Sakshi News home page

‘నల్ల తామర’కు ముకుతాడు?

Published Thu, Dec 7 2023 12:10 PM

Researchers Created Varieties Of Chillies That Are Resistant To Black Thrips - Sakshi

సాక్షి సాగుబడి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామరను తట్టుకునే మిరప రకాలను రూపొందించుకునే పరిశోధనల్లో వరల్డ్‌ వెజిటబుల్‌ సెంటర్‌ గణనీయమైన పురోగతి సాధించింది. తైవాన్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్‌ వెజిటబుల్‌ సెంటర్‌ (డబ్ల్యూ.వి.సి.) దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానం పఠాన్‌చెరులోని ఇక్రిశాట్‌ ఆవరణలో ఉంది.

ఈ కేంద్రంలో సాగులో ఉన్న నల్లతామరను తట్టుకునే గుణాలున్న 9 మిరప రకాలతో కూడిన ప్రదర్శన క్షేత్రాన్ని ఆసియా అండ్‌ పసిఫిక్‌ సీడ్‌ అసోసియేషన్‌(ఎపిఎస్‌ఎ)కు చెందిన 50 ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. ఆసక్తి కలిగిన విత్తన కంపెనీలతో కలసి త్వరలో చేపట్టనున్న బ్రీడింగ్‌ ప్రాజెక్టు ద్వారా నల్లతామర, తదితర చీడపీడలను చాలావరకు తట్టుకునే సరికొత్త సంకర వంగడాలను రూపొందించనున్నట్లు డబ్ల్యూ.వి.సి. ఇండియా కంట్రీ డైరెక్టర్‌ అరవఝి సెల్వరాజ్‌ తెలిపారు.

10 రాష్ట్రాల్లో మిరపకు నల్లతామర
ప్రపంచంలో మిరపను అత్యధిక విస్తీర్ణంలో పండిస్తూ, వినియోగిస్తూ, ఎగుమతి చేస్తున్న దేశం భారత్‌. అంతేకాకుండా, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న రెండో పెద్ద కూరగాయ పంట మిరప. హెక్టారుకు రూ. 2.5–3 లక్షల వరకు పెట్టుబడి అవసరమైన ఈ పంట దేశంలో సుమారు 7.30 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తామర పురుగులు గతం నుంచి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. అయితే, ఇండోనేసియా నుంచి బొప్పాయి ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన నల్ల తామర 2015లో తొలుత మిరపను ఆశించి విధ్వంసం సృష్టిస్తోంది. గత రెండు–మూడేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నల్ల తామర తాకిడిని తట్టుకోవడానికి అతి తరచూ పురుగుమందులు పిచికారీలు చేసినా దిగుబడి నష్టం 40–50 శాతం ఉంటుంది.

ఏభయ్యేళ్ల పరిశోధన
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దీన్ని తట్టుకునే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కూరగాయ పంటలపై గత ఏభయ్యేళ్లుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన వంగడాల అభివృద్ధికి, స్థానిక వంగడాల అభివృద్ధికి దోహదపడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్‌ వెజిటబుల్‌ సంస్థ. తైవాన్‌లోని ప్రధాన పరిశోధన స్థానం కలిగిన డబ్లు్య.వి.సి. ప్రధానంగా మిరప, టొమాటో, కాకర, గుమ్మడి, బెండ, పెసర, వెజ్‌‡సోయాబీన్స్, తోటకూర పంటలకు సంబంధించి చీడపీడలు తట్టుకునే మెరుగైన వంగడాల అభివృద్ధిపై ఈ సంస్థ గత ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. అయితే, పటాన్‌చెరులోని డబ్ల్యూ.వి.సి. కేంద్రంలో ముఖ్యంగా మిరప, టొమాటో, పెసర, వెజ్‌ సోయాబీన్‌ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

మెరుగైన వంగడాలు వాడితే తక్కువ పిచికారీలు చాలు
తైవాన్‌లోని డబ్ల్యూ.వి.సి. పరిశోధనా కేంద్రంలో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు 7 రకాల మిరప వంగడాల్లో గుర్తించారు. పటాన్‌చెరు కేంద్రంలో గుర్తించిన మరో 2 మిరప రకాలను గుర్తించాం. ఈ 9 రకాలపై రెండేళ్లుగా పరిశోధనలు చేయగా, ఇందులో 6 రకాల్లో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలకు కారణమైన జన్యువులను, వాటికి సంబంధించిన మార్కర్లను గుర్తించాలి. ఇందుకు ఆసక్తి గల స్థానిక ప్రైవేటు విత్తన కంపెనీలతో కలసి తదుపరి దశ పరిశోధనలు సాగించాల్సి ఉంది.

ఈ పరిశోధనలన్నీ పూర్తయి నల్లతామరను చాలా మటుకు తట్టుకునే మెరుగైన మిరప విత్తనాలు రైతులకు చేరటానికి మరో 3–4 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. మెరుగైన విత్తనాలు వాడితే తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఈ మెరుగైన విత్తనాలను వాడుతూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అవసరం. దీర్ఘకాలం పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేందుకు అనువైన మిరప వంగడాల అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యం. – డా. నల్లా మనోజ్‌కుమార్, అసిస్టెంట్‌ సైంటిస్ట్, వరల్డ్‌ వెజిటబుల్‌ సెంటర్, దక్షిణాసియా పరిశోధనా కేంద్రం, ఇక్రిశాట్‌ ఆవరణ, పటాన్‌చెరు

Advertisement

What’s your opinion

Advertisement