వంట చేను

24 Jan, 2020 02:30 IST|Sakshi

ఇంటిప్స్‌

బంగాళదుంప, పాలకూర, కీరదోస, టొమాటో, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, యాపిల్‌... ప్రతి కూరగాయ, పండు.. పొలం నుంచి మన ఇంటికి వచ్చే లోపు ఎన్నో మజిలీలు తీసుకుంటుంది. ప్రతి దశలోనూ ఈ కూరగాయలు నేలను తాకుతాయి, మట్టిలో ఈదుతాయి. పండ్ల మీద పురుగులు దాడి చేస్తుంటాయి. పంట చేనులో మొదలయ్యే కల్మషం వంట చేను వరకు ప్రయాణిస్తుంది.  కాౖయెనా, ఆకైనా, పండైనా మన కడుపులోకి వెళ్లే ముందు వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా శుభ్రం చేయడానికి జాతీయ, అంతర్జాతీయ పోషకాహార నిపుణులు సూచించిన ఓ ఐదు రకాల పద్ధతులను చూద్దాం.

చన్నీటి ధార కింద కడగడం
ఇది అత్యంత సులువైన పద్ధతి. కూరగాయలను ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని నింపాలి. నాలుగైదు నిమిషాల తర్వాత వాటిని ఆ నీటిలో నుంచి తీసి నీటి ధార కింద పెట్టి చేత్తో రుద్ది కడగాలి. ఇలా కడిగిన వాటిని మళ్లీ ఒకసారి పాత్రలో నిండుగా నీరు పోసి కడిగి ఆ నీటిని వంపేయాలి. పండ్లు అయినా ఇదే పద్ధతి. పుట్ట గొడుగులను నీటి ధార కింద పెట్టి కడిగితే అవి నలిగిపోతాయి. కాబట్టి నానబెట్టిన తర్వాత వాటిని తడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత నీటిలో ముంచి తేలిగ్గా వేళ్లతో రుద్ది కడగాలి.

వెనిగర్‌ నీటితో కడగడం
ఒక లీటరు నీటిలో పది మిల్లీలీటర్ల వెనిగర్‌ కలిపి ఆ మిశ్రమంలో కూరగాయలను నానబెట్టి, ఇరవై నిమిషాల తర్వాత చేత్తో రుద్ది కడగాలి. ఆ తర్వాత మంచి నీటిలో ముంచి కడగాలి.

ఉప్పు నీటితో
పండ్లను, కూరగాయలను వెనిగర్‌ నీటికి బదులుగా ఉప్పు నీరు లేదా బేకింగ్‌ సోడా నీటితో కూడా శుభ్రం చేయవచ్చు. ఒక లీటర్‌ నీటిలో ఒక టీ స్పూన్‌ బేకింగ్‌ సోడా కానీ ఉప్పు కానీ కలపాలి. ఆ నీటిలో కూరగాయలను ఐదు నిమిషాల సేపు ఉంచాలి. పండ్లు అయితే అరగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత తిరిగి మంచి నీటితో కడగాలి.

బ్లాంచింగ్‌
ఇది వేడి నీటితో శుభ్రం చేసే ప్రక్రియ. వెడల్పు పాత్రలో నీటిని మరిగించి స్టవ్‌ ఆపేసి కూరగాయలను వేయాలి. రెండు లేదా మూడు నిమిషాల లోపే వాటిని తీసి చన్నీటి పాత్రలో వేయాలి.

వెనిగర్‌ స్ప్రే
దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్‌ల వైట్‌ వెనిగర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఉపయోగించే ముందు బాటిల్‌ను బాగా కదిలించి కొద్ది మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకుని కూరగాయలకు, పండ్లకు పట్టించి ఒక నిమిషం పాటు రుద్ది తర్వాత చన్నీటితో కడగాలి.
జీర్ణవ్యవస్థలో ఎదురయ్యే అనేక అసౌకర్యాలకు కారణం కూరగాయలు, పండ్లను సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోవడమే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మర్చిపోకూడదు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు