Heart Attack Risk: కోవిడ్‌ ఎఫెక్ట్‌తో గుండెపోటు మరణాలు!.. ఈ ట్యాబ్లెట్‌తో రిస్క్‌కి చెక్‌ పెట్టొచ్చు

6 Nov, 2023 12:04 IST|Sakshi

ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు 50దాటిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ కోవిడ్‌ ఎఫెక్ట్‌తో  కొంతకాలంగా దేశంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ చైనీస్‌ మెడిసిన్‌తో గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరి ఏంటా మెడిసిన్‌? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన ఘటనలు చూస్తున్నాం. డ్యాన్స్‌ చేస్తూనో, జిమ్‌ చేస్తూనో అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మొదటిసారి హార్ట్‌ ఎటాక్‌ వచ్చినవారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. స్టెమీ(ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ STEMI)లాంటి తీవ్రమైన గుండెపోటు అటాక్‌ అయినప్పుడు ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంటుంది. గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

కోవిడ్‌ అనంతరం గుండెపోటు కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనికి తగ్గ కారణాలు, ఓషధాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో Tongxinluo అనే సాంప్రదాయ చైనీస్‌ మెడిసిన్‌ ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఈ మెడిసిన్‌ ప్రభావం సుమారు ఏడాది పాటు ఉంటుందని సైంటిస్టులు తెలియజేశారు. చైనాలో హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చిన రోగులకు అందించే చికిత్సలో ఈ మెడిసిన్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇది ప్రధానంగా జిన్సెంగ్, జలగ, తేలు, సికాడా, సెంటిపెడ్, బొద్దింక, గంధం సహా పలు సహజసిద్ధ మూలికలతో తయారు చేసిన ఓ సాంప్రదాయ ఔషధం. టెక్సాస్‌లోని UT సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌లో 3,777 మందిపై ఏడాదిపాటు జరిపిన పరిశోధనల్లో Tongxinluo మెడిసిన్‌ ఊహించని ప్రయోజనాలను నమోదు చేసిందని సైంటిస్టులు గుర్తించారు.

Tongxinluo తీసుకోనివారితో పోలిస్తే, తీసుకున్నవారిలో హార్ట్‌ రిస్క్‌ 30% తక్కువగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ మెడిసిన్‌ వాడిన ఏడాది వరకు దాని ప్రయోజనాలు ఉన్నట్లు, దీనివల్ల 25% కార్డియాక్ డెత్ ప్రమాదం తగ్గిందని సైంటిస్టులు పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. 

మరిన్ని వార్తలు