మడమల్లో నొప్పి... తగ్గేదెలా?

25 May, 2017 02:28 IST|Sakshi
మడమల్లో నొప్పి... తగ్గేదెలా?

నా వయసు 42 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఏదైనా సపోర్ట్‌ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను.  హోమియో పరిష్కారం చెప్పండి.  – సుధారాణి, కాకినాడ

అరికాలిలో ప్లాంటార్‌ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్‌ ఫేషియా డ్యామేజ్‌ అవుతుంది.

ఫలితంగా అరికాలిలో నొప్పి, మడమ నొప్పి, వాపు  కనిపిస్తాయి. ఉదయం పూట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి వస్తుంది. ఇలా ప్లాంటార్‌ ఫేషియా డ్యామేజ్‌ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్‌ ఫేషిౖయెటిస్‌ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది.

కారణాలు: ∙డయాబెటిస్‌ ∙ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం ∙తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ∙ఎక్కువగా హైహీల్స్‌ చెప్పులు వాడటం (మహిళల్లో).
లక్షణాలు: ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ∙ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం ∙కండరాల నొప్పులు
చికిత్స: మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

– డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు