నిషేధ క్రికెటర్‌కు బాసటగా నిలిచిన ప్రధాని

30 Oct, 2019 09:07 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌కు ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అండగా నిలిచారు. అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించిన అనంతరం ఆమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘షకీబుల్‌ పొరపాటు చేశాడు. ఆ విషయాన్ని అతడు కూడా ఒప్పుకున్నాడు. ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం, క్రికెట్‌ బోర్డు ఏమి చేయలేదు. అయితే ఇలాంటి సమయంలో షకీబుల్‌కు అండగా నిలవాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు సూచిస్తున్నా’ అంటూ హసీనా పేర్కొన్నారు. ‘అతనొక గొప్ప క్రికెటర్‌. సుదీర్ఘ కాలంగా బంగ్లాదేశ్‌కు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. అయితే నిషేధం కాలం ముగిసిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి దేశానికి సేవచేస్తాడని ఆశిస్తున్నాం’అంటూ బీసీబీ పేర్కొంది.   

ఫిక్సింగ్‌ చేసేందుకు తనను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్‌ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై చర్య తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీబ్‌ను బుకీ సంప్రదించాడు. బంగ్లా కెప్టె న్‌పై ఐసీసీ మూడు వేర్వేరు ఆరోపణలు చేసింది. అతను తన తప్పు అంగీకరించడంతో శిక్ష విధించింది. ‘అవినీతికి పాల్పడేందుకు ఎవరైనా సంప్రదించినప్పుడు ఏదైనా తప్పనిసరి కారణం ఉంటే తప్ప ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం అందించాలి. ఎంత ఆలస్యం చేస్తే విచారణ అంత సంక్లిష్టంగా మారుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏ మ్యాచ్‌ కోసమైతే సంప్రదించారో ఆ మ్యాచ్‌ ముగిసేవరకు కూడా ఆగరాదు’ అని ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలో నిబంధన 2.4.4 చెబుతోంది. దీని ప్రకారం కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఈ నిబంధనను షకీబ్‌ అతిక్రమించాడు. అత్యంత అనుభవజ్ఞుడైన షకీబ్‌కు నియమ నిబంధనలపై అన్ని రకాలుగా అవగాహన ఉందని, అయినా సరే అతను దీనిని వెల్లడించకపోవడం తప్పిదంగా భావిస్తున్నట్లు ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ వ్యాఖ్యానించారు.


 

మరిన్ని వార్తలు