రైతువాది

5 Nov, 2018 01:09 IST|Sakshi

రచనారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్‌

టెన్నిస్‌ అంటే ఇష్టం.. స్విమ్మింగ్‌ హాబీ.. రన్నింగ్‌ డైలీ రొటీన్‌... యోగా స్ట్రెస్‌ బస్టర్‌... ఇవన్నీ రచనారెడ్డి డే స్టార్టర్స్‌. మానవహక్కుల పోరాటం... రైతుల భూమికి న్యాయసహాయం... మహిళలకు న్యాయసేవ.. ఇవీ, సామాజిక న్యాయ సాధన కోసం ఆమె ఎంచుకున్న మార్గాలు. అన్నం పెట్టిన నేలతల్లిని వదల్లేక.. ప్రభుత్వంతో పోరాడలేక కన్నీళ్ల పర్యంతమవుతున్న రైతుల పక్షాన నిలిచారామె. 9న ‘వరల్డ్‌ లీగల్‌ సర్వీసెస్‌ డే’ సందర్భంగా.. ఆమె పరిచయం ఇది.


రచన పుట్టింది హైదరాబాద్‌లో. సొంతూరు కామారెడ్డి (నిజామాబాద్‌) జిల్లా, నాగిరెడ్డిపేట గ్రామం. ‘‘నాలుగేళ్ల వరకు నాగిరెడ్డిపేటలోనే పెరిగాను. స్కూల్లో చేరడానికి మళ్లీ హైదరాబాద్‌కి తీసుకొచ్చి, వెస్ట్‌ మారేడ్‌పల్లిలో సెయింట్‌ ఆన్స్‌ గాళ్స్‌ స్కూల్లో చేర్చారు అమ్మానాన్న. నాన్న బొల్లు నర్సింహా రెడ్డి సోషల్‌సైన్సెస్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన రైతు. అమ్మ ఇందిర గృహిణి. ఆమె సెయింట్‌ ఆన్స్‌ స్టూడెంట్‌. ఇద్దరూ చదువుకున్న వాళ్లు, సొసైటీ పట్ల అవగాహనతో విశాలమైన దృక్పథం ఉన్న వాళ్లు కావడంతో నాకు మంచి దారి ఏర్పడింది. ఆ రకంగా నేను బ్లెస్‌డ్‌ చైల్డ్‌ని అనే చెప్పాలి’’ అంటారు రచన.

రచన కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌లో. ఆ తర్వాత పూనాలోని ఇండియన్‌ లా సొసైటీస్‌ లా కాలేజ్‌ (ఐఎల్‌ఎస్‌ లా కాలేజ్‌)లో న్యాయశాస్త్రం చదవడం ఆమె కెరీర్‌కి ఒక డైరెక్షన్‌ని ఇచ్చింది. ఆ కాలేజ్‌లో చదివిన వారిలో సుప్రీంకోర్టు జడ్జిలు చాలా మందే ఉన్నారు. ‘‘మాస్టర్స్‌ కోర్సుకి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌లో సీటు తెచ్చుకోగలిగానంటే ప్రతిష్ఠాత్మకమైన పూనా విద్యాసంస్థలో చదవడం వల్లనే’’ అంటారు రచన.

అక్కడ అంతర్జాతీయ మానవహక్కులు, అంతర్జాతీయ చట్టాల మీద ఎక్కువ వర్క్‌ చేశారు.  ఇంటర్నేషనల్‌ లా క్లాసులు తీసుకోవడం కూడా ఆమెకో టర్నింగ్‌ పాయింట్‌. కాలిఫోర్నియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ లా ఫోరమ్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా చేయడం.. ఇండియాకు వచ్చేటప్పుడు కెరీర్‌ ప్లానింగ్‌లో ఓ భరోసానిచ్చింది. నల్సార్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఆహ్వానం వచ్చింది. అక్కడ మూడేళ్ల పాటు పాఠాలు చెప్పిన తర్వాత హైకోర్టులో అడుగుపెట్టారామె.  భూమి హక్కుల కోసం న్యాయపోరాటం ఆమె స్పెషలైజేషన్‌గా మారిపోయింది. పేపర్‌లకు, లీగల్‌ జర్నల్స్‌కి వ్యాసాలు రాయడం అమెరికాలో ఉండగానే వ్యాపకంగా మారింది.

ఇదా లోకం?!
లా కోర్సులో చదివేటప్పుడు నేర్చుకున్న దానికంటే.. ఆచరణలో నేర్చుకునేదే చాలా ఎక్కువ. ఆ విషయమే చెబుతూ.. ‘‘నా పాతికేళ్ల వయసులో అమెరికాలో అంతర్జాతీయ మానవహక్కులు, అంతర్జాతీయ చట్టాల మీద అధ్యయనం చేసేటప్పుడు ఒక్కో కేసు ఒక్కో పాఠం అయింది. ఇథియోపియా, జాంబియా, సోమాలియా దేశాల నుంచి పారిపోయి వచ్చే మహిళల కేసులు కొల్లలుగా ఉండేవి.

వారంతా జెనిటికల్‌ మ్యుటేషన్‌కు భయపడి పారిపోయి వచ్చినవాళ్లు! కొలంబియా నుంచి డ్రగ్‌ విష వలయంలో చిక్కుకున్న వాళ్లు, శ్రీలంక, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్‌ వంటి దేశాల నుంచి రాజకీయ కల్లోలాల కారణంగా ఎదురయ్యే హింసకు భయపడి పారిపోయే వాళ్లు, చైనా నుంచి రెండవసారి గర్భం దాల్చిన వాళ్లు (ఒక కుటుంబానికి ఒకే బిడ్డ చట్టం ఉన్న రోజుల్లో), నార్త్‌ కొరియా నుంచి ఆకలి బాధలు తట్టుకోలేక పారిపోయి వచ్చేవాళ్లు ఎక్కువ

. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. తమ దేశాల నుంచి ఒక్క ధృవీకరణ పత్రమూ ఉండదు, అమెరికా రావడానికి అనుమతి పత్రమూ ఉండదు. ఎటువంటి డాక్యుమెంట్‌లూ లేకుండా.. రైళ్లు, పడవలు ఏదో ఒక దొరికిన రవాణా సాధనంలో అమెరికాకి చేరుకుంటారు. ఇలాంటి కేసుల్లో గ్వాటిమెలా మహిళ ఉదంతం నన్ను బాగా కలచి వేసింది. ఆమె భర్త ఆ దేశంలో పెద్ద పొజిషన్‌లో ఉన్న లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌.

అతడు ఆమెను శారీరకంగా, మానసికంగా భయంకరంగా వేధించేవాడు. ఆమె భర్త బారి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఆ దేశం నుంచే పారిపోయి వచ్చింది. అమెరికాలో తలదాచుకున్నప్పటికీ అతడు ఆమెను వదల్లేదు. ఆమె వివరాలను సేకరిస్తూ వేధింపు కొనసాగించాడు. అంతటి కష్టాల్లో ఉన్న వాళ్లకు అండగా నిలబడే ప్రొఫెషన్‌ కావడంతో ఇందులో సంతోషం ఉంటుంది’’ అన్నారు రచన.

రైతు బిడ్డని
రైతు కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో రచన పేరును ప్రస్తావించారు. ఆ  విషయాన్ని గుర్తు చేసినప్పుడు.. ‘‘అన్ని రకాల కేసులనూ చేస్తున్నప్పటికీ రైతు బిడ్డను కావడంతోనో ఏమో భూమిని కోల్పోయిన రైతు బాధ వింటుంటేనే తీరని ఆవేదన కలిగేది. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేయడంతో బాధిత రైతులు న్యాయసహాయం కోసం వచ్చినప్పుడు జీవోఎంఎస్‌ 123ని ప్రశ్నిస్తూ కేసు వేశాం.

క్రయవిక్రయాల్లో విక్రయించే వ్యక్తి ఇష్టపూర్వకంగా అమ్ముతున్నారా లేక ఏదైనా ఒత్తిడి కారణంగా ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో అమ్ముతున్నారా అనేది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ కొంటున్నది ప్రభుత్వం కావడంతో, అమ్మక తప్పని విధంగా ఒత్తిడి చేస్తుండడంతో రైతులు ఆవేదనను మనసులో దాచుకుని, కన్నీళ్లను దిగమింగుకుని సంతకాలు చేయాల్సి వస్తోంది. ‘ఇష్టపూర్వకంగానే విక్రయిస్తున్నాను’ అనే మాట అనడానికి గొంతు పెగలక మౌనంగా తలూపితే దానినే ఆమోదంగా నమోదు చేసి పని కానిచ్చేస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో నా చదువుని రైతుల పక్షాన పోరాడడానికి వినియోగించకుండా ఉండగలనా?’’ అని తిరిగి ప్రశ్నించారు రచన.

అస్తిత్వ పోరాటం
మహిళలకు కొన్ని తరాలుగా కనిపించని అడ్డుగోడగా ఉన్న గ్లాస్‌ సీలింగ్‌ని బ్రేక్‌ చేయగలుగుతున్నారిప్పుడు. ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రొఫెషన్‌లో రాణిస్తున్న వైనం ఇది. అలాగని మహిళలకు ఫ్రీ హ్యాండ్‌ ఉందని కాదు. ప్రతి దశలోనూ తనను తాను నిరూపించుకుంటూనే ముందుకుసాగాలి. భర్త, అత్తమామలు, అమ్మానాన్నలకు సమాధానం చెప్పుకోవాల్సిందే. మగవాళ్లకు ఆ దుస్థితి ఉండదు. ఒకవేళ అతడు తన ఉద్యోగంలో వెనుకబడినా, వ్యాపారంలో నష్టపోయినా సమాజం అతడిని తప్పు పట్టదు. పైగా జీవితంలో ఒడిదొడుకులుంటాయని సపోర్టుగా నిలుస్తుంది కూడా.

అదే స్త్రీ విషయానికి వచ్చే సరికి... ఆమె వ్యాపారంలో చిన్న పొరపాటు జరిగినా, ఉద్యోగంలో ఒకడుగు వెనుకబడినా ఆమెకు ఎవరి నుంచి ఎటువంటి మాట వంతు ధైర్యం చెప్పే వారుండరు. వెంటనే... ‘ఇంట్లో కూర్చోక ఇవన్నీ అవసరమా’ అని ఆమె చుట్టూ ఉన్న వాళ్లే అంటారు. ఆమె అస్తిత్వ పోరాటం చేస్తూనే ఉంది. ప్రకృతి ఆమెకి సొంత అస్తిత్వాన్నిచ్చింది. ఆ అస్తిత్వాన్ని గుర్తించడానికి సమాజానికి మనసొప్పడం లేదు. ‘‘అయితే ఇది మన దేశంలో మాత్రమే కాదు, దాదాపుగా ప్రపంచం అంతా ఇలాగే ఉంది.

తేడా అంతా... తమ సమస్యలను భారతీయ మహిళలు ఎదుర్కొనే పద్ధతికి, బయటి దేశాల మహిళలు ఎదుర్కొనే పద్ధతికి మధ్యనే ఉంటోంది. మన మహిళల్లో సహనం, సహించే గుణం, సహించగలిగినస్థాయులు ఎక్కువ. చాలా దేశాల్లో అది కనిపించదు. తమ సంతోషాన్ని హరించే ఏ పరిస్థితినీ భరించరు. చాలా దేశాల్లో మహిళలకు రాజకీయ హక్కులు, రాజకీయరంగంలో పాల్గొనే హక్కులు, అవకాశాలు మనకంటే పుష్కలంగా ఉన్నాయి.

అయినా మహిళ ఎదుర్కొనే ఇబ్బందుల గురించి చర్చ పెడితే మన దగ్గరకంటే ఏ మాత్రం తగ్గవు. మహిళలు ఆర్థికంగా భర్త మీద ఆధారపడే పరిస్థితులు మాత్రం మనదేశంలోనే ఎక్కువ. ఆర్థిక స్వావలంబన మనిషిలో ధైర్యాన్ని పెంచుతుంది. మిడిల్‌ క్లాస్‌ ఫ్యాక్టర్స్‌ ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఆర్థిక స్థిరత్వం ఉన్న మహిళలు కూడా సామాజిక సమీకరణల కారణంగా ఇబ్బందులను భరిస్తూనే ఉన్నారు. ఈ భరించే తత్వం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది’’ అన్నారామె.

సరిదిద్దే ప్రయత్నం.. మీటూ
లైంగిక వేధింపుల మీద సాగుతున్న మీటూ పోరాటం.. మహిళలకు ఎదురవుతున్న వేధింపుల తీవ్రతకు ప్రతీక. ఈ ఉద్యమం మీద స్పందిస్తూ... ‘‘ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ను తెలియచేయడం వరకు తప్పనలేం, కానీ పవర్‌ను అడ్డుపెట్టుకుని మహిళల మీద ఒత్తిడి తేవడం, వేధింపులకు దిగజారడాన్ని సహించకూడదు. ప్రతి బాధితురాలూ తప్పనిసరిగా తనకు ఎదురైన ప్రతికూల సందర్భాన్ని బయటపెట్టాలి. మగవాళ్లు కూడా మీటూని తమకు వ్యతిరేకంగా, తమ మీద జరుగుతున్న పోరాటం అని భావించాల్సిన పని లేదు.

సమాజంలో వేళ్లూనుకుని ఉన్న ఒక తప్పును సరిదిద్దే ప్రయత్నం ఇది. ఇందులో మహిళలు తమవంతు భాగస్వామ్యాన్ని ఇవ్వాలి. పని చేసే ప్రదేశంలో మహిళల మీద సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ మగవాళ్లు ఆడుతున్న పవర్‌గేమ్‌. ఇలాంటి వాటన్నింటినీ ఛేదించుకుంటూనే ఇంత వరకు వచ్చారు మహిళలు. వల్నరబుల్‌ కండిషన్‌లో ఎదురీదుతూ ఇంత వరకు వచ్చిన మహిళలను గౌరవించాల్సిన సమయమిది. అలాగే గృహిణులు మీటూ ఉద్యమం నుంచి తమను తాము వేరు చేసుకుని చూడడం సమర్థనీయం కానేకాదు.

తమ ఇంట్లో మర్యాదస్థులుగా ఉండే మగవాళ్లలో ఇల్లు దాటగానే ఇలాంటి కోణం బయటపడుతోందా అని కూడా ఆలోచించాలి. మనదేశంలో మహిళలు ఇప్పటికీ తమ జీవితం భర్త చేతుల్లో ఉందనే అనుకుంటారు. బయటి దేశాల్లో మహిళలు తమ జీవితం తమ చేతుల్లో ఉందనుకుంటారు, ఈ తేడా ప్రతి చోటా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. మహిళల్లో తమ హక్కుల గురించిన అవగాహన పెరగాలి. న్యాయసేవ గురించిన చైతన్యం లేకపోవడం వల్ల ఎమోషనల్‌గా వీక్‌ మూమెంట్‌లో కేసులంటూ వెళ్లడం, ఎవరు ఎలా డైరెక్షన్‌ ఇస్తే అలా ముందుకుపోవడం జరుగుతోంది. దాంతో ఎదురయ్యే ప్రతికూలాంశాలకు తిరిగి ఆ మహిళలే బాధ్యులు కావల్సి వస్తోంది’’ అని ఆవేదన చెందారు రచన.

న్యాయవ్యవస్థ అండ
లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని ఎండగట్టాల్సిందే. ఈ దౌష్ట్యాన్ని నివారించడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ భర్త నుంచి ప్రియారమణికి (ఎం.కె.అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన జర్నలిస్టు) ఉన్నంత అండ ఉండవచ్చు ఉండకపోవచ్చు. ‘‘అయితే తన కోసం ఎవరో ఒకరు వచ్చి, అండగా నిలుస్తారని చూస్తూ ఉండడం కంటే, పర్యవసానాలు ఎలా ఉన్నా సరే తొలి అడుగును వేయడమే కరెక్ట్‌. ఎటువంటి పర్యవసానమైనా సరే, అది మహిళల తెలివితేటలు, పట్టుదలకు మించినవి కాలేదు.

సమాజాన్ని సెన్సిటైజ్‌ చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉన్న పరిస్థితి ఇది. ధైర్యం చేయాల్సిందే. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా మహిళల మనోధైర్యాన్ని పెంచేదిగా ఉంది. మహిళ అస్తిత్వ పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో ఈ తీర్పు రావడం అంటే... న్యాయవ్యవస్థ మహిళలకు అండగా ఉందని చెప్పడానికి నిదర్శనం. అది 1997 నాటి పంకజ్‌ చౌదరి, గుంజేశ్, మరో ఇద్దరు స్నేహితులు ఒక మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసు.

సదరు మహిళ నైతిక వర్తన మీద బురద జల్లుతూ అలాంటి మహిళ విషయంలో జరిగిన రేప్‌ను నేరంగా పరిగణించరాదని వాదించారు వాళ్లు. జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలు ‘నో అంటే నో, ఆమె శీలవర్తనల విశ్లేషణలకు తావే లేదు’ అని, ముద్దాయిలకు ఒక్కొక్కరికి పదేళ్లు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు’’ అని గుర్తుచేశారు రచన.

ఇది మా నైతిక విధి
ప్రతి న్యాయవాది కూడా తప్పనిసరిగా ఎథికల్‌ డ్యూటీ చేయాలని చెబుతుంది న్యాయశాస్త్రం. న్యాయపోరాటం చేయడానికి ఆర్థిక స్థోమత లేని వాళ్ల కేసులను వాదించాల్సిన బాధ్యత ప్రతి న్యాయవాది మీదా ఉంది. ఇది పూర్తిగా సేవాదృక్పథంతో నిర్వర్తించాల్సిన బాధ్యత. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఏర్పాటు కూడా ఇందు కోసమే. ఇందులో లాయర్లు వాలంటరీగా సర్వీస్‌ ఇస్తారు. కొందరు ఈ కేసులు ఎక్కువ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు, అంతే తప్ప అసలే చేయకుండా ఉండకూడదు. సామాన్యుల్లో చైతన్యం తీసుకురావడానికి సదస్సులు నిర్వహిస్తుంది న్యాయవ్యవస్థ.

కానీ వీటికి ప్రచారం తగినంతగా ఉండడం లేదు. వైద్యరంగానికి ఉన్నంత విస్తృత ప్రచారం ఉండాలి. మనిషికి వైద్య సేవ ఎంత అవసరమో, న్యాయసేవ కూడా అంతే అవసరం. లాయర్‌గా సమాజానికి నేను చేయాల్సిన సేవ చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇక కుటుంబం విషయానికి వస్తే నా భర్త రాహుల్‌ యర్రంరెడ్డి కూడా లాయరే. నా కొడుకు రేయాన్ష్‌కి నిద్రపోయే ముందు ప్రతిరోజూ కనీసం రెండు కథలైనా చెప్పాలి. తల్లిగా నాకు అవి హ్యాపీయెస్ట్‌ మూమెంట్స్‌. అప్పుడు నాకు నేను బ్లెస్‌డ్‌ అని మళ్లీ మళ్లీ అనిపిస్తుంది.

వైద్యం– న్యాయం
మనదేశంలో తమకు ఎంత అన్యాయం జరుగుతున్నా సరే న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సంశయిస్తారు. సమాజానికి– న్యాయవ్యవస్థకు మధ్య కనిపించని దూరం కరడు గట్టి ఉంది. సమాజంలో మారుతున్న అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ చట్టాల్లో సవరణలు చేసుకుంటోంది.

కానీ చట్టాలు ఎంత హ్యూమన్‌ ఫ్రెండ్లీగా మారుతున్నాయనే చైతన్యం సమాజంలో కొరవడుతోంది. నిజానికి మనిషి సంతోషంగా జీవించడానికి వైద్యరంగంతోపాటు న్యాయవ్యవస్థ కూడా ప్రధానమే. సకాలంలో వైద్య సేవలు అందకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది, సమయానికి న్యాయసహాయం అందకపోతే జీవిక ప్రమాదంలో పడుతుంది.

మరిన్ని వార్తలు