అప్పుడు ఆమని...ఇప్పుడు రంభ

23 Jul, 2014 12:39 IST|Sakshi
అప్పుడు ఆమని...ఇప్పుడు రంభ

గృహ హింస నిరోధక చట్టం 498ఎ పేరు చెబితే చాలు భర్తల గుండెల్లోనే కాదు అతని తల్లిదండ్రులు, అక్కా, చెల్లెళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి నెలకొంది. భర్త, అత్తింటివారు వేధిస్తున్నారంటూ 498ఎ కింద మహిళలు పెడుతున్న కేసులు నానాటికి అధికం అవుతున్న విషయం తెలిసిందే. పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లోనో, ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్న ఆడపడుచులు సైతం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితి సాధారణ మహిళలకే కాదు సెలబ్రిటీలకు తప్పటం లేదు. గతంలో సినీ నటి ఆమని ... తాజాగా రంభ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

వరకట్నం కోసం భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు వేధిస్తున్నారంటూ సినీనటి రంభపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఈ కేసు పెట్టింది. హైదరాబాద్ కు చెందిన పల్లవికి 1999లో రంభ సోదరుడు శ్రీనివాస వెంకటేశ్వర్‌రావుతో వివాహం జరిగింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా రంభ తరచు తిట్టడం, కొట్టడం చేస్తోందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

గతంలో మరో నటి ఆమనిపై కూడా వరకట్న వేధింపుల కేసు నమోదు అయ్యింది. కట్నం కోసం భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు ఆమని వేధిస్తుందంటూ ఆమె సోదరుడు మాదప్ప శ్రీనివాస్ భార్య లీలావతి ఫిర్యాదు చేసింది. అప్పట్లో నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఆమనిపై కేసు కూడా నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఆమె కోర్టు చుట్టూ తిరిగారు కూడా. విచారణ అనంతరం ఆమనిపై న్యాయస్థానం కేసు కొట్టివేసింది.

ఇక ఢిల్లీలో పేరుగాంచిన తీహార్ జైల్లో ‘సాస్-ననంద్ బ్యారక్’గా అందరూ పిలుచుకునే అక్కడి ఆరో నెంబర్ బ్యారక్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అక్కడ ఖైదీలంతా మహిళలే కావడం విశేషం. వరకట్న వేధింపుల కేసుల్లో పోలీసులు అరెస్టు చేసిన అత్తలు, ఆడపడుచులతో సుమారు 3000 మందితో ఆ ప్రాంగణం నిత్యం కిటకిటలాడుతుంది. ఇక 498ఎ కింద బెయిల్ వచ్చే పరిస్థితి లేనందున, విచారణ దశలో కేసును ఉపసంహరించుకునే వీలు లేనందున ఖైదీలు నెలల తరబడి జైలులో గడపాల్సిందే. వరకట్నం కేసుల్లో సెక్షన్ 498ఎ బాగా దుర్వినియోగం అవుతున్నట్లు సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

 

మరిన్ని వార్తలు