నవ్వుల పంచంగం

29 Mar, 2017 05:19 IST|Sakshi
నవ్వుల పంచంగం

పుట్టిన తిథీ వేళా విశేషం, ప్రదేశం, నక్షత్రం... ఇవేవీ తెలియకున్నా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడం అంటే అందరికీ ఆసక్తి. అందుకే  ప్రతి ఒక్కరూ  రాశిఫలాలు చూస్తుంటారు. అసలు రాశిఫలాలు ఎలా ఉన్నా... ఈ రోజు సంతోషంగా ఉంటే... అదే వరసలో మిగతా రోజులన్నీ ఆనందంగా నడుస్తాయన్న నియమం ప్రకారం మిమ్మల్ని నవ్విస్తూ, ఆనందంగా ఉంచుతూ, సంతోషాలు పంచుతూ ఉంచాలన్న సంకల్పంతోనే ఈ ‘సకల జనుల రాశి ఫలాలు’! ఇవి ఎవరికైనా వర్తిస్తాయి. అందరికీ పనిచేస్తాయి. ఏదో ఒక దశలో ఇవి మీ జీవితంలో నిజమై మిమ్మల్ని అబ్బురపరుస్తాయన్న గ్యారంటీ కూడా ఇస్తున్నాం. సరదాగా చదువుకోండి. నిజమైనప్పుడు థ్రిల్లవ్వుకోండి. ఎవరి మనోభావాలూ కించపరచకుండా కేవలం అందరూ ఆనందంగా చదువుకోవడమే ఈ  ప్రయత్నం, ప్రయోగం...  తప్పక కలిగిస్తుంది మీకు నవ్వుల యోగం!

మేషం : ఈ రాశి చిహ్నం మేకపోతుకు చిరు గడ్డం ఉన్నట్లుగానే లోకంలోని ఉద్యోగ వ్యాపారుల్లో చాలామందిది చిరు ఆదాయమే. అది పెరిగే అవకాశం ఎప్పటికైనా ఉంది. అందరికీ గడ్డం పెరిగే అవకాశం ఉంది కాబట్టి గీసుకునే అవకాశం తప్పక ఉంటుంది. ఆ సమయంలో బ్లేడ్‌ వాడేటప్పుడు అప్రమత్తత అవసరం. నిర్లక్ష్యం వహిస్తే తెగే అవకాశం ఉంది. చెంపలపై షేవింగ్‌ క్రీమ్‌ పూసుకునే సమయంలో పెద్దగా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. అయినా నురుగు ముక్కులోకి, నోట్లోకి పోకుండా చూసుకోవాలి.

వృషభం : ఈ రాశి చిహ్నమైన వృషభానికి ఉన్నట్లే చాలా మందికి గంగడోలు ఉంటుంది. అయితే ఇది రాశిచిహ్నం లోని మెడపైన ఉంటే మనుషులకు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. దాన్ని వాడుకభాషలో పొట్టగా వ్యవహరిస్తారు. పొట్టను గంగడోలుకు ప్రత్యామ్నాయం అనుకొని నిమురుకోవడం అంత మంచిది కాదు. అది దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది. సామ్యంలో ఒకేలా అనిపించినా గంగడోలు, పొట్ట వేర్వేరు అని గ్రహించాలి. పొట్టను నయానో, భయాన్నో అరగదీయడానికీ, కరగదీయడానికీ ప్రయత్నించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

మిథునం : ఎండలు తీవ్రంగా ఉన్నందున ఈ రాశి చిహ్నంలోని బొమ్మల్లా తమ ఆత్మీయులు దగ్గరైనా ఆలింగనం చేసుకుంటే చెమట పట్టవచ్చు. ఫలితంగా  అసౌకర్యం. పాత స్నేహితుల కలయికతో ఇరానీ చాయ్‌ తాగడానికి కేఫ్‌కు వెళ్తే అక్కడ కొందరు సిగరెట్లు తాగుతూ పొగ« దారాళంగా ఊదుతుంటారు. ‘ఈ నగరానికి ఏమైంది’ యాడ్‌ పెద్దగా ప్రయోజన మివ్వలేదని తెలుస్తుంది. ఈలోపు ముక్కులోకి పొగ దూరిపోయి దగ్గులు, తుమ్ములు ధారాళంగా వస్తాయి. శ్వాసకోశవ్యాధులకు తగినంత అవకాశం ఉన్నందున సిగరెట్ల షాపు దరిదాపులకు పోరాదు. అయినా అదేపనిగా పోతే ఆస్తినష్టంతో పాటు ఆరోగ్యభంగమూ కలిగే అవకాశం ఉంది.

కర్కాటకం :  దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఎక్కడికి వెళ్లాలో తెలియనప్పుడు ఈ రాశి పేరుకు దగ్గరగా ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కర్కాటక రాశివారు ప్రయాణం కట్టడంలో తప్పు లేదు. చాలామందికి పరోఠా లేదా రోటీ తినాలనే సంకల్పం నెరవేరదు. అయినా నిరాశ పడాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా బిసిబేలాబాత్‌ ఉండనే ఉంటుంది. ప్రత్యామ్నాయం అంటేనే ఆశాజనకం అన్నమాట.  

సింహం : గడ్డం చేసుకున్నా, చేసుకోకపోయినా మనుషులూ, సింహం సేమ్‌ టు సేమ్‌ అని నిర్లక్ష్యం వహించరాదు. పేలు పడే ప్రమాదం ఉన్నందున జూలు చిన్నగా కత్తిరించుకోవడమే మంచి ఫలితాన్నిస్తుంది. సింహం లాంటి మనస్తత్వంతో ఎప్పుడూ ట్రాఫిక్‌ రూల్స్‌ కచ్చితంగా పాటిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు గత్యంతరం లేక పక్కనే ఉన్న సందులోకి షార్ట్‌కట్‌గా వెళ్లడానికి, మీ వాహనాన్ని ‘కీప్‌ రైట్‌’ అంటూ రోడ్డుకు కుడివైపుగా నడుపుతారు. రాంగ్‌ రూట్లో వెళ్తూ కూడా...  తాము కీపు రైటు అనుసరిస్తున్నందున ‘రైట్‌ వే’లోనే వాహనం నడుపుతున్నందున సంతృప్తి చెందుతారు.

కన్య : ఈ ఏడాది కన్య రాశి వారికి కూడా ‘ధన’‘కనక’ ‘వస్తు’ ‘వాహన’ యోగం సమృద్ధిగా ఉంది. అయితే బ్యాంకు నిర్ణయాల కారణంగా ధనాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి వాహనం కొనే అవకాశాలూ కలిసిరావు. ఒకవేళ వాహనం కొనే అవకాశం ఉన్నా... క్షణక్షణానికి మారుతుండే చమురు ధరల వల్ల వాహనం కొన్నా పెద్దగా ఫలితం ఉండదు. డబ్బును ఇతరుల దగ్గర పెట్టి పెట్టుబడులు పెట్టే మదుపరులకూ కలిసి రాదు. డబ్బును ఆదా చేసుకుని కళ్లముందు ఉంచుకోవాలనుకునే  పొదుపరులనూ దరిద్రమూ వదిలిపోదు.

తుల : ప్యాంటుకు ఇరువైపులా సమానంగా ఉండే జేబుల్లోన ఈ రాశికి చెందిన వారు వస్తువులను కొలచినట్లుగా, ఒక పద్ధతిగా పెట్టుకుంటారు. అయితే ఆసారి కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లడం మరచి పోతారు. అయినా బాధపడరు. అకస్మాత్తుగా నగదు అవసరం పడుతుంది. ఏటీఎంలోకి వెళ్లి జేబు చూసుకుంటే డెబిట్‌ కార్డు మరచిపోయినట్లుగా గ్రహిస్తారు. అయినప్పటికీ ‘నో క్యాష్‌’ బోర్డు కనిపించడంతో కార్డు మరచినా స్థిమితపడతారు.

వృశ్చికం: మనిషి అన్నాక ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలనే స్ట్రిక్ట్‌ మనస్తత్వం మీది. కానీ అప్పుడప్పుడు పక్కనే ఉన్న సందులోకి ప్రవేశించడానికి రూల్స్‌ ఉల్లంఘిస్తారు. ప్రాతఃకాలంలో పెద్దగా ట్రాఫిక్‌ లేనప్పుడు, అంత ఎక్కువగా రద్దీ లేనప్పుడు ఇలా ఎవరికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను అతిక్రమించడం అన్నది నేరమో, పొరబాటో కాదని... అది కేవలం సర్దుబాటు అని నిర్వచిస్తారు. మీ వాదనతో చాలామంది ఏకీభవించడం వల్ల వారందరినీ మీరు ప్రభావితం చేయగలుగుతారు. ఎవరూ మీ మాట వినరని ఆత్మన్యూనత పొందే మీకు ఎంతోమంది ఫాలోవర్స్‌ ఉన్నారని గ్రహించి ఆనందిస్తారు.

ధనుస్సు: విద్యార్థులకు స్థానోన్నతులు. ఉద్యోగులకు స్థానభ్రంశాలు. వేసవిలో కొత్త సినిమాల రిలీజ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. అంటే ఆఫీసు సీటులో కంటే సినిమాలో సీటులో ఎక్కువగా కనిపిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఎక్కువే. అనగా కొత్త సినిమాలకు టిక్కెట్ల కోసం కార్పొరేట్‌ బుకింగ్స్‌లో ఎక్కువ మొత్తాలు చెల్లించి బాల్కనీలో ఉన్నతస్థానాల్లో కూర్చుంటారు.  ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్‌ తింటారు. పాప్‌కార్న్‌ ధర తెలిసి హాహాకారాలు చేస్తారు.

మకరం : ఈ రాశిచిహ్నమైన మొసలి లాగే చాలామందికి ‘పట్టు’దల ఎక్కువ. అందుకే ఎంతకూ తగ్గకూడదనే ఉద్దేశంతో రూ.100 విలువ చేయని టిక్కెట్టును మొదటి ఆటకే చూడాలని రూ. 10,000 లకు కొంటారు. మొసలి  అటు నీళ్లూ, ఇటు నేల మీద ఉన్నట్లే... ఈ సినిమా జీవులు వీలును బట్టి అయితే మల్టీప్లెక్సులూ లేకపోతే థియేటర్లలో కనిపిస్తారు. బాక్సాఫీసు క్యూలో సమయం మందకొడిగానూ, సినిమాలో అది వేగంగా నడుస్తుంది.

కుంభం :  కుండలో మన్ను, కావడిలో కొయ్య... ఇదే జీవితసారమని తత్వం గ్రహిస్తారు. ఈ గ్రహింపును కాగితపు నోటుకూ, డెబిట్‌ కార్డునకూ అన్వయిస్తారు. పేపర్‌లో కాగితం ఉన్నా... కార్డులో ప్లాస్టిక్‌ ఉన్నా అంతా డబ్బే అని గ్రహిస్తారు. పొడవు పొడవు ఏటీఎం క్యూలలో నిలబడి, తోసుకొని బోర్లాపడి పళ్లూడగొట్టుకోవడం కంటే, చేతిలో ఉన్న కార్డును ఉపయోగించి నిలబడి కుంభం నీళ్లు తాగినంతతేలిగ్గా డబ్బూడగొట్టుకోవడం మేలని తెలుసుకుంటారు.

మీనం : ఇటీవలి పరిణామాల తర్వాత మనుషులంతా కొద్దిపాటి నీళ్లలో సర్దుకున్న చేపల్లా తమ బతుకు తాము బతుకుతున్నారు. ఈ చేపలకు సేవలందించాలనే సత్పురుషులు కొందరు... ‘‘కస్టమర్ల మరింత సమర్థ సేవ కోసం బ్యాంకు  సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేశామనీ, తమ వివరాలన్నీ వివరంగా చెబితే డబ్బులు ఇంటికే అందించి, ఖాతాదారుల నిద్రకు సైతం అంతరాయం కూడా కలిగించకుండా బెడ్డు మీదే డబ్బులు రాశిగా పోసి వెళ్తామని నమ్మించే ఆషాఢభూతులు పెరిగారు. ఖర్మగాలి నమ్మితే... మిమ్మల్ని తమ మొబైల్‌షేపు గేలాలకు వేలాడేసుకొని కోసుకొని కూరొండుకు తినేస్తారు జాగ్రత్త.  
– రాంబాబు

మరిన్ని వార్తలు