వనజ.. అనే నేను..!

30 Dec, 2018 00:06 IST|Sakshi

పంచాయతీ కార్యదర్శి

వెనుకబాటుతనం నుంచి పురోగతి దిశగాకట్టుబాట్లు, వెలివేత నుంచి సర్పంచ్‌ వరకుచదువు, కుటుంబ పోషణతో పాటు ప్రజాసేవపోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చాటుకుని ఉద్యోగంసంగారెడ్డికి చెందిన ఓ మహిళ ప్రస్థానం

వెనుకబాటు తనం.. బాల్య వివాహం.. సామాజిక వివక్ష.. కుటుంబ పోషణ.. మహిళా పురోగతికి అవరోధాలు. వీటన్నింటినీ అధిగమిస్తూ తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతోంది ఈ ముపై ్ప నాలుగేళ్ల వనిత. సామాజిక కార్యకర్తగా, సర్పంచ్‌గా పనిచేసి పలువురి మన్ననలు అందుకున్న మహిళ.. ఇటీవలి పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఓ వైపు భర్తకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతున్న సంగారెడ్డి జిల్లా కల్పగూరు గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్‌ తాలెల్మ వనజ సక్సెస్‌ అండ్‌ స్ట్రగుల్‌ సోరీ.. ఆమె మాటల్లోనే:‘‘మా నాయిన ఉపాధి కోసం పుల్కల్‌ మండలం ఇసోజిపేట నుంచి మంజీర డ్యాం కట్టే సమయంలో వలస వచ్చిండు. మేం మొత్తం నలుగురం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. డ్యాం నిర్మాణం పూర్తికావడంతో మా నాయిన గంగారాం ఇక్కడే డ్యాం దగ్గర చిన్న ఉద్యోగం సంపాదించిండు. మా బాల్యమంతా మంజీర డ్యాం పరిసరాల్లోనే సాగింది. పక్కనే ఉన్న కల్పగూరు స్కూళ్లో పదో తరగతి వరకు చదివిన.

స్కూల్లో చదువులో ముందున్నా.. తాగుడుకు బానిసైన మా నాయిన ఏ విషయాన్నీ పట్టించుకునే వాడు కాదు. పది తర్వాత దగ్గరలో ఉన్న సంగారెడ్డి బాలికల కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో చేరిన. చదువు ఆగిపోతుందనుకునే సమయంలో మా బాబాయి సంగారెడ్డిలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ బీఎస్సీ కోర్సులో చేర్పించిండు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే కల్పగూరుకు చెందిన జనార్దన్‌తో పెళై్లంది. పదో తరగతి చదివిన ఆయన హైదరాబాద్‌లో కుష్టు వ్యాధి నిర్మూలనకు సంబంధించిన లెప్రా సొసైటీలో చిరుద్యోగం చేసేవారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో గర్భవతిని కావడంతో కాలేజీకి వెళ్లలేక పోయా. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో చదువు అర్ధంతరంగా నిలిచిపోయింది. బాబు పుట్టడంతో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. లెప్రా సొసైటీ శాఖ సంగారెడ్డిలో ప్రారంభించడంతో అందులో నేనూ చేరి ఉద్యోగం చేయడం మొదలుపెట్టా. ఉద్యోగం చేస్తూనే.. తీరిక సమయాల్లో చదివి డిగ్రీ పూర్తి చేశా. ఆ వెనువెంటనే బీఈడీ ఎంట్రన్స్‌లో సీటు సాధించినా, మా నాన్న చనిపోవడంతో చేరలేకపోయా. మరుసటి ఏడాది పటాన్‌చెరులోని ఓ బీఈడీ కాలేజీలో చేరి పూర్తి చేశా. బోధన అనుభవం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఓ ప్రై వేటు స్కూల్‌లో టీచర్‌గా చేరా.

సర్పంచ్‌గా కొత్త బాధ్యత
ఓ వైపు ప్రై వేటు స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తూనే 2012 డీఎస్సీకి ప్రిపేరయ్యా. కేవలం అరమార్కు తేడాతో ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోయా. కొద్ది నెలలకే 2013లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మా గ్రామం కల్పగూరు సర్పంచ్‌ పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వు చేసింది. మాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. చదువుకున్న అమ్మాయి సర్పంచ్‌ అయితే బాగుంటుందని కొందరు గ్రామస్తులు నా భర్తను సంప్రదించారు. అయితే మా సామాజిక వర్గంలోనే కొందరు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తమ మాటను ధిక్కరించి పోటీ చేస్తే కుల బహిష్కరణ చేస్తామని తీర్మానం కూడా చేశారు. ఈ హెచ్చరికను సవాలుగా తీసుకుని పోటీలో దిగి గ్రామస్తుల మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందా. ఐదేళ్ల పదవీ కాలం నాకు అనేక విషయాలను నేర్పింది. గ్రామ పాలనకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు, మెటీరియల్, అధికారుల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి.

మొదట్లో గ్రామ సభల్లో కొంత తడబాటుకు గురైనా, నిబంధనలపై పట్టుచిక్కిన తర్వాత.. ఎవరితోనూ మాట పడకుండా పాలన సాగించా. భర్త చాటు భార్య అనే మచ్చ రాకుండా పనిచేయడంపైనే నా దృష్టి ఉండేది. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మహిళగా అక్కడక్కడా కొంత వివక్ష ఎదురైనా.. పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. ఐదేళ్ల కాలంలో గ్రామ పంచాయతీకి కొత్త భవనం సమకూర్చడంతో పాటు, దాదాపు గ్రామం అంతా సీసీ రోడ్లు నిర్మించాం. సర్పంచ్‌గా పనిచేసిన ఐదేళ్ల కాలంలో 2016 ఏప్రిల్‌లో జంషెడ్‌పూర్‌లో ప్రధాని మోడీ మొదలుకుని, మంత్రులు, కలెక్టర్లను కలిసే అవకాశం దక్కింది. దీంతో కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరికను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. సర్పంచ్‌గా పనిచేస్తున్న కాలంలో కొందరు ఉద్యోగుల పనితీరు అంత సంతృప్తిగా అనిపించేది కాదు.

ఉద్యోగం చేయడం కూడా ఓ రకమైన సేవ అనే అవగాహన ఏర్పడింది. దీంతో సర్పంచ్‌గా పనిచేస్తూనే, వ్యవసాయంలో నా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించా. సంగారెడ్డి అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌లో జరిగే పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో తదితర పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యా. ఇద్దరు బాబుల బాగోగులను చూసుకుంటూనే, వీలు చిక్కినప్పుడు స్టడీ మెటీరియల్‌ను తిరగేసేదాన్ని. ఈ ఏడాది ఆగస్టులో సర్పంచ్‌గా పదవీ కాలం పూర్తయినా, గ్రామస్తుల బాగోగుల్లో నా వంతు పాత్ర పోషిస్తూనే పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాశా. సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం పరీక్షలో ఉపయోగపడటం.. ఉద్యోగ సాధనలో కలిసి వచ్చింది. నా ప్రస్థానంలో ఇది ఒక అడుగు మాత్రమే అనుకుంటున్నా.. పీజీ చదువుతో పాటు గ్రూప్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలన్నదే నా సంకల్పం.. రాజ్యాంగం.. అంబేడ్కర్‌.. ఇవన్నీ బాల్యం నుంచి వింటున్నా.. పూర్తిగా అర్థమయ్యేది కాదు.. ఆయన ఇచ్చిన శక్తి ఏంటో.. తెలిసిన కొద్దీ ఉత్సాహం పెరుగుతోంది.

– కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి, సంగారెడ్డి
 

మరిన్ని వార్తలు