కాంగ్రెస్‌ సేనలోకి ‘పారాచూట్‌’ దళం! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సేనలోకి ‘పారాచూట్‌’ దళం!

Published Mon, Nov 5 2018 1:11 AM

Congress Gives Tickets To Other Party Leader - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ‘పారాచూట్‌’ దళాన్ని బరిలోకి దింపనుంది! అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఇప్పటికే టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలసి కూటమి కట్టిన హస్తం పార్టీ... ఇతర పార్టీల్లోంచి ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నుంచి తమ పార్టీలో చివరి నిమిషంలో చేరిన నేతలకు (పారాచూట్‌ నాయకులు) టికెట్లు ఇవ్వనుంది!! పార్టీ స్క్రీనింగ్‌ కమిటీలో చర్చించ కుండానే ‘పారాచూట్‌’ నేతల పేర్లు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు టీ పీసీసీ పెద్దలు చక్రం తిప్పినట్లు సమాచారం. దీంతో కనీసం 8–10 మంది ‘పారాచూట్‌’ నేతలకు టికెట్లు ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ పరిణామం మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ల ప్రకటన తర్వాత ఈ అంశం కాంగ్రెస్‌ను భారీ కుదుపు కుదిపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

పలు చోట్ల కొత్త నేతలకు అందలం?
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీసీ నేతకు టికెట్‌ ఇవ్వాలంటూ కీలక నేత ఒకరు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఎదుట వాదించారు. అయితే పార్టీ చేయించిన సర్వేలో గెలుపు అవకాశాలున్న నేతలు, పార్టీలో ఉండి టికెట్ల కోసం పోటీ పడుతున్న నేతలను కాదని కొత్తగా తెరపైకి వచ్చిన టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అల్లుడికి టికెట్‌ కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది. అలాగే వరంగల్‌ జిల్లాలోని ఈస్ట్‌ ఎమ్మెల్యే టికెట్‌ విషయంలోనూ ‘పారాచూట్‌’నేతకే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లోని ఓ నాయకుడిని కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్‌ కేటాయిస్తున్నారన్న వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.

మరోవైపు మెదక్‌లోని దుబ్బాక సెగ్మెంట్‌లో మాజీ మంత్రికి లేదా మరో నాయకుడికి పోటీ చేసే అవకాశం వస్తుందని కేడర్‌ భావిస్తున్న సమయంలో ఇటీవలే పార్టీలో చేరిన మరో నేత పేరు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ఆదిలాబాద్‌లోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం కావడంతో కాంగ్రెస్‌ నుంచి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశం వస్తుందని అందరూ భావిస్తుండగా ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు ప్రచారంలోకి వచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లాలోని తాండూర్‌ టికెట్‌ వ్యవహారంలో టిæకెట్‌ ఆశిస్తున్న వ్యక్తి ఓ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినా ‘పారాచూట్‌’కోటాలో ఆయనకే టికెట్‌ ఇచ్చేందుకు టీపీసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

స్క్రీనింగ్‌ కమిటీలో చర్చే లేదు.. సీఈసీలో ఎలా?
కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపులో భాగంగా ముందు పోటీ లేని 54 స్థానాలను ఖరారు చేసిన స్క్రీనింగ్‌ కమిటీ ఆ జాబితాను సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ)కి పంపించింది. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులుండటం, పొత్తులో కోల్పోయే టికెట్ల ప్రతిపాదనలపై మరో సమావేశంలో చర్చించాలనుకున్నారు. కానీ స్క్రీనింగ్‌ కమిటీలో చర్చించకుండానే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొందరు నేతల పేర్లు సీఈసీకి వెళ్లడం ఏఐసీసీ కార్యదర్శులకూ షాక్‌ ఇచ్చిందనే చర్చ ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. ఈ పేర్లను సీఈసీ జాబితాలో ఎలా చేర్చారనే విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కార్యదర్శులు, ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కోసం మంగళవారం ఢిల్లీలో జరగనున్న తుది దశ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగేలా కనిపిస్తోంది.

సిద్ధాంతాలు పట్టవా?
చెప్పేదొకటి... చేసేదొకటి అనే నానుడి కాంగ్రెస్‌ అధిష్టానానికి అతికినట్లు సరిపోతుందేమోననే భావన ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఊకదంపుడు ఉపన్యాసాల్లో పార్టీ ముఖ్య నేతలు చెప్పే మాటలు నీటి మూటలేనని అభ్యర్థుల ఎంపిక కసరత్తు ద్వారా తెలుస్తోందని కేడర్‌ విమర్శిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన ‘పారాచూట్ల’కు టికెట్లు కేటాయించేది లేదని స్వయంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పినా అది అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆరు నెలల ముందే అభ్యర్థుల జాబితా అంటూ చేసిన ఆర్భాటాలు, కుటుంబంలో ఒకరికే టికెట్‌ అంటూ చేసిన ప్రకటనలు, మూడుసార్లు ఓడిన వారికి, 30 వేల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన వారికి టికెట్లు ఇచ్చేది లేదంటూ పెట్టుకున్న నిబంధనల వంటివన్నీ చెప్పేందుకేనా సిద్ధాంతాలు అనే భావనను కలగజేస్తున్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. 

Advertisement
Advertisement