పెళ్లి సందడి షురూ...!

30 Oct, 2019 08:52 IST|Sakshi
వివాహ వేడుకలో తలంబ్రాలు పోసుకుంటున్న నూతన జంట (ఫైల్‌ ఫోటో)

నేటి నుంచి డిసెంబర్‌ 8 వరకు మంచి ముహూర్తాలు

బిజీ అవుతున్న పురోహితులు...

క్యాటరింగ్‌కు పెరిగిన డిమాండ్‌...

కళ్లు చెదిరేలా ఏర్పాట్లకు సిద్ధమవుతున్న నిర్వాహకులు 

అన్నింట్లో పోటీ.. ఏదీ చేసినా సెన్సేషన్‌.. అందరూ శభాష్‌ అనేలా చేయాలనేది నేటి కాస్సెప్ట్‌.. ఎవరూ చేయలేనిది చేయకూడనిది చేసి హౌరా అనిపించాలనేది ధనవంతుల మనస్సులో ప్రణాళిక. ఉన్నంతలో తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలనేది మధ్య తరగతి కుటుంబాలు మనోగతం. వివాహాల విషయంలో శుభలేఖలు మొదలు.. వీడియో, ఫొటోలు, అలంకరణ, స్టేజీ ఏర్పాటు, లైటింగ్, గుర్రపుబండ్లతో ర్యాలీ.. మ్యూజికల్‌నైట్స్‌.. ఒక్కటేమిటి ప్రతీది ప్రత్యేకంగా ఉండాల్సిందే. బంధుమిత్రలతో పాటు ప్రతిఒక్కరు మీ బాబు, మీ అమ్మాయి వివాహం అదరహో.. సూపర్‌ చేశారు.. అంటూ ప్రసంశల వర్షం కురిపించుకుంటే చెప్పలేని ఆనందం. నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుండడం ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో.. పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. 

సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో వివాహల సందడి నెలకొనుంది. నవంబర్‌ 1, 6, 14, 15, 22, 28, 30వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధికసంఖ్యలో ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ ముహుర్తాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. 

వీడియోలకు ప్రాధాన్యం...
ఎంత తీసుకున్నా ఓకే. వీడియో, ఫొటోలు అద్భుతంగా ఉండాలి. ప్రతిఘట్టాన్ని మర్చిపోలేని రీతిలో.. భవిష్యత్‌లో తీపిగుర్తుగా మిగిలిపోయేలా టేకింగ్‌ ఉండాలని నిర్వహకులు కోరుతున్నారు. కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వీడియోలు, ఫొటోలకు నజరానా ఇస్తున్నారు. అధునాతన కెమెరాలు ఉండాలి, ప్రతి సన్నివేశం చిత్రీకరించేందుకు స్టాప్‌ సరిపడా తెచుకోవాలని ఆంక్షలు విధిస్తున్నారు. అందుకే వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్‌లకు ఈ నాలుగు రోజులకు డిమాండ్‌ పెరిగింది. 

బంగారం, వస్త్ర దుకాణాలకు క్యూ..

పెళ్లి అంటే ముందు గుర్తు వచ్చేది బంగారం, వస్త్రాలు. వీటి కోసం కనీసం 4 నుంచి 5రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే మంచి మోడల్స్‌ ఎంపిక చేయడం, పెళ్లికూతురు, పెళ్లి కొడుకులతో పాటు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులకు కూడా స్థాయిని బట్టి బంగారం, వెండి, వస్త్రాలు పెడతారు. దీంతో బంగారు దుకాణాలు, వస్త్ర దుకాణాలు కిటకిటాలాడుతున్నాయి. కంపనీ వస్త్రాలకే పెళ్లి కుటుంబాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

పురోహితులు బిజీ..
పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో పురోహితులు బిజీగా మారిపోయారు. ఒకే రోజు ఒక్కో పురోహితుడు 3 వివాహాలు జరిపించేలా ముహుర్తాలు సెట్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రధాన పురోహితులు, ప్రధాన ఘట్టం మాత్రమే దగ్గరుండి నిర్వహించి, మిగిలిన కార్యక్రమం సహాయకులు చూసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫంక్షన్‌హాల్స్‌ కూడా పూర్తిగా బుకింగ్‌ అయిపోయాయని పురోహితులు అంటున్నారు.

క్యాటరింగ్‌కు డిమాండ్‌..
గతంలో మాదిరి వివాహానికి హాజరయ్యే అతిథులకు విందు కోసం కూరగాయలు, సరుకులు తెచ్చి వండించే విధానం దాదాపు లేదనే చెప్పాలి. అంతా కేటరింగ్‌కు ఇవ్వడమే ప్రస్తుత పరిస్థితులు. మాకు ఇన్ని రకాల స్వీట్లు, హాట్లు, పప్పు, సాంబారు, పచ్చళ్లు, మాంసం, అప్పడాలు వంటివన్ని సుమారు 20 నుంచి 25 రకాలు మెనూ కావాలి అంటూ కాంట్రాక్టులు ఇస్తున్నారు. మెనూను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఇక పెళ్లిళ్ల నిర్వాహకులకు వంటలు, వడ్డనతో సంబంధం ఉండదు. వీరూ అతిథుల్లాగా వెళ్లడమే. 

డీజే.. బ్యాండ్‌.. భజంత్రీలు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివాహం చేసుకునే కుటుంబాలు భాజా భజంత్రీలు, బ్యాండ్‌తో పాటు డీజే మ్యూజిక్‌ను ఎంచుకుంటున్నాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని చేసేటప్పుడు సంప్రదాయంగా బాజా భజంత్రీలు, జిలకర బెల్లం, తాళికట్టే సమయాల్లో భాజా, బ్యాండ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సాయంత్రం భరాత్‌ తీయడానికి డీజేను అధికసంఖ్యలో ఎంచుకుని డ్యాన్స్‌లు చేస్తున్నారు. 

కళ్లు చెదిరేలా కల్యాణ మండపాలు..
సినిమా షూటింగ్‌ల తరహాలో కల్యాణ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. కాసులు కురిపించే కొద్దీ కాంతిలీనే కల్యాణ మండపాలు ముస్తబవుతాయి. దీని కోసం రూ.లక్షలు వేచిస్తున్నారు. డెకరేషన్స్‌ చేసే వారికి ఇప్పటికే ఆర్డర్‌లు ఇచ్చేశారు. కళ్లుమిరుమిట్లు గొలిపేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ మాసంలో మంచి ముహూర్తాలు..
మార్గశిర మాసంలో వివాహాలు మంచిది. కార్తీకమాసంలో కొద్ది రోజులు మూఢాలు రావడంతో వివాహలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ కార్తీకమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఈ మాసంలో వివాహాలు చేసుకోవడంతో నూతన జంటల దాంపత్య జీవితం మంచిగా ఉంటుంది. ఇప్పటికే ఒక్కో రోజు 3 వివాహాలు జరిపించడానికి పురోహితులు సిద్ధమయ్యారు. కార్తీకమాసం భక్తితో పాటు శుభ కార్యాలకు మంచిదిగా చాలా మంది భావిస్తారు. – మార్తి పవన్‌కుమార్‌ శర్మ, పురోహితుడు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా