-

వైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్

24 Aug, 2016 22:48 IST|Sakshi
వైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్

ఫస్ట్ పర్సన్

ఉద్యమాల వెనకాల ఉద్యమం ఉంటుంది. ఈ కోదండరాముడి వెనక సుశీల ఉంది. శ్రీరాముడు సీతమ్మ కోసం ఒక ఉద్యమమే నడిపాడు.  ఈ సుశీలమ్మ ఉద్యమానికి తన భర్తనే ఇచ్చేసింది.  ఆయనకు ‘టి’ ఉద్యమంతో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ దొరికింది.  ఈమెకి ‘టీ’ టైమ్‌లో వైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ దక్కింది.  ఈ ఉద్యమ నీడను మీ కోసం వెలుగులోకి తెచ్చాం!


ఆమె అతని కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇంటికి వస్తే పలకరిద్దామని, కాసేపు కబుర్లు చెబుదామని, కనీసం కలిసి టీ తాగుదామని. కాని ఆ నిరీక్షణ ముగిసేది కాదు. ప్రజలతో తిరిగే మనిషికి కుటుంబం దాదాపు అప్రధానమౌతుంది. అతని ఉద్యమంలో ఆ కుటుంబం కూడా భాగమైపోతుంది. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస సైనికుడు. కానీ ఆయనను వెనక ఉండి నడిపించేది మాత్రం ఆయన సహచరి సుశీల. కోదండరాం తెలంగాణ ఉద్యమ సారథి కావచ్చు. కాని ఆయన జీవిత సారథి మాత్రం సుశీలే. ఆమెతో సంభాషణ...

     
మీ జీవితంలోకి ఈ ఉద్యమకారుడెలా వచ్చారు?

అనుకోకుండా. బంధువుల పెళ్ళిలో నన్ను చూసి, నచ్చానని, ఇష్టమైతే పెళ్ళి చేసుకుంటానని  కబురు పంపారు. కాలేజీ లెక్చరర్ కదా జీవితం హాయిగా ఉంటుందనుకున్నాను. పెళ్ళి కుదిరింది. కానీ  సంతకాల పెళ్ళి చేసుకుందామనేసరికి షాక్ అయ్యాను.  ఆ రోజుల్లో అదో పెద్ద వింత. మా ఊరు ఊరంతా... ఆఖరికి పెళ్ళికి పిలవని వాళ్ళు సైతం ఈ సంతకాల పెళ్ళి ఎలా జరుగుతుందో చూడాలని నిజామాబాద్ వచ్చారు. అలా మా పెళ్లిరోజున (1983 మార్చి 30) ఈయన ఇచ్చిన షాక్ ఆ తర్వాత జీవితమంతా కొనసాగుతూనే ఉంది.

     

పెళ్లయ్యాక ఈయన ధోరణి ఎలా ఉండేది?
హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఓ చిన్న ఇంట్లో కాపురం ఉండేవాళ్లం. అప్పుడాయన పౌరహక్కుల సంఘంలో పని చేసేవారు. బాలగోపాల్ గారితో ఎక్కడెక్కడికో వెళ్ళేవారు. ఈ హక్కులేమిటో, ఇంటి నిండా పోస్టర్లేమిటో, పాంప్లేట్స్ ఏమిటో అర్థమయ్యేది కాదు. నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. ఆయన కాలేజీ లెక్చరర్. ఇద్దరం కలిసి ఒకేసారి కాలేజీకి బయలుదేరేవాళ్లం. నేను క్లాసు వినడానికి. ఆయన క్లాసు చెప్పడానికి. సాయంత్రం నేను ఇల్లు చేరినా ఆయన ఎప్పుడో అర్ధరాత్రికి కానీ రాకపోవడం  చాలా బాధగా అనిపించేది. ఎదురుచూసి చూసి అలసిపోయేదాన్ని. ఆ తరువాత నాతో పాటు మా పిల్లలు కూడా వాళ్ళ నాన్న కోసం ఎదురుచూడటానికి అలవాటు పడిపోయారు.

     
ఇంటి బాధ్యతల్లో కోదండరాం గారి పాలెంత?

ఆయనకు ఇంటి విషయాలు పట్టించుకునే తీరికుండేది కాదు. కానీ పిల్లలన్నా, తోటపని అన్నా అమితమైన ఇష్టం. ఆయన పిల్లల్తో ఓ పది నిముషాలు గడిపితే ఇక ఆ రోజుకు నాన్న మమ్మల్ని విడిచి ఎక్కడికీ వెళ్ళరనుకునేంత భరోసా ఇచ్చేవారు. కానీ మరో పదినిముషాల్లో వాళ్ళని మాయచేసి ఇప్పుడే వస్తానని వెళ్లిపోయేవారు. అలా వెళ్ళినవారు ఏ మరునాడో తిరిగొచ్చేవారు.

     
కోదండరాం గారి ఆదర్శాలూ, అభ్యుదయ భావాలూ మీకేమనిపిస్తాయి?
వాటిని మెల్లిగా అర్థం చేసుకోగలిగాను. కానీ చిన్న చిన్న కోరికలుండేవి. కలిసి కాఫీ తాగడం లాంటివి. మా జీవి తంలో రోజులో కేవలం 15 నిముషాలు మాత్రమే మేమి ద్దరం కలిసి గడిపేది. ఆ పదిహేను నిముషాలూ మాక్కాకుండా పోయిన సందర్భాలనేకం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లు, గుళ్ళు, గోపురాలూ... ఇవన్నీ అటెండ్ అయ్యేది నేను, నా పిల్లలే. ఆయన కవేవీ నచ్చవు. రారు. అందరం కలిసి సరాదాగా వెళ్ళగలిగింది మా జీవితంలో ఒకే ఒక్క పండగకు. అదే పుస్తకాల పండగ. యేడాదికోసారి పెట్టే బుక్ ఎగ్జిబిషన్‌కి మా కుటుంబమంతా కదలి వెళుతుంది. పిల్లలకి పుస్తకాలు తప్ప మరో బహుమతి ఎప్పుడూ ఇచ్చేవారు కాదు. అందుకే వాళ్లిద్దరికీ బుక్ రీడింగ్ బాగా అలవాటయ్యింది.

 
తెలంగాణ ఉద్యమంలో మీ అనుభవాలేమిటి?

2005లో ఉస్మానియా యూనివర్సిటీలో హోలి పేరుతో తెలంగాణ కళాకారుల ప్రదర్శన జరిగింది. మొదటిసారి ఆయన అరెస్టు కావడం చూశాను. వాళ్ళని విడుదల చేయాలంటూ ఆ మరునాడు అసెంబ్లీని స్తంభింపజేశారు. ఆ రోజు నేను చాలా కంగారు పడ్డాను.  ఆయనకు సహనం ఎక్కువ. ఎదుటి వ్యక్తిలోని ఎంత కోపమైనా ఆయన సహనం ముందు బలాదూర్. అందుకే తెలంగాణ  ఉద్యమంలో వ్యక్తుల భావావేశం గురించి ఆందోళన చెందేవారు. ప్రతిక్షణం జాగ్రత్తపడేవారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడతారోనని చాలా తల్లడిల్లిపోయేవారు. ఫోన్ రావడం ఆలస్యం పరిగెత్తేవారు. అది ఏ వేళలో అయినా.  

     
ఉద్యమంలో మీరు ఇబ్బంది పడిన విషయమేదైనా వుందా?
తెలంగాణ ఉద్యమకాలంలో ఆయన ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటున్నారన్న విమర్శ వచ్చింది. నిజానికి ఒక పూటైనా విద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకున్నారాయన. కానీ ఈ విమర్శ తరువాత నాలుగేళ్ళపాటు ఒక్కపైసా వేతనం లేకుండా మేం గడిపాం. మా పిల్లలు మైత్రీ, చేతన్ ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. మా యిద్దరికీ కారు డీజిల్ ఖర్చు తప్ప పెద్దగా ఖర్చులేవీ ఉండవు. అలా గడిపేసాం.

 
ఉద్యమ సమయంలో మీరు ఉద్విగ్నతకు లోనైన సందర్భమేదైనా ఉందా?

తెలంగాణ ఉద్యమంలో సాగరహారం అప్పుడు అనిపించింది ఎప్పుడు ఆగుతుందిది అని. చలో అసెంబ్లీ అప్పుడనిపించింది యిక ఆగాలేమో అని. సడ క్ బంద్‌లో వీళ్ళు అరెస్టయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అంతా తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ఈయన ఇక్కడి జైలు సమస్యల గురించి మాట్లాడారు. ఎక్కడైనా సమస్యలపైనే ఆయన దృష్టి అంతా.

 
ఇంట్లో ఇది కావాలి అని సార్ ఎప్పుడైనా అడిగేవారా?

ఆయనకు తన చెప్పులు అరిగిపోయాయని కూడా  తెలియదు. బట్టలు చెప్పక్కర్లేదు. మట్టిగొట్టుకుపోయినా అదేం ఆయనకు పట్టదు. నేనే చూసి వాటిని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఆయన నన్నెప్పుడైనా కావాలని అడిగేది కేవలం స్టేషనరీయే. పేపర్లు పెన్నులు ఉంటే చాలు.  పిల్లల విషయంలో ఇది చేయమని, ఇది వద్దని ఆయనెప్పుడూ చెప్పలేదు. పిల్లలు కూడా చాలా ఇండిపెండెంట్‌గా పెరిగారు. 

     
కోదండరాం గారికి ఇష్టమైనవేవి?

మా మనవడు నిశాంత్. వాడితో ఫోన్లో మాట్లాడ్డం ఆయనకి సాంత్వన. మా పిల్లలు ఎప్పుడూ నాన్నా ఫొటో దిగుదాం అని అడిగేవారు. కానీ ఆయనెప్పుడూ మనం కాదు ఫొటోలు దిగాల్సింది. ప్రకృతిని ఫొటోలు తీయాలంటూ కెమెరా చేతిలో ఉంటే ఏ పిట్టనో, చెట్టునో, పువ్వునో క్లిక్‌మనిపించేవారు. ఫొటోలు వద్దంటూ వారించే నాన్నను ఇప్పుడు న్యూస్ పేపర్లవాళ్లు ఫొటోలు తీస్తున్నారంటూ మా పిల్లలు ఆటపట్టిస్తుంటారు. 

     
మీకు మ్యూజిక్ అంటే యిష్టం అన్నారు? ఇద్దరూ కలిసి మ్యూజిక్ వింటూంటారా?
పాటంటే నాకు ప్రాణం. మా అమ్మ శశికళ మంచి సింగర్. ఆయనకి కూడా పాత పాటలంటే ఇష్టం. కానీ పాట వినే లోపు ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు అనుకుంటారు.

     
కోదండరాం గారిలో మీకు నచ్చేది?

ఆయన నిబ్బరం, నిరాడంబరత, అందరినీ ఏకతాటి పైకి తేగల తెగువ, ఎవ్వరినైనా ఒప్పించగల సహనం, ఉద్యమాన్ని ఉరకలెత్తించే నాయకత్వ లక్షణాలూ అన్నీ నాకు నచ్చేవే. వాటిల్లో ఎక్కువ శాతం మా మామగారి నుంచి... అంటే వాళ్ళ నాన్న నుంచి ఆయనకు అబ్బినవే. నిజం చెప్పాలంటే ఆయన ఒక మేధావిగా, హక్కుల కార్యకర్తగా, నాయకుడిగా ఉండడమే నాకిష్టం. నా వ్యక్తిగత జీవితం, నా పిల్లలు ఆయన్ని మిస్సయి ఉండవచ్చు. కొంత నష్టపోయి ఉండవచ్చు. కానీ సమాజానికి ఎంతో చేయగల శక్తి ఆయనకుంది.

 
వంటగదితో కోదండరాం గారికి పరిచయం వుందా?

కిచిడీ, ఆమ్లెట్ ఇప్పటికీ ఆయన చేస్తేనే మా పిల్లలకిష్టం. ఆయనకి స్వీట్స్ అంటే అమితమైన ఇష్టం. ఇంట్లో వున్న కాస్త సమయంలోనే ఏదో స్వీట్ చేద్దామంటూ వంటగదికి వచ్చేస్తారు.

     
తెలంగాణ వచ్చాక ఇప్పుడేమనిపిస్తోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోదండరాం గారికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. ఆయన భార్యగా నేను చాలా లక్కీ. కోట్లాది మంది ఆకాంక్ష కోసం పోరాడిన వ్యక్తి సహచరిని నేనని చాలా ఆనందించాను. ఇప్పుడందరూ యింటికొచ్చి చాలా విషయాలు చెపుతుంటే ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తై ఇప్పుడు జరగాల్సింది చాలా ఉందనిపిస్తోంది. జీవితంలో మూడు ‘డి’ లు ఉంటే ఎవరైనా లక్ష్యాన్ని సాధిస్తారని నేనెక్కడో చదివాను. డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇవి వుంటే డెవెలప్‌మెంట్ సాధ్యం అవుతుంది. అది ఈయన విషయంలో అక్షరసత్యం.
- అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్

 

కోదండరాంరెడ్డిలోంచి రెడ్డి ఎందుకు తీసేసుకున్నారు?
కారంచేడు ఘటన తరువాత కులం పేరు తన పేరు చివరన ఉండడం సరికాదనుకున్నారు. కులం పేరుతో ప్రత్యేకంగా వచ్చే గుర్తింపు నాకక్కర్లేదని తీసేశారాయన.

 

కోదండరాం గారు బాగా  బాధపడిన సందర్భమేది?
జయశంకర్‌గారి మరణం ఆయన్ను బాగా బాధపెట్టింది.  తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడైన వ్యక్తి తెలంగాణని చూడకుండానే వెళ్ళిపోవడం

మరిన్ని వార్తలు