త్రీమంకీస్ - 11

4 Nov, 2014 09:31 IST|Sakshi
త్రీమంకీస్ - 11

- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 11

 
 ‘‘దేనికో?’’ జైలర్ అడిగాడు.
 ‘‘భయంతో సార్.’’
 ‘‘నోట మాట రాలేదా?’’
 ‘‘వచ్చింది సార్. కాని భయంతో ఇంకోటి కూడా వచ్చింది’’ వానర్ సిగ్గుపడుతూ చెప్పాడు.
 ‘‘సరే. మీ నాన్న పేరు?’’
 ‘‘సింహాచలం.’’
 ‘‘ఊరు కూడా సింహాచలం కదా?’’
 ‘‘కాదు సర్. భద్రాచలం.’’
 ‘‘నువ్వేం దొంగతనం చేశావ్?’’
 ‘‘ఏటియం లోంచి డబ్బుని విత్‌డ్రా చేసినందుకు పట్టుకున్నారు సార్.’’
 ‘‘అదేం నేరం కాదే? నేనూ ఇవాళ ఉదయం ఏటియంలోంచి ఐదు వేలు విత్‌డ్రా చేశాను.’’
 ‘‘కాని నా దగ్గర ఏటియం కార్డ్ లేదు సార్.’’
 ‘‘ఓహో. అసలు బేంక్‌లో అకౌంటే లేదా?’’
 ‘‘లేదు సార్. మెషీన్ డిజైన్ సబ్జెక్ట్‌లో నాకు ఎయిటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సార్. కాబట్టి ఏటియం యంత్రాన్ని ఎలా పగలకొట్టాలో దాని డ్రాయింగ్‌ని పరిశీలించగానే ఇట్టే అర్ధమైంది సర్.’’
 ‘‘అసలు నీకా డ్రాయింగ్ ఎక్కడిది?’’
 ‘‘నెట్టింట్లో సార్.’’
 ‘‘బేంక్ మేనేజర్ నట్టింట్లోనా?’’
 ‘‘కాదు సార్. నెట్టిల్లంటే ఇంటర్నెట్ అని అర్ధం సర్. ఇంటర్నెట్లో గూగుల్ చేస్తే దొరికింది సార్.’’
 ‘‘నేనెన్నడూ గూగుల్ చేయను. ఎందుకంటే మా ఆవిడకి అంతా తెలుసు. ఇంటర్నెట్‌ని బాగా ఉపయోగిస్తూంటావా?’’ జైలర్ ప్రశ్నించాడు.
 ‘‘ఇంట్లో ఉంటే సగం రోజు దాంట్లోనే ఉంటాను సర్.’’
 ‘‘ఎలా పట్టుబడ్డావు? సర్వైలెన్స్ కెమేరాలో చిక్కా?’’
 ‘‘నేను మూర్ఖుడ్ని కాను సర్. బట్టతో నా మొహం కప్పుకుని లోపలకి వెళ్ళి దాని లెన్స్ మీదకి ఆ బట్టని వేశాను సర్.’’
 ‘‘మరెలా పట్టుబడ్డావు?’’
 ‘‘నెట్టిల్లు వల్ల సార్.’’
 ‘‘ఆ?’’
 ‘‘అదే. ఇంటర్నెట్ వల్ల సార్.’’
 ‘‘ఇంటర్నెట్టే పట్టించిందా?’’
 ‘‘అవును సర్.’’
 ‘‘హౌ ఇంట్రెస్టింగ్? ఎలా? ఇంటర్నెట్ ఎలా పట్టించింది?’’ జైలర్ ఆసక్తిగా అడిగాడు.
 ‘‘నాది మొదటి దొంగతనం కదా సార్? ఏటియం యంత్రాన్ని విప్పాక అందులోంచి తీసి కుప్పగా పోసిన ఐదు లక్షల రూపాయల నోట్ల మధ్య సెల్ఫీ ఫొటో తీసుకుని దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకున్నాను సర్. దీన్ని చాలామంది షేర్ చేశారు సార్. అలా అలా అది  సిఐ గారి మరదలికి చేరింది. ఆమె గారు సిఐ గారికి చెప్పారు సర్. ఆయన మా ఇంటికి వచ్చి డబ్బు స్వాధీనం చేసుకుని నన్ను ఇక్కడికి తెచ్చారు సార్.’’
 ‘‘ఫేస్‌బుక్ రాక మునుపు ఎంతమంది నేరస్థులు తప్పించుకున్నారో?’’ సిఐ విచారంగా చెప్పాడు.
 ‘‘ఐతే నువ్వు ఉత్త స్టుపిడ్‌వి అన్నమాట’’ జైలర్ చెప్పాడు.
 ‘‘స్టుపిడిటీ నేరమా సార్?’’ వానర్ అడిగాడు.
 ‘‘కాదు.’’
 ‘‘స్టుపిడిటీ నేరం కానప్పుడు నన్ను జైల్లో ఎందుకు కూర్చోపెడుతున్నారు సార్?’’
 ‘‘కోర్టులో ఈ పాయింట్ మీద వాదించి బయటపడు. బెస్టాఫ్ లక్.’’
 ‘‘థాంక్స్ సర్.’’
 ‘‘ఏమైనా అనుమానాలు ఉన్నాయా?’’
 ‘‘పీజాహట్ నించి మేం పీజాని ఆర్డర్ చేసి మా సెల్‌కి తెప్పించుకోవచ్చాండి?’’
 ‘‘లేదు. కుదరదు.’’
 ‘‘పోనీ కోక్2హోమ్‌డాట్ కామ్ నించి కోక్‌ని? ఫెస్టివ్ ఆఫర్ నడుస్తోంది సార్.’’
 ‘‘అలాంటి ఆలోచనలు పెట్టుకోక. బయట ప్రపంచంతో ఇక నీకు సంబంధం కట్’’ జైలర్ చెప్పాడు.
 ‘‘అలాగే సర్. చూస్తూండండి. నేను ఈ జైల్లోని బెస్ట్ ఖైదీ అనే పేరు తెచ్చుకుంటాను.’’
 వానర్ తనకి ముట్టినట్లుగా జైలర్ సిఐ అఫీషియల్‌గా కాగితం ఇచ్చాక అతను వెళ్ళిపోయాడు. గార్డ్‌లు వానర్‌ని రిమాండ్ ఖైదీల సెల్‌కి తీసుకెళ్ళారు.
   
 ఆ సెల్ కూడాఅన్ని సెల్స్‌లా ఆరు బై ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉంది. అందులో అప్పటికే ఉన్న ఖైదీ ఏదో కూనిరాగం తీస్తున్నాడు. కింద బెర్త్ మీద పడుకున్న వ్యక్తి తెల్ల జుట్టు కనిపిస్తోంది. అలికిడికి ఆయన తల తిప్పి చూశాడు. వయసు డెబ్బై ఐదు పైనే ఉండచ్చని ముడతలు పడ్డ అతని మొహాన్ని బట్టి వానర్ అనుకున్నాడు. గార్డ్ ఆ సెల్ తలుపు బయట తాళం పెట్టుకుని వెళ్ళాక ఆయన లేచి కూర్చుంటూ అడిగాడు.
 ‘‘ఏం చేసి వచ్చావ్?’’
 ‘‘దొంగతనం.’’
 ‘‘జేబా? ఘరానానా?’’
 ‘‘ఏటిఎం పగలకొట్టాను.’’
 ‘‘పేరు? కూర్చో’’ పక్కకి జరిగాడు.
 ‘‘వానర్. మీ పేరు?’’
 ‘‘పట్టయ్య. పట్టాభి రామయ్య. కాని అంతా పట్టయ్య అంటారు. నేను రైళ్ళల్లో పాటలు పాడుకుంటూ సంపాదించేవాడ్ని. రైల్వే తత్కాల్ టిక్కెట్లని దొంగ పేర్లతో బ్లాక్ చేని ప్రయాణీకులకి అమ్ముతున్న నేరం మీద పట్టుకున్నారు. రెండు విచారణలు అయ్యాయి.’’
  (రేపు ఈ సీరియల్‌లో మరో రెండు కొత్త వింత పాత్రలని ఊహించగలరా?)
 మళ్లీ  రేపు
 
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  
 సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
 లెటర్స్
 - ఆదివారం పొద్దుపుచ్చడం కోసం సీరియల్ చూసి ఈ 2 రోజుల నుంచి పేపర్ కొంటున్నాను. వెరైటీగా ఉంది. నిన్నటి భాగంలో పాత్రల పేర్లతో (జడ్జ్ సాక్షులు వచ్చారా అని అడిగినప్పుడు లాయర్ చెప్పిన సంభాషణలు) చాలాచాలా వెరైటీగా ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉంది ఈ సీరియల్.
 - భరద్వాజ్ వైవిఎస్, (bharadwazhr@gmail.com)

మరిన్ని వార్తలు