డాక్టర్‌ డెవలప్‌మెంట్‌

1 Sep, 2017 23:51 IST|Sakshi
డాక్టర్‌ డెవలప్‌మెంట్‌

భాగ్య నిర్మాత... భగీరథ!

అభివృద్ధి అంటే ఏమిటి? ఇటుకలు పేరిస్తే మాత్రమే వచ్చేది కాదేమో. రోడ్లు వేస్తేనే వచ్చేది కాదేమో. ఆకాశాన్ని అంటుకుంటే వచ్చేది కాదేమో. చంద్రుడి మీద కాలెడితే ... అంగారకుడి మీద పరిగెడితే చుక్కల్ని చేపడితే... అది మాత్రమే అభివృద్ధి కాదేమో. మరి అభివృద్ధి ఏమిటి? మనిషిని వృద్ధిలోకి తెచ్చేదే అభివృద్ధి. మనిషి జీవితంలో వెన్నెల పూసేలా చేసేదే అభివృద్ధి. ఏ గ్రహానికీ వెరువక అనుగ్రహంతో బతకగలిగేదే అభివృద్ధి. చుక్కల్ని కూడా ఎదగడానికి దిక్కులుగా మార్చేదే అభివృద్ధి. మనిషి కన్నీరును తాకి, అసహాయతను... ఆవేదనను అర్థం చేసుకొని, అతడితో  నాలుగడుగులు ఆప్యాయంగా నడిచి ఏం కావాలో గ్రహించి అవి ఇవ్వడానికి సంకల్పించడమే అభివృద్ధి. మాట తప్పక మడమ తిప్పక ముందడుగు వేయడమే అభివృద్ధి. రోడ్డు ఉన్న చోట వాహనం పొంద గలిగే స్థాయికి, పొలం ఉన్న చోట పైరు వేసే స్థాయికి, ఊరు ఉన్న చోట నగరం అందుకునే స్థాయికి, చదువు ఉన్న చోట ఉపాధి పొందే స్థాయికి, విద్య ఉన్న చోట ఉన్నత విద్యకు చేరే స్థాయికి, నలత ఉన్న చోట స్వస్థత పొందే స్థాయికి, నీడ ఉన్న చోట గూడు పొందే స్థాయికి, ఇల్లాలు ఇంటి ఖర్చుకు దిగులు పడని స్థాయికి, ఇంటి పెద్ద బయట తల ఎత్తుకు తిరిగే స్థాయికి అభివృద్ధి జరగాలి.

మహా కట్టడాల్లో కూడా ఒక మానవీయ స్పర్శ మహా కార్ఖానాల్లో అందరికీ భాగస్వామ్యం బీడును బంగారంగా మార్చగల దార్శనికత మట్టిని మాగాణం చేయగల చేతి చలవ ప్రతి ఒక్కరిదీ పెట్టే చేయిగా ఉండాలనే పెద్ద మనసు అందరూ సంతోషంగా ఉండాలనే గొప్ప తలంపు అలాంటి అభివృద్ధి కావాలి. న్యూనతను ఆత్మవిశ్వాసంగా మార్చే అభివృద్ధి కావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? నీటి మీద రాతలతో కాదు నీటితోనే సాధ్యం అని భావించడంతో అవుతుంది. కన్నీళ్లను నీళ్లతో కడిగేయాలనే దీక్షతో అవుతుంది. జలమే బలం అని గ్రహించడంతో అవుతుంది. భగీరథుడు ఒక్క గంగనే నేల దించాడు. కానీ తెలుగు నాట హలం కదిలే ప్రతి మూలన రైతుపాదం నడిచే ప్రతి తావున ఒక నదిని దించాలన్న తలంపు... అపర భగీరథ తలంపు అలాంటి తలంపుతోనే అభివృద్ధి సంపూర్ణం అవుతుంది. ప్రయత్నం యజ్ఞం అయినప్పుడు సామాన్యుడు మాన్యుడు అవుతాడు. ఆ యజ్ఞఫలాలు అందే సమయానికి నేత మారాజు అవుతాడు. మనసున్న మహాయోగి అవుతాడు.  గుండె గుండెన శాశ్వత చిత్రపటంగా నిలిచిపోతాడు.

అభివృద్ధిని అద్దంలో చూడాలని వుంటే... ఈ నిలువెత్తు తెలుగు తేజాన్ని నిండారా వీక్షించవచ్చు. అటువంటి అభివృద్ధిని అక్షరబద్ధం చేయబూనితే ‘వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి’ అనే ఓ సమ్మోహన శబ్ద తరంగం తనువెల్లా తగిలి రోమాంచితం చేస్తుంది.అభివృద్ధిని దాని విస్తృతార్థంలో దర్శించిన మహాదార్శనికుడు వై.ఎస్‌.ఆర్‌. విస్తారంగా మౌలిక వసతులు కల్పించడంతోపాటు, దానికి మానవ వనరుల అభివృద్ధినీ, సకల జన సంక్షేమాన్ని జోడించి నిజమైన అభివృద్ధి నమూనాను అమలుచేసిన ధీశాలి డాక్టర్‌ వై.ఎస్‌. ఆర్‌.ఆయన ఐదేళ్ల పదవీకాలం మౌలిక వసతుల అభివృద్థిలో ఒక విప్లవదశ. అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచ నగరాలతో అనుసంధానిస్తూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే( ఇప్పుడు మరో నాయకుడు ఈ ఘనతను తన ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకోవడం చూస్తున్నాం. కానీ, నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పూర్తయ్యాక ప్రారంభించింది కూడా వై.ఎస్‌. ప్రభుత్వమేనన్న విషయం అందరికీ తెలిసిందే).

నగరం చుట్టూ 156 కిలోమీటర్ల పొడవున ఔటర్‌ రింగ్‌ రోడ్డు తయారైందీ ఆయన హయాంలోనే. వేగంగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం కోసం అప్పటికి దేశంలో ఎక్కడా లేనంత పొడవైన ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కూడా వైఎస్‌ నిర్మించిందే. హైదరాబాద్‌లో ఐటీ రంగం పరుగులు తీసి రెండు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించిందీ ఆయన పాలనలోనే. మెట్రోరైలు ప్రాజెక్టును పట్టాలమీద కెక్కించి, ఐఐటీ, బిట్స్‌ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను హైదరాబాద్‌ బాట పట్టించింది కూడా ఆయనే.  గంగవరం, కృష్ణపట్నం ఓడరేవులు, సత్యవేడు పారిశ్రామిక మండలి ౖÐð ఎస్‌ ఘనతను చెప్పకనే చెబుతున్నాయి. ఈ దేశ చరిత్రే చకితమై చూసేలా... వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 86 సాగునీటి ప్రాజెక్టులను చేపడుతూ జలయజ్ఞానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇవి మచ్చుకు కొన్నే.

మానవ వనరుల అభివృద్ధికి వైఎస్‌ తపించిన తీరు నభూతో న భవిష్యతి. ఈ నేలపై పుట్టి పెరిగిన కోటానుకోట్ల కష్టజీవుల కుటుంబాల్లోని బిడ్డలు విద్యాగంధంతో విరబూయాలనీ, సాంకేతిక నిపుణతతో తొణికిసలాడాలనీ, తెలుగుజాతి ఖ్యాతిని దిగంతాల దాకా రెపరెపలాడించాలనీ కన్న కలల ఫలితమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం... ఈ పథకం అండతో బడివాకిలి దాటని కుటుంబాలెన్నో కాలేజీల గడప తొక్కిన విశేషాలు మనం చూసిన చరిత్ర. ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేసిన పేదింటి పిల్లల సాఫ్ట్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కోసం కూడా ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాఠశాల విద్యవరకే పూర్తిచేసిన యువకుల్లో సాంకేతిక నైపుణ్య శిక్షణకోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని (న్యాక్‌) నెలకొల్పారు. ఉపాధి హామీ పథకాన్ని దేశంలో మరెక్కడా లేనంత సమర్థంగా అమలు జరిపి కోట్లాదిమంది వ్యవసాయ కూలీల్లో, పావలా వడ్డీ పథకంతో మరికొన్ని కోట్లమంది ఆడబిడ్డల్లో ఆత్మగౌరవాన్ని పాదుకొల్పారు. ఇక ఆయన సంక్షేమ పాలన ఈ జాతిజనుల పెదవులపై నిరంతరం కదలాడే తిరుమంత్రమే.

విస్తరించిన హుడా: ప్రణాళికాబద్ధంగా విస్తరించినప్పుడే నగర జీవనం సౌకర్యవంతంగా ఉంటుంది. అజమాయిషీ లేకుంటే అంతా గజిబిజే. అదే దృష్టితో నాటి హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థ (హుడా)ను విస్తరించడానికి వైఎస్‌ ప్రణాళిక రచించారు. హైదరాబాద్‌ నగరాన్ని దేశంలోనే రెండో అతిపెద్ద మహానగరంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కి రూపం ఇచ్చారు. శివార్లను అనుసంధానం చేస్తూ అయిదు జిల్లాల పరిధిలో 849 గ్రామాలను నగరంలో విలీనం చేశారు. దాంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తీర్ణం 7,146 చ.కి.మీ. అయింది. ఫై్లఓవర్ల నిర్మాణం, ఇన్నర్‌ రింగ్‌రోడ్, ఔటర్‌ రింగ్‌రోడ్ల అనుసంధానానికి రేడియల్‌ రోడ్ల నిర్మాణం, లే అవుట్ల విధానం.. అన్నీ ఆయన ముందస్తు ఆలోచనలో భాగమే.

జీహెచ్‌ఎంసీ ఆవిర్భావం: మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఉన్న హైదరాబాద్‌ను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు వైఎస్‌. శివారులోని 12 మున్సిపాలిటీలను నగరంలో విలీనం చేస్తూ నాటి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను (ఎంసీహెచ్‌)ను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)గా మార్చారు. కేవలం 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఎంసీహెచ్‌... ఏకంగా 650 చదరపు కిలోమీటర్లతో జీహెచ్‌ఎంసీగా ఆవిర్భవించింది. అయిదో మెట్రో సిటీగా ప్రత్యేకతను నిలబెట్టుకుంది హైదరాబాద్‌.  ప్రస్తుతం దాని బడ్జెట్‌ రూ.4,500 కోట్ల స్థాయికి చేరింది. ఫలితంగా కనీస వసతులు కూడా కరువైన శివారు ప్రాంతాలు పాత ఎంసీహెచ్‌ను మించి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన రోడ్లు, జనాభాకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, అధునాతన వీధి దీపాలు... ఇలా శివారు ప్రాంతాలు అన్నిరకాలుగా అభివృద్ధి చెందాయి. ఆ అభివృద్ధి ఎంతగా అంటే... నగరం నడిబొడ్డున నివసించడం కంటే శివారు ప్రాంతాల్లో ఉండేందుకే ప్రజలు ఇష్టపడే స్థాయికి చేరాయి. 2006లోనే రూ.1756 కోట్లతో 78,746  ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు వైఎస్‌ఆర్‌.

ఔటర్‌ రింగ్‌రోడ్డు: దేశంలో మరెక్కడా లేనట్టుగా ఎనిమిది లేన్లతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ వే హైదరాబాద్‌ నగరం చుట్టూరా రూపుదిద్దుకుంది. ఈ ఔటర్‌ రింగ్‌రోడ్డు హైదరాబాద్‌కే హైలైట్‌. భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులు నగరంలోకి రాకుండా వెలుపలి నుంచే వెళ్లిపోయేందుకు ఈ ఔటర్‌ రింగ్‌రోడ్డు దోహదం చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే శివారు కాలనీలవారు నగర ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా సులభంగా ఈ రింగ్‌రోడ్‌ మీదుగా వెళ్లిపోవచ్చు. రాబోయే 30 ఏళ్ల పరిస్థితిని అంచనావేసి దూరదృష్టితో వైఎస్‌ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే...  రూ.ఏడు వేల కోట్ల భారీ వ్యయంతో 162 కిలోమీటర్ల మేర  రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు, ఇది దేశంలోనే గొప్ప రాజమార్గంగా పేర్కొనే ముంబై – పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ను మించిన హంగులతో రూపొందుతోంది.

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు: రాజీవ్‌గాం«ధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంతో హైదరాబాద్‌కు కొత్త కళ వచ్చింది. దేశ విదేశాలకు విమానయాన సదుపాయం ఏర్పడటంతో నగరానికి ప్రపంచంతో సంబంధాలు పటిష్టమయ్యాయి. విదేశీ పర్యాటకులతో హైదరాబాద్‌ ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 2008లో రూ.2487 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. నగరానికి అధునాతన సదుపాయాలున్న విమానాశ్రయం రావడంతో, దానికి అనుబంధంగా అంతర్జాతీయస్థాయి సౌకర్యాలున్న హోటళ్లు రావడం వంటి అనుబంధ అభివృద్ధి తోడైంది. ఆ రకంగా ఈ ప్రాజెక్టు భాగ్యనగరానికి ఇంటర్నేషనల్‌ లుక్‌ తెచ్చి పెట్టింది.

దేశంలోనే పొడవైన ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే: పీవీ ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే... ఇది దేశంలోనే అత్యంత పొడవైన ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ రద్దీని, ఆ పద్మవ్యూహం నుంచి బయటపడి విమానాశ్రయం చేరడానికి ఎదురయ్యే అవస్థలను సరిగ్గా అంచనా వేశారు వైఎస్‌ఆర్‌. ఫలితంగా... రూ.439 కోట్ల వ్యయంతో మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వంతెన నిర్మితమైంది. ఏకంగా 11.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ ఫ్లై ఓవర్‌ దేశంలోనే అతి పొడవైంది. ఈ వంతెన... అనేక ఇతర నగరాలకు మార్గదర్శకంగా మారింది.

మెట్రో చుక్‌.. చుక్‌...: గ్లోబలైజేషన్‌తో దేశాలు దగ్గరైన నేపథ్యంలో కూడా హైదరాబాద్‌ నగర వాసులకు నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్లాలంటే నరకప్రాయంగా ఉండేది. గంటల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చేది. ఈ కష్టానికి విరుగుడు రవాణా మాధ్యమాలను విస్తృతంగా పెంచడమేనని నమ్మారు వైఎస్‌. ఆ నమ్మకమే మెట్రో రైలు. దాదాపు రూ.14 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో కార్యాచరణ రూపుదిద్దుకుంది. నాగోలు–శిల్పారామం, ఎల్‌బీనగర్‌–మియాపూర్, జూబ్లీ బస్టాండు–ఫలక్‌నుమా రూట్లలో మొత్తం 72 కిలోమీటర్ల కారిడార్‌తో రూపుదిద్దుకుంటోంది. మరికొద్ది రోజుల్లో నాగోలు–మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులతో పరుగులు పెట్టబోతున్నాయి.

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన: హైదరాబాద్‌ నగరానికి ఉన్నంత చరిత్ర హుస్సేన్‌ సాగర్‌ జలాశయానికీ ఉంది. హుస్సేన్‌సాగర్‌ ఈ చారిత్రక నగర అందాన్ని పెంచింది. కానీ శివార్లలోని పారిశ్రామిక వాడల వ్యర్థాలతో సాగర్‌ జలాలు కలుషితమయ్యాయి. అప్పటి వరకు ఎందరు పాలకులు మారినా సాగర్‌ను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. వై.ఎస్‌. ప్రభుత్వం 2008లో సాగర్‌ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.370 కోట్ల జపాన్‌ బ్యాంకు సాయంతో శుద్ధి పనులు చేపట్టింది. ఫలితంగా పారిశ్రామిక వాడల వ్యర్థ జలాలు సాగర్‌లోకి కలవకుండా దారి మళ్లించడానికి కాలువల నిర్మాణం జరిగింది.

నగరానికి గోదావరి: శరవేగంగా విస్తరిస్తున్న మహానగరానికి తాగునీటిని అందించడం కత్తిమీద సామే. ఏడాదికీ ఏడాదికీ నీటి అవసరం పెరుగుతోంది. ఈ పరిస్థితిలో గోదావరి నీటిని నగరానికి తీసుకురావడమే చక్కటి ప్రత్యామ్నాయం అని భావించారు వైఎస్‌ఆర్‌. అలా 2008లో ‘మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సుజల స్రవంతి’ (గోదావరి మంచినీటి పథకం) పథకానికి బీజం పడింది. ఆయన రూ.3,800 కోట్ల అంచనా వ్యయంతో ఈ భారీ మంచినీటి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారుల్లోని శామీర్‌పేట వరకు సుమారు 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వ్యవస్థను, మార్గమధ్యంలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. దశలవారీగా 36 టీఎంసీల జలాలను జంటనగరాలకు తరలించాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ఐటీ వైఎస్‌ హయాం...
రాష్ట్రంలో వైఎస్సార్‌ హయాంలోనే ఐటీ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరిగింది. 2003–04 ఐటీ రంగంలో 71,445 మందికి ఉద్యోగాలను కల్పించారు. ఇదే 2009లో ఈ సంఖ్య 2,51,786కు పెరిగింది. 2004 వరకు రాష్ట్రం నుంచి రూ.5025 కోట్ల రూపాయల విలువైన ఐటీ ఎగుమతులు మాత్రమే ఉండేవి. 2010లో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.36 వేల కోట్లకు పెరిగింది. భారత ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 15 శాతం. ఐటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానిది దేశంలోనే నాలుగో స్థానం. వైఎస్సార్‌ హయాంలోనే రాష్ట్రానికి ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీలు వచ్చాయి. ఇన్ఫోసిస్, టీఏఎస్, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ కంపెనీల స్థాపనకు ప్రోత్సహించారు. వైఎస్సార్‌ హయాంలోనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐటీఐఆర్‌)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 50 వేల ఎకరాల్లో రెండు దశల్లో ఐటీఐఆర్‌ అభివృద్ధి, రూ.2.19 కోట్లు ఖర్చు చేసి 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ఈ కార్యాచరణ ఉద్దేశం.

ఫైనాన్షియల్‌ డిస్ట్రి్టక్ట్‌... ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాద్‌లో శాశ్వతంగా ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాలను కలుపుతూ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు అన్నీ ఇక్కడ ఏర్పాటవుతున్నాయి.

ఉన్నత విద్య... ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా ఉన్నత విద్యను అందించే ప్రముఖ సంస్థలు వైఎస్సాఆర్‌ హయాంలోనే హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. 2008 ఆగస్టులో బిట్స్‌ పిలానీ, 2009 ఫిబ్రవరిలో హైదరాబాద్‌ ఐఐటీ ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్‌లో యూఎస్‌ఏ కాన్సులేట్‌... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఎవరైనా అమెరికా వెళ్లాలంటే వీసాల కోసం చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో హైదరాబాద్‌లోనే అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌ ప్రయత్నించి సఫలమయ్యారు. ఐటీ రంగం అభివృద్ధికి ఇది మరింత దోహదపడింది.

>
మరిన్ని వార్తలు