యంగ్ ఎటాక్

28 Sep, 2016 23:15 IST|Sakshi
యంగ్ ఎటాక్

నేడు వరల్డ్ హర్ట్ డే
హార్ట్ ఎటాక్స్ గురించి విన్నాం. నడి వయసులో వస్తుందని జాగ్రత్త పడతాం. హై కొలెస్ట్రాల్, హై బీపీ, హై షుగర్, హై స్ట్రెస్... వంటివి ఈ హార్ట్ ఎటాక్స్‌కి గట్టిగా ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నాం. పురుషుల్లో ఎక్కువ, మహిళల్లో ఒక వయసు వరకు కాస్త తక్కువ అని చదివాం. కానీ ఇప్పుడు చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి! యంగ్‌గా ఉన్నప్పుడే ప్రాణాలు తీస్తున్నాయి. ఆలస్యం చేయకుండా లైఫ్‌స్టైల్‌లో మార్పులు తెచ్చుకోగలిగితే ఈ యంగ్ ఎటాక్స్‌ను నివారించుకోవచ్చు.

ఒక 23 ఏళ్ల విద్యార్థి ఎమర్జెన్సీ విభాగానికి ఛాతీలో నొప్పి అంటూ వచ్చాడు. అతడిని చూసిన ఎమర్జెన్సీలోని ఫిజీషియన్స్ తొలుత దాన్ని సాధారణ ఛాతీ నొప్పిగానే భావించారు. ఎమర్జెన్సీకి ఛాతీ నొిప్పి అంటూ వచ్చిన వారికి ఈసీజీ తీసి పరీక్షించడం ఒక నియమం. డాక్టర్లనే అబ్బురానికి గురిచేస్తూ ఆ ఈసీజీలో గుండెపోటు వచ్చిన సూచనలు కనిపించాయి. అంతే... మరికొన్ని పరీక్షలు చేశారు. దాంతో అది గుండెపోటు అని స్పష్టంగా తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అతడికి డయాబెటిస్, హైబీపీ, హైకొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలేవీ లేవు. ఆ కుర్రవాడితో మాట్లాడాక తెలిసిన విషయం ఏమిటంటే... అతడి రూమ్మేట్స్ విపరీతంగా పొగతాగుతుంటారు. ఆ పొగ (పాసివ్ స్మోకింగ్) ఇతడి మీద ప్రభావం చూపింది!

ఒకప్పుడు... అంటే 1960లకు పూర్వం... రక్తనాళాలకు సంబంధించిన గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజ్) 40 ఏళ్లలోపు వారిలో కనిపించడం చాలా అరుదు. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. ధమనులు అనే ఈ రక్తనాళాలే గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఈ ధమనులు సన్నబడి, రక్తం సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. ఇలాంటప్పుడు ఛాతీలో నొప్పి రావచ్చు.

ఈ కండిషన్‌ను యాంజినా పెక్టోరిస్ అంటారు. తగినంత  రక్తసరఫరా జరగని సందర్భాల్లో గుండె కండరాలు చచ్చుపడిపోవడం ప్రారంభమవుతుంది. దాన్నే సాధారణంగా హార్ట్ ఎటాక్ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ (ఏఎమ్‌ఐ) అంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. ఈ 21వ శతాబ్దంలో కరొనరీ ఆర్టరీ డిసీజ్ బారిన పడే యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు దీన్ని ఆధునిక జీవనశైలి (నాగరికత) తీసుకువచ్చిన వ్యాధిగా చెప్పవచ్చు.

మన దేశంలో గుండెపోటు అవకాశాలెక్కువ
మిగతా పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే మన దేశవాసుల్లో కరొనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా ఇటీవల చిన్నవయసు వారిలోనే ఇది కనిపిస్తోంది. ఈ జబ్బు వచ్చిన అతి చిన్న వయసు వారిలో ఓ 14 ఏళ్ల చిన్నారి కూడా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. ఇక వయసు పెరుగుతుండటం ఈ జబ్బుకు ఒక రిస్క్ ఫ్యాక్టర్.

స్థూలకాయమూ ఎక్కువే!
పాశ్చాత్య దేశాలలో వచ్చే స్థూలకాయంతో పోలిస్తే మన దేశవాసుల్లో వచ్చే స్థూలకాయం కాస్తంత విభిన్నంగా ఉంటుంది. మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. అధిక శాతం కొవ్వు నడుము వద్ద పెరగడం వల్ల ఇది కనిపిస్తుంది. దీన్నే ఆపిల్ షేప్‌డ్ ఊబకాయం అంటారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను మన పొట్ట దగ్గర్నుంచి మన కాలేయానికి నేరుగా రవాణా జరిగేలా చూస్తుంది. ఫలితంగా కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఇలా కాలేయంలో కొవ్వు చేరడాన్ని ‘ఫ్యాటీ లివర్’గా పిలుస్తుంటారు.

ఇక యువతలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం కూడా గుండెపోటుకు దోహదం చేసే అంశాలలో ఒకటి. డయాబెటిస్ లేనివారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. గుండె రక్తనాళాల్లో / ధమనుల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశాలు డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో ఎక్కువ. అంతేకాదు... ఇలాంటివారికి కాళ్లు, మెదడులోని రక్తనాళల్లోనూ క్లాట్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఎక్కువవుతోంది. సమోసా, శ్నాక్స్‌లో ఇప్పుడు ఉప్పు ఎక్కువగా ఉంటోంది. దాంతోపాటు కొవ్వులు (ట్రాన్స్‌ఫ్యాట్స్) సైతం పెరుగుతున్నాయి. దీని వల్ల కూడా రక్తనాళాల్లో కొవ్వులు చేరి రక్తనాళాలను సన్నగా అయ్యేలా చేస్తున్నాయి. ఇది కూడా యువతలో గుండెపోటు పెరగడానికి ఒక ప్రధాన కారణం.

మన యువతలో వ్యాయామం లేకపోవడం అన్నది పాఠశాల, కాలేజీ స్థాయిలోనే ప్రారంభమవుతోంది. మన విద్యావ్యవస్థలో వ్యాయామం కంటే చదువుల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇక జిమ్‌లకు హాజరయ్యే యువత కూడా తమ కండరాలకు వ్యాయామం కల్పించడం కంటే కండరాల నిర్మాణం పైనే ఎక్కువగా దృష్టి నిలుపుతున్నారు కానీ ఏరోబిక్స్ శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం లేదు. ఇప్పుడు యువత కనీసం రోజులో 30 - 60 నిమిషాలు వ్యాయామం చేయడం అవసరం. కానీ సమయం సరిపోవడం లేదనే సాకు మన దేశంలో చాలా ఎక్కువే. అధికశాతం యువకులు గుండెపోటు బారిన పడుతుండటానికీ ఇదీ ఒక ప్రధాన కారణమే.

పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులలో రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణభారతీయుల్లో ఇవి మరీ సన్నగా ఉంటాయి. వీరికి మిగతావారితో పోలిస్తే గుండెపోటు రావడానికి కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా ఒక కారణం. దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుండెపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీ అన్నదే ప్రధాన కారణం.

కొన్ని వృత్తుల్లో ఎక్కువ పనిగంటలు, రాత్రుళ్లు సైతం పనిచేయాల్సి రావడం వల్ల చాలా ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

గుండెపోటు వల్ల కలిగే మరణాలు కేవలం ఆ కుటుంబపైనే కాకుండా సమాజం, దేశంపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే వాటిని నివారించడానికి అన్ని వైపుల నుంచి సమష్టిగా, సమీకృతంగా కృషి జరగాలి.

లక్షణాలు
సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండెపోటు కనిపిస్తుంది.  ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పికి.. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణం అని భావిస్తుంటారు.  వైద్య నిపుణులలో సైతం ఈ వయసు వారిలో బహుశా అది కరొనరీ ఆర్టరీ వ్యాధి వల్ల కావచ్చని చాలా తక్కువ మంది భావిస్తారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.

కారణాలు
సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్క్లిరోసిస్ అని వ్యవహరిస్తుంటారు. ఈ అథెరో స్క్లిరోసిస్ ప్రక్రియ మొదలైన ఏడాది వ్యవధిలోనే గుండెపోటు కనిపించవచ్చు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. అయితే ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 25 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారగడం కనిపిస్తోంది.

కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లేక్స్’గా వ్యవహరిస్తుంటారు. ఈ ప్లేక్స్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు / రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లేక్స్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు)గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.

యువతలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం, ఆల్కహాల్ అలవాటు గుండెపోటుకు ఒక కారణం. ఈ అలవాట్ల వల్ల అథెరో స్క్లిరోసిస్ చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది.

పొగతాగడం అథెరోస్క్లిరోసిస్‌కూ... తద్వారా గుండెపోటుకు మరో ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. 

జెండర్ అంశం కూడా గుండెపోటుకు ఒక ప్రధాన కారణం. మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగిపోయే వరకు  మహిళల్లో కనిపించే ఈస్ట్రోజెజ్ మహిళలకు ఒక రక్షణ కవచం. పురుషులు, మహిళలైన యువ రోగుల్లో గుండెపోటు నిష్పత్తిని పరిశీలిస్తే అది 20 : 1 గా ఉంటుంది. కానీ రుతుక్రమం ఆగిపోయాక మహిళలకూ గుండెపోటు అవకాశాలు సమానంగా ఉంటాయి.

మారుతున్న ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకుంటే ఆహారంలో గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం, కీడు చేసే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్), చెడు కొవ్వులైన ట్లైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం అన్నది కూడా యువతలో గుండెపోటు పెరగడానికి దోహదం చేసే అంశాల్లో ప్రధానమైనదే.

పొట్ట దగ్గర కొవ్వు పెరగడం (సెంట్రల్ ఒబేసిటీ), ఒత్తిడి (స్ట్రెస్)తో కూడిన ఆధునిక జీవనశైలి కూడా గుండెపోటును పెంచేవే.

అధిక రక్తపోటు (హైబీపీ) కూడా గుండెపోటుకు దోహదం చేస్తుంది.

మరిన్ని వార్తలు