యజ్ఞరాజుకు..జలహారతి!

2 Sep, 2017 00:19 IST|Sakshi
యజ్ఞరాజుకు..జలహారతి!

రామ్‌గోపాల్, సాక్షి ప్రతినిధి
దేశానికి అన్నపూర్ణగా భాసిల్లిన తెలుగు నేల దాదాపుగా ఒక దశాబ్దంపాటు కరువు కాటకాలతో పట్టెడన్నం కోసం అలమటించింది. పది మంది ఆకలిని తీర్చే అన్నదాత ఆకలికేకలు పెట్టాడు. సేద్యం పడకేయడం.. అప్పుల భారం కర్షకులను ఉరితాళ్లకు వేళ్లాడేలా పురిగొల్పాయి. మహాప్రస్థానం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో అడుగడుగునా ఇదే విషాదగీతాలు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కదలించాయి. అధికారంలోకి వస్తే ఉప్పు సంద్రం పాలవుతోన్న వరద నీటిని ప్రాజెక్టుల ద్వారా మళ్లించి.. ప్రతి ఎకరాకు నీళ్లందించి.. కరువు రక్కసిని తరిమికొడతానని బాస చేశారు.

ఆంధ్రప్రదేశ్‌
అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో 85 ప్రాజెక్టులను ప్రారంభించి.. 97.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటూ మరో 23.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2004 వరకూ అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి సాగునీటి రంగానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. బడ్జెట్‌లో సింహభాగం నిధులను ప్రాజెక్టులకు కేటాయించారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నించారు.రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి.. 16 ప్రాజెక్టులను పూర్తి చేసి.. మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసిన వైఎస్‌ 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటూ 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. సాగునీటి రంగం చరిత్రలో ఇదో చెరిగిపోని రికార్డు. అధిక శాతం ప్రాజెక్టు పనులను ఓ కొలిక్కి తెచ్చిన వైఎస్‌.. జలయఙ్ఞం ఫలాలను సంపూర్ణ స్థాయిలో అందుబాటులోకి తెచ్చే క్రమంలోనే అమరుడయ్యారు.

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ముందు 1995 నుంచి 2004 వరకూ తొమ్మిదేళ్లు సీఎంగా చంద్రబాబునాయుడు వ్యవహరించారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం సాగునీటి ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేయడం.. అవసరం తీరాక వాటిని అటకెక్కించడం రివాజుగా మార్చుకున్నారు. అందుకు ప్రత్యక్ష తార్కాణాలూ ఉన్నాయి.రాయలసీమను సస్యశ్యామలం చేసే హంద్రీ–నీవా సుజల స్రవంతి పనులకు 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందు అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పనులు చేపట్టకుండా అటకెక్కించారు. 1999 సాధారణ ఎన్నికలకు ముందు హంద్రీ–నీవా ప్రాజెక్టును కేవలం ఐదు టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి ప్రాజెక్టుగా మార్చి.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాలువపల్లి వద్ద రెండోసారి పునాదిరాయి వేశారు. ఈసారి జనం నమ్మరనే భయం పట్టుకుందో ఏమో, పునాదిరాయికి అటు వైపు.. ఇటు వైపు మూడు మీటర్ల మేర కాలువ తవ్వారు చంద్రబాబు. ఎన్నికలు ముగియగానే యథాప్రకారం ఆ ప్రాజెక్టునీ మరిచారు.
 
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే రూ.6,850 కోట్ల వ్యయంతో 4.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవాను చేపట్టి.. తొలి దశను పూర్తి చేశారు. రెండో దశ పనుల్లో 50 శాతం పనులను పూర్తి చేశారు. అప్పట్లో ఎకరానికి నీళ్లందించేందుకు రూ.16,750ను వృథాగా ఖర్చు చేస్తున్నారంటూ వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు హంద్రీ–నీవా తన ఘనతగా చెప్పుకుంటోండటం విషాదకరం. ఐదు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను యుద్ధప్రాతిపదికన తెప్పించారు వైఎస్‌ఆర్‌. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులను తన హయాంలోనే సింహభాగం పూర్తి చేశారు. ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ పనులనూ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈలోగా రాజకీయ ప్రత్యర్థులు కేసులు వేయడంతో పనులు ఆగిపోయాయి. ఇదే సమయంలో కాంట్రాక్టర్‌ పనులు చేయకపోవడంతో కొత్త కాంట్రాక్టర్‌ ఎంపికకు తెర తీశారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్న సమయంలోనే వైఎస్‌ అసువులు బాశారు. వైఎస్‌ హయాంలో తవ్విన కుడి కాలువ మీదుగానే పట్టిసీమ ఎత్తిపోతలతో చెంబుడు గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపి నదుల అనుసంధానం చేశానంటూ చంద్రబాబు ఇప్పుడు గొప్పలు పోతున్నారు.విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును వైఎస్‌ పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టును ఆగస్టు 31, 2015న చంద్రబాబు జాతికి అంకితం చేశారు. వండిన వాళ్లొకరూ వడ్డించిన వాళ్లొకరూ అయ్యారు. వడ్డించిన వాళ్లు వంట రుచి తనదే అని చెప్పుకోవడం విడ్డూరం.

ముంపు ముప్పు!
వైఎస్‌ నిర్మించిన కొవ్వాడ అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ ముంపు నుంచి పంటలను కాపాడింది. పరోక్షంగా డెల్టా ప్రాంతంలోని వేల ఎకరాలు ముంపు బారిన పడేందుకు కారణమయ్యేది. కొవ్వాడ కాలువ వరదలకు కళ్లెం వేసే కొవ్వాడ అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ నిర్మాణాన్ని పోలవరం మండలం పట్టిసీమ వద్ద 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.56 కోట్ల అంచనాలతో మంజూరు చేశారు.అంతకుముందు పరిస్థితి ఏమిటంటే... వర్షాకాలంలో ఉధృతంగా వరదనీరు పొంగి కాలువగట్లకు గండి పడి వేల ఎకరాలు ముంపు బారిన పడేవి. ఏటా కాలువ పరీవాహక  ప్రాంతంలో దాదాపు ఏడు వేల ఎకరాలు ముంపునకు కారణమవుతూ పరోక్షంగా డెల్టా ప్రాంతం లోని మరో 10 వేల ఎకరాల పంటను వరద ముంచెత్తేది. రైతాంగం తీవ్రంగా నష్టపోయేది. వరదల సమయంలో కొవ్వాడ కాలువ అధిక జలాలను గోదావరిలోకి మళ్లించడం ద్వారా పంట పొలాలు, కొన్ని గ్రామాలకు కూడా రక్షణ కలుగుతుంది. వరదల సమయంలో కొవ్వాడ కాలువ ద్వారా 40,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. దీనిలో 4,500 క్యూసెక్కుల నీటిని సాగునీటిగా వినియోగించుకునేందుకు, మిగిలిన 36 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి మళ్లించేందుకు ఈ అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌ను నిర్మించారు వైఎస్‌ఆర్‌. ముంపు సమస్య పరిష్కారం కావడంతో ఈ ప్రాంత రైతాంగం మదిలో వైఎస్సార్‌ చెరగని ముద్రవేసుకున్నారు.

జలయజ్ఞం పథకంలో రైతులకు అంకితం చేసిన తొలి ప్రాజెక్టు స్వర్ణముఖి. ఆ తొలిదశలోనే శ్రీకాకుళం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు, తూర్పు గోదావరి జిల్లాలోని పుష్కర, భూపతిపాలెం, సూరంపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పశ్చిమగోదావరి జిల్లాలో తాడిపూడి, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, రామతీర్థసాగర్‌లను కూడా వైఎస్‌ జాతికి అంకితం చేశారు.ఆయన జలయజ్ఞంలో ప్రారంభించిన 85 ప్రాజెక్టుల్లో 13 ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తయ్యాయి. 29 ప్రాజెక్టులు ముప్పావు వంతు పనులు పూర్తి చేసుకుని కొంత ఆయకట్టుకు నీరందించే దశకు చేరాయి. మిగిలిన వాటిలో వెలిగొండ వంటి అనేక కీలకమైన ప్రాజెక్టులు దాదాపుగా యాభై శాతం పనుల దశలో ఉన్నాయి... ఇది పెద్దాయన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి దూరమయ్యే నాటికి ఉన్న పరిస్థితి. అవి ఇప్పటికీ నత్తనడకన కొన్ని, పూర్తిగా పడకేసి కొన్ని ఆయన లేని లోటుకు ప్రతీకలుగా ఉన్నాయి.
 
తాడిపూడి ఎత్తిపోతల పథకం
పశ్చిమగోదావరి జిల్లాలో మెట్టప్రాంతంలో 2,06,600 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.467.70 కోట్ల వ్యయంతో తాడిపూడి ఎత్తిపోతలను నిర్మించారు. దీనిని వైఎస్‌ఆర్‌ 2007 అక్టోబర్‌ 25న  ప్రారంభించారు.14 మండలాల పరిధిలోని 135 గ్రామాల ప్రజలకు ఈ పథకం ద్వారా సాగు, తాగునీరు అందించాలని పథకాన్ని రూపొందించారు. ప్రధాన కాలువ 84.45 కిలోమీటర్ల పొడవు ఉంది. నాలుగు సబ్‌లిప్టుల ద్వారా సుమారు 68,600 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. మిగిలిన ఆయకట్టు ప్రధానకాలువ, సబ్‌కెనాల్స్‌ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించారు.వైఎస్‌ రాజశేఖరరెడ్డి పథకం ప్రారంభించే సమయానికి 40 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందేది. వైఎస్‌ మృతి చెందే సమయానికి లక్ష ఎకరాలకు పైగా నీరిచ్చారు. ఆయన మరణానంతరం పనులను పూర్తిగా విస్మరించారు. అసంపూర్తిగా ఉన్న పనులు గత ఎనిమిదేళ్ల నుంచి అలాగే ఆగిపోయాయి.తాడిపూడి ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే 1,397 క్యూసెక్కుల నీరు అవసరం. ప్రభుత్వం ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయకపోవడం వలన సగం ఆయకట్టుకే నీరు వెళుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు గడుస్తున్నప్పటికీ అదనంగా ఒక్క చుక్కనీరిచ్చింది లేదు. అయితే... తాడిపూడి ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం 1.54 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇస్తున్నది మాత్రం లక్ష ఎకరాలకు మాత్రమే.

ఆరుతడి పంటలకోసం!
తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆరుతడి పంటలకు నిర్దేశించినది. పోలవరం కుడి ప్రధాన కాలువ, తాడిపూడి ఎత్తిపోతల కాలువ సమాంతరంగా సాగుతుంటాయి. పోలవరం కుడికాలువ 14.8 కిలోమీటర్ల పాయింట్‌ (గోపాలపురం మండలం గుడ్డిగూడెం సమీపంలో) నుంచి తాడిపూడి ఎత్తిపోతల ప«థకం కాలువ(అనంతపల్లి, ఎర్రకాలువ అక్విడెక్ట్‌æసమీపంలో) వరకు 38.119 కిలోమీటర్ల వరకు  సాగుతున్నాయి. వైఎస్‌ఆర్‌ హయాంలో తాడిపూడి పథకం మొదట నిర్దేశించిన 2,06,600 ఎకరాలే కాకుండా దేవరపల్లి సమీపంలో మరో రూ.48 కోట్ల వ్యయంతో 13వేల ఎకరాలకు నీరు అందించేందుకు ఐదో సబ్‌లిప్టును నిర్మించారు. ఇటీవల అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడానికి అధికారులు రూ.950 కోట్లు రివైజ్డ్‌ అంచనాలు పంపారు. ప్రభుత్వం మాత్రం ఆ పనులకు నిధులు కేటాయించలేదు.

సోమశిలకు వన్నె తెచ్చిన వైఎస్‌
పేద బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసే మనస్తత్వం వైఎస్‌ఆర్‌ది. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి.. ఇచ్చిన వరాలన్నీ ప్రజలకు అందిపుచ్చే ఆరాధ్య దైవంగా వెలుగొందిన ఆయన అన్నదాతకు అనుకున్నన్ని వరాలు ఇచ్చి అన్నవరంలోని సత్యనారాయణ స్వామి వలే కీర్తిగడించారు. ఒక్క ఎకరా కూడా ఎండనివ్వనని నెల్లూరు జిల్లాకు హామీ ఇచ్చారు. ప్రకటించిన విధంగానే సోమశిల ఆయన కలల సాకారం దిశగా పయనిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా 35 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు పరిమితమైన సోమశిల జలాశయాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే 51 టీఎంసీలకు పెంచి అనంతరం 71 టీఎంసీలు చేశారు. సోమశిల జలాశయం నుంచి ఉత్తర కాలువను కావలి వరకు పొడిగించడానికి ఎందరో స్థానిక నాయకులు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగినా ఫలితం కనిపించలేదు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉత్తర కాలువను 104 కిలోమీటర్లు ప్రకాశం జిల్లా రాళ్లపాడు వరకు పొడిగించారు.

ఫలితంగా నెల్లూరు జిల్లాలోని కలిగిరి, కొండాపురం మండలాల్లో పొలాలు కూడా అభివృద్ధిలోకి వచ్చాయి. ఉత్తర కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం 380 క్యూసెక్కుల నుంచి 500 క్యూసెక్కులకు పెంచడానికి లైనింగ్‌ పనులను చేపట్టారు. గతంలో 43 వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరించగా ఆయన ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయితే మరో 58.5 వేల ఎకరాలు ఉత్తర కాలువ పరిధిలో అభివృద్ధిలోకి వస్తాయి. దక్షిణ కాలువకు 41వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా కాలువ అభివృద్ధి పనులతో 61.53 ఎకరాల ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తుంది.

మరిన్ని వార్తలు