పంటల బీమాకు జగన్‌ పూచీ!

19 Mar, 2019 05:00 IST|Sakshi
తుపాను బాధిత రైతులతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌(ఫైల్‌)

అన్నదాతకు ఆలంబన

అది 2018, అక్టోబర్‌ 11 రాత్రి.. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. గంటల వ్యవధిలోనే వేలాది మంది రైతులు సర్వస్వాన్నీ కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చెందిన బడగల నర్సింహమూర్తి ఒకరు. ఆయన తనకున్న రెండెకరాల్లో సాంబమసూరి వరిని సాగు చేస్తున్నాడు.  పొట్ట దశలో ఉంది.  మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న దశలో వచ్చిన ఈ తుపాను ఆయన్ను మరింత నిరుపేదగా మార్చింది. భారీ నష్టాల పాల్జేసింది. ఇలా ఎందరో.. మరెందరో..

రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోవడంతో రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై చాలామంది కాడి కింద పడేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ పరిస్థితుల్లో స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల తర్వాత భారతీయ పార్లమెంటు బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటిస్తే అది గాడిన పడడానికి 22 ఏళ్లు పట్టింది. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఆ సంఖ్య 3 కోట్లకు దాటకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనైతే ఈ సంఖ్య 16 లక్షలకు మించలేదు. దేశంలో ఈవేళ సుమారు 12 కోట్లకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది.

బీమాకు ఎందుకింత ప్రాధాన్యత..?
ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్‌ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యం వచ్చింది. రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే విపత్తుల కారణంగా పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది. తిత్లీ, హుద్‌హుద్, ఫైలిన్‌ వంటి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే అన్నదాతలకు పంటల బీమా పథకం ఉడతాభక్తిగా తోడ్పడుతుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు.

ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియంను మినహాయించి ప్రభుత్వం గుర్తించిన బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని  రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్‌ బీమా పథకంలో చేరే అవకాశం ఉన్నా, చేరుతున్న వారి సంఖ్య పరిమితమే. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్‌ బుక్‌ జిరాక్స్‌ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు. అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరిగితే నిబంధనల మేరకు బీమా చెల్లిస్తారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన పంటనష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్‌ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు.

పంట కోత తరవాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకూ అకాల వర్షాలకు, తుపానువల్ల నష్టం వాటిల్లితే వ్యవసాయ క్షేత్రం నుంచి బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రి పంటల బీమా కింద రైతులు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే ఉద్యానపంటల రైతులతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, ఈ పథకంపై రైతుల్లో సరిగ్గా అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 2016 ఖరీఫ్‌లో రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా, ఆర్‌.డబ్లు్య.బి.సి.ఐ.ఎస్‌. కింద 15.09 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించుకున్నారు.

అంటే, రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగోవంతు కూడా పంటల బీమాను చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నవరత్నాలలో భాగంగా వైఎస్సార్‌ రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదని వైఎస్‌ జగన్‌ రైతులకు భరోసా ఇచ్చారు.

అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్‌లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా బాధ్యతను తానే తీసుకొని రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్‌ వచ్చేలా చేస్తుంది. రైతులను ఆదుకుంటుంది. అలా చేయడం వల్ల అన్నదాతలందరికీ ఆలంబన దొరుకుతుంది. గట్టి మేలు జరుగుతుంది. ఇటీవల ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎంతగా కీర్తిస్తున్నారో వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు అంతగా కొనియాడుతున్నారు.

– ఎ. అమరయ్య, చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

మరిన్ని వార్తలు