బంగారం కొనేటప్పుడు జాగ్రత్త!

30 Jul, 2013 19:15 IST|Sakshi
బంగారు నగలు

బంగారం కొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో  బంగారం సాంప్రదాయ అవసరాలు తీర్చడంతోపాటు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుంది. మన దేశంలో మహిళలకు బంగారు ఆభరణాలపై మక్కువ ఎక్కువ. అంతే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా పసిడి ఉపయోగపడుతుందని మనవారు భావిస్తారు. అందువల్ల బంగారం ధర పెరిగినా ఆ స్థాయిలో డిమాండ్ తగ్గదు. అయితే బంగారం కొనేటప్పుడు చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకోరు. బంగారం తూకంలో, నాణ్యతలో తేడాలు ఉంటాయి.  దానిని అవసరాలకు తిరిగి అమ్మే సమయంలో కాని వా మోసపోయినట్లు తెలుసుకోలేరు.

క్యారెట్లు:  ముఖ్యంగా బంగారం కొనే ముందు 22 క్యారెట్ల బంగారానికీ, 24 క్యారెట్ల బంగారానికీ మధ్య తేడా తెలుసుకోవాలి. 24 క్యారెట్లలో 99 శాతం బంగారం, మిగతా ఒక శాతం వెండి, రాగి మిశ్రమం ఉంటుంది. 22 క్యారెట్లలో 92 శాతం బంగారం, మిగతా ఎనిమిది శాతం వెండి, రాగి మిశ్రమం ఉంటుంది. బంగారంలో తరుగు తీసేటప్పుడు - ఈ మిశ్రమాన్ని తొలగిస్తారు.

స్వచ్ఛత:  ఇక బంగారం స్వచ్ఛత విషయానికి వచ్చేసరికి గీటురాయిని ఉపయోగించి మనమే తెలుసుకోవచ్చు.  బంగారంలో రాగి ఎక్కువగా ఉంటే గీసినపుడు  గీత రాగి రంగులోకి వస్తుంది. దానిపై యాసిడ్‌పోస్తే, రాగిని యాసిడ్‌ కరిగిస్తుంది.  అదే బంగారంపై యాసిడ్‌ పోస్తే, బంగారు వర్ణం వస్తుంది. దీంతో ఆ బంగారంలో కల్తీని గుర్తించవచ్చు.  శబ్దాన్ని బట్టి కూడా బంగారం స్వచ్ఛత కనుక్కొనవచ్చ.   గోల్డ్‌ కాయిన్‌ 22 క్యారెట్లదా? లేక  24 క్యారెట్లదా? అన్నది తెలుసుకోవాలంటే,  గోల్డ్‌ కాయిన్స్‌ని పైకి ఎగురవేసి నప్పుడు ఖంగుమనే శబ్దం వస్తే అది 22 క్యారెట్ల బంగారమని అర్థం! అదే మొత్తని శబ్దం వస్తే అది 24 క్యారెట్లని అర్థం!  ఇవన్నీ అశాస్త్రీయ పద్ధతులు. ఇప్పుడు బంగారం  స్వచ్చతను హాల్‌ మార్కింగ్‌ ద్వారా నిర్ణయిస్తున్నారు. హాల్‌మార్క్‌ గుర్తు ఉన్న బంగారన్ని అమ్మితే, దాని విలువకు సమానంగా బంగారం రావాలి. అలా షాపు వారు ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని  నిపుణులు చెపుతున్నారు. అందుకే కొన్న వెంటనే హాల్‌మార్కింగ్‌  చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం కొనే వారు తెలుసుకోవలసిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. బంగారానికి  బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఈ విషయం  చాలా కొద్దిమందికే తెలుసు. బీమా కావాలనుకునేవారు బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా  వ్యాట్‌ రసీదు తీసుకోవాలి. వ్యాట్‌ అంటే వ్యాల్యూ యాడెడ్‌ టాక్స్‌. మీరు కొన్న బంగారంపై ఈ టాక్స్‌ను చెల్లిస్తారు. కానీ, ఆ మీరు అడగకపోతే దుకాణందారు రసీదును ఇవ్వడు. మీరు ఆ వ్యాట్ రసీదు తీసుకుంటే, మీ బంగారానికి బీమా సౌకర్యం లభిస్తుంది.  ఈ రశీదు తీసుకుంటే మీరు కొన్న బంగారం నిజమైన బంగారం అని అర్ధం.  బంగారం కొనేవారు ఈ జాగ్రత్తలన్నీ పాటించడం మంచిది.

మరిన్ని వార్తలు