికా అంతర్యుద్ధ రుద్రమదేవి ఫ్రాన్సిస్ క్లాలిన్ లానే కనిపించేవారు.

ఎవరీ లెవిన్‌స్కీ? మోనికా లెవిన్‌స్కీ అంటే కొంత గుర్తుకు రావచ్చు. పూర్తిగా గుర్తుకు రావాలంటే మాత్రం అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని ఆయన పాలనా సౌధంలోనే పాదాక్రాంతం చేసుకున్న అమ్మాయి అని చెప్పాలి. ఇదిగో ఈ మాటకే లెవిన్‌స్కీకి కళ్లమ్మట నీళ్లొచ్చేస్తాయి.

‘‘నేను చేసింది తప్పే. ఒక దేశాధ్యక్షుణ్ని ప్రేమించడం నా జీవితంలోని అతి పెద్ద మిస్టేక్. ఈ రోజుకీ ఏడుస్తుంటాను ఇంట్లో కూర్చుని. నన్నెంత పొడుచుకుతిందీ లోకం! ట్రాంప్ అంది. టార్ట్ అంది. స్లట్ అంది. హోర్ అంది. బింబో అంది’’ అని తలచుకుని తలచుకుని విలపిస్తున్నారు లెవిన్‌స్కీ. పదిహేడేళ్ల తర్వాత తొలిసారిగా ఆమె తన తెలివితక్కువ ప్రేమ గురించి బయట ఫ్రెండ్స్ మధ్య మాట్లాడారు..

ఓ ‘జ్ఞానోదయ కూటమి’లో.

పదిహేడేళ్ల క్రితం అంటే... కొత్తగా అప్పుడే ఇంటర్నెట్ వల పన్నుతున్న కాలం. తొలి బలి లెవిన్‌స్కీ! క్లింటన్‌తో లెవిన్‌స్కీ ప్రేమపై నెట్‌లో భారీ దుమారం రేగింది. బాగా దుష్ర్పచారం జరిగింది. ఒక వైట్‌హౌస్ ట్రెయినీ ఉద్యోగి ప్రేమలో అమెరికా ప్రెసిడెంట్ పడిపోవడం ఆ దేశ ప్రజలకు నచ్చలేదు. ఆ కోపాన్ని ఆమెపై నెట్‌లో నిర్దయగా ప్రదర్శించారు.

 ‘‘ఆ వయసులో మీరేం తప్పు చేయలేదా? చేయకపోతే చేతులెత్తండి. మీలో కొందరైనా మీ బాస్‌ను ప్రేమించే ఉంటారు. అయితే నా బాస్‌లా మీ బాస్ అమెరికా అధ్యక్షుడు కాదు. అంతే తేడా’’ అని లెవిన్‌స్కీ చిరునవ్వుతో అన్నప్పటికీ, ఆ తర్వాత ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఆమె ఫ్రెండ్స్ హృదయాలను బరువెక్కించాయి.

‘‘ఒకరి బాధ ఇంకొకరి సంతోషం అయింది. ఒకరి పర్సనల్ విషయాలు ఇంకొకరి మార్కెట్ వ్యవహారాలు అయ్యాయి. జీవితాలను నెట్‌కి ఎక్కించి ఎందుకింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు. ఈమధ్య టేలర్ అనే అబ్బాయి ఇంకో అబ్బాయిని కిస్ చేస్తుండగా రహస్యంగా తీసిన వీడియోను టేలర్ రూమ్మేట్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. టేలర్ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంగతి తెలిసి, మా అమ్మ నాకు ఫోన్ చేసి ఎంతో బాధపడింది. నా ఇరవై రెండేళ్ల వయసులోనూ అమ్మ ఇలాగే బాధపడింది. నెట్‌లో నాపై ఏవేవో వస్తున్నాయని అమ్మతో అన్నప్పుడు, వాటిని పట్టించుకోవద్దని చెప్పడానికైతే చెప్పింది కానీ, అవన్నీ భరించలేక నేనెక్కడ ఆత్మహత్య చేసుకుంటానోనని అమ్మ ఎప్పుడూ నన్ను కనిపెట్టుకునే ఉండేది. ఆఖరికి నేను స్నానం చేస్తున్నా కూడా తలుపులు తెరిచే ఉంచమని చెప్పేది’’ అని తన ఇరవైల నాటి నెట్ ‘అల్లిక ’లను నెర్వస్‌గా గుర్తుచేసుకున్నారు లెవిన్‌స్కీ.

 ప్రస్తుతం ఓ యువ పిపాసి (27) లెవిన్‌స్కీ వెంటపడుతున్నాడట.. ప్రేమిస్తున్నానని! ‘‘ఈవయసులోనా?’’ అని లెవిన్‌స్కీ ఆశ్చర్యం. ‘‘మీరొప్పుకుంటే మిమ్మల్ని మళ్లీ మీ ఇరవై రెండులోకి తీసుకెళ్లగలను’’ అని ఆ యువకుడి ఉబలాటం! లెవిన్‌స్కీ భయపడుతున్నదీ అందుకే.

 మగవాళ్లు ఎక్కడికైనా తీసుకెళ్లగలరు.. గతంలోకి, భవిష్యత్తులోకీ! వర్తమానంలో తమకు కావలసిన ప్రేమను దక్కించుకోడానికి వెనక్కీ, ముందుకీ ఎన్ని యుగాల దూరమైనా తీసుకెళ్లగలరు.
 
 

మరిన్ని వార్తలు